రాజకీయం.. రసకందాయం | Changes in the state politics in 2017 | Sakshi
Sakshi News home page

రాజకీయం.. రసకందాయం

Published Sun, Dec 24 2017 1:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Changes in the state politics in 2017 - Sakshi

గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ఆధిక్యత చాటుతూ వస్తున్న అధికార టీఆర్‌ఎస్‌.. ఈ ఏడాదీ తన పట్టును ప్రదర్శించింది. మరిన్ని చేరికలతో సంస్థాగతంగా బలోపేతానికి ప్రయత్నించడంతోపాటు నామినేటెడ్‌ పదవుల పందేరంతో నేతల్లో అసంతృప్తినీ తొలగించింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్‌కు దీటుగా చేరికలను ప్రోత్సహించడంతోపాటు పలు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న సానుకూలతను రాష్ట్ర బీజేపీ అందిపుచ్చుకోలేక పోయింది. ఆ పార్టీ నేతలు ఆధిపత్యపోరులోనే మునిగిపోయారు. ఇక టీటీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయి నామమాత్రంగా మారిపోయింది. వామపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాయి.          
- సాక్షి, హైదరాబాద్‌

కాంగ్రెస్‌ కొత్త దూకుడు
ఆందోళనలు.. సభలు.. చేరికలతో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది దూకుడుగా వ్యవహరించింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దిశగా పలు కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై అధికార టీఆర్‌ఎస్‌ను బలంగా నిలదీసింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ ఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ టీజేఏసీ, ఇతర రాజకీయ పక్షాలు చేపట్టిన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడంతోపాటు ప్రత్యక్షంగా ఆయా ఆందోళనల్లో పాల్గొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన విధానాలను ఎండగడుతూ ర్యాలీలు, సభలు నిర్వహించింది. ఇక కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌ స్థానంలో రామచంద్ర కుంతియా నియామకమయ్యారు.

పెద్ద ఎత్తున ఆందోళనలతో.. 
కాంగ్రెస్‌ పార్టీ నోట్ల రద్దు అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఆర్‌బీఐ ఎదుట ధర్నా చేయడంతో పాటు వరంగల్, నిజామాబాద్‌లో ఆవేదన సభలు జరిపింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా సమస్యలపై రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించింది. ధర్నాచౌక్‌ ఎత్తివేతను నిరసిస్తూ భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వరంగల్‌లో ధర్నాలు, మౌన దీక్షలు చేపట్టింది. రైతాంగ సమస్యలపై నర్సాపూర్‌లో పాదయాత్ర నిర్వహించింది. గల్ఫ్‌ బాధితుల సమస్యలపై హైదరాబాద్‌లో సభ జరిపింది. జూన్‌లో రైతు గర్జన పేరిట సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ కూడా హాజరయ్యారు. ఇక మియాపూర్‌ భూకుంభకోణంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. సిరిసిల్ల జిల్లాలో దళితులపై పోలీసుల దుశ్చర్యకు నిరసనగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆధ్వర్యంలో ‘చలో సిరిసిల్ల’కార్యక్రమాన్ని జరిపి దళితులకు భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని కలిసేందుకు కాంగ్రెస్‌ బృందం నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించింది. రైతుల రుణమాఫీ అంశంపై చలో అసెంబ్లీ పేరిట భారీ కార్యక్రమం నిర్వహించింది. ఇక అక్టోబర్‌ 31న టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చేరడం రాష్ట్ర కాంగ్రెస్‌ బలోపేతానికి తోడ్పడింది.

బీజేపీ ఆధిపత్య పోరుతోనే సతమతం
బీజేపీ ఈ ఏడాది పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మే నెలలో మూడు రోజుల పాటు చేసిన రాష్ట్ర పర్యటన కూడా బీజేపీ రాష్ట్ర నేతలు, కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఉపయోగపడలేదు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపైనా దృష్టి పెట్టలేదు. అటు బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్, బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డి వేర్వేరుగా పోటీ కార్యక్రమాలు జరిపారు. గతేడాది చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ అంశాల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ కేంద్ర ప్రభుత్వానికి మద్దతివ్వడంతో.. రాష్ట్రంలో ఆ పార్టీని నిలదీసే విషయంలో రాష్ట్ర బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. టీఆర్‌ఎస్‌తో రాజీ లేదంటూ పదే పదే ప్రకటనలు ఇచ్చినా పెద్దగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేకపోయింది. అయితే నిరుద్యోగుల సమస్యపై హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించడం, ఇదే సమస్యపై పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో కొంత హల్‌చల్‌ చేసింది. బీసీల అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చింది. కానీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు తీసుకోవడంతో నిరసన తెరమరుగైంది. ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నేరుగా బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డితో పేచీ ఉంది. మొత్తంగా రాష్ట్ర బీజేపీ ఈ ఏడాది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంపై పెద్దగా దృష్టిసారించలేకపోయింది. 

టీఆర్‌ఎస్‌ అన్ని అంశాల్లోనూ ఆధిక్యతే!
రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఏడాది కూడా అధికార టీఆర్‌ఎస్‌ ఆధిపత్యం చూపింది. ఏడాది పొడవునా వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగాయి. మరో ఏడాదిన్నరలోగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై అధినాయకత్వం దృష్టి పెట్టింది. పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను చేర్చుకుంది. భూపాలపల్లి, మంథని, నల్లగొండ, భువనగిరి తదితర నియోజకవర్గాలకు చెందిన ఆయా పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ 16వ ప్లీనరీ సందర్భంగా కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న రాష్ట్ర కమిటీని నియమించారు. అనుబంధ సంఘాల కమిటీలనూ ఏర్పాటు చేయడం ద్వారా సంస్థాగత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్లీనరీ కంటే ముందు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏకంగా 72 లక్షల సభ్యత్వం నమోదైనట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ప్లీనరీ అనంతరం వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి పట్టును మరోసారి నిరూపించుకుంది. 

పదవుల పందేరం ముమ్మరం.. 
టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంతోకాలంగా ఎదురు చూసిన పదవుల పందేరం ఈ ఏడాది ముమ్మరమైంది. పార్టీ సీనియర్లకు, తొలి నుంచి పార్టీలో కొనసాగినవారికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చింది. ఇక మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీచర్‌ ఎమ్మెల్సీ కోటాలో జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేల కోటాలో గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావులను ఎమ్మెల్సీలుగా గెలిపించుకుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ విజయం సాధించింది. ఇక అసెంబ్లీ వేదికగా కూడా టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలపై పైచేయి సాధించింది. రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో గ్రామస్థాయిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పెద్దపీట వేశారు. 

ప్రగతి భవన్‌ వేదికగా.. 
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ వేదికగా జనహితలో పలు వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్‌ నేరుగా కలసి చర్చించారు. ఆయా వర్గాల సమస్యలను విని అప్పటికప్పుడే నిర్ణయాలు ప్రకటించడం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మరోవైపు వివిధ రాజకీయ పక్షాల విమర్శలనూ టీఆర్‌ఎస్‌ దీటుగా తిప్పికొట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శలను తీవ్రస్థాయిలో తిప్పికొట్టింది. మరోవైపు పార్టీలో పెరిగిపోయిన ఒత్తిడి, పదవుల కోసం ఏర్పడిన డిమాండ్‌తో పలువురు నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. 

నేతల మధ్య ఆధిపత్య పోరు.. 
మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. పలు నియోజకవర్గాల్లో పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. దీంతోపాటు పార్టీలో చేరిన కొత్త నాయకులకు, ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతల మధ్య పొసగక సమస్యలు తలెత్తాయి. మొత్తంగా ఈ ఏడాది అధికార టీఆర్‌ఎస్‌ సంస్థాగత అంశాలపై దృష్టి సారించి బలం పెంచుకోవడంతో పాటు, ఆయా రాజకీయ పక్షాలపై ఆధిపత్యం నిలుపుకొంది.

టీడీపీ నానాటికీ తీసికట్టు
ఈ ఏడాది తెలంగాణ టీడీపీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనమవడంతో బాగా బలహీనపడిన టీటీడీపీ... చివరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో నామమాత్రంగా మారిపోయింది. మరికొందరు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో.. టీటీడీపీలో వేళ్లపై లెక్కపెట్టగలిగిన సంఖ్యలోనే నాయకులు మిగిలారు. చివరికి ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం వెంపర్లాడే దుస్థితికి చేరిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కొంతకాలంగా జారిపోతున్న నాయకులను కాపాడుకోవడంలోనే నిమగ్నమైన టీటీడీపీ.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం, పోరాటాలు చేయడాన్ని మర్చిపోయింది. టీడీపీ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలోనే రాష్ట్ర నేతలు ఘర్షణ పడ్డారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్‌ల మధ్య ఏమాత్రం పొసగలేదు. రేవంత్‌ కూడా వెళ్లిపోవడంతో టీడీపీలో స్తబ్ధత నెలకొంది. సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు, రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి కొందరు సీనియర్లు మాత్రమే మిగిలారు. తాజాగా టీటీడీపీ సీనియర్‌ నాయకురాలు ఉమా మాధవరెడ్డి సైతం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులుగా ఉన్న వారు సైతం అటు టీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్‌ బాట పట్టడంతో టీటీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. 

సీపీఎం లాల్‌నీల్‌ నినాదం
సీపీఎం ఈ ఏడాదిలో తమ పోరాట పంథాను మార్చింది. ఏకకాలంలో మార్క్స్‌అంబేడ్కర్‌ల ఎజెండాను నెత్తికెత్తుకుని ‘లాల్‌నీల్‌’ నినాదంతో ఉద్యమాలు చేపట్టింది. గతేడాది (2016) అక్టోబర్‌లో మొదలుపెట్టిన మహాజన పాదయాత్రను ఈ ఏడాది మార్చి 19న ‘సమర సమ్మేళనం’పేరిట హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు నేతలు ఐదువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. హైదరాబాద్‌ సభలో భారీగా కార్యకర్తలతో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరై విజయన్‌ పాల్గొన్నారు. ఇక్కడ మొదటిసారిగా సీపీఎం సంస్థాగత కార్యక్రమ వేదికపై ప్రజాసంఘాలు, సామాజిక సంఘాల నాయకులకు స్థానం కల్పించింది. గద్దర్, విమలక్క, కంచ ఐలయ్య వంటి వారితో వేదికను పంచుకుంది. ఇక సీపీఎం జూలైలో ‘తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్య వేదిక (టీమాస్‌)’ను ఏర్పాటు చేసింది. నేరెళ్లలో దళితులపై దాడులు, రైతుల ఆత్మహత్యలు, మంథని, యాదాద్రి భువనగిరిలలో జరిగిన పరువు హత్యలు, నిరుద్యోగ సమస్య వంటి వాటిపై ఆందోళనలు నిర్వహించింది. ప్రస్తుతం సంస్థాగతంగా జిల్లా మహాసభలు నిర్వహిస్తోంది. వామపక్ష, లౌకిక శక్తులతో కలసి బహుజన వామపక్ష ప్రజాతంత్ర వేదికను నిర్మించే సన్నాహాల్లో సీపీఎం ఉంది.

సీపీఐ పోరుబాటతో ప్రజల్లోకి..
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ప్రజలను చేరుకునేందుకు, వివిధ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సీపీఐ ‘పోరుబాట’పేర బస్సు యాత్ర నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలను కలసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం నేరుగా సీఎంకు బహిరంగ లేఖలు రాశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాపార్కు వద్ద నుంచి ధర్నా చౌక్‌ను ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ఆందోళనలు నిర్వహించింది. సీపీఐ ఆధ్వర్యంలోనే చాడ వెంకటరెడ్డి కన్వీనర్‌గా ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ఏర్పాటైంది. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయడంతో పాటు రాష్ట్రపతిని కలసి వినతి పత్రం సైతం అందజేశారు. మరోవైపు సింగరేణి ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ రెండు డివిజన్లనే గెలుచుకోగలిగినా.. ఓట్ల శాతాన్ని మాత్రం పెం చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement