ఎన్నికల్లో బహుముఖ పోరు
కాంగ్రెస్, సీపీఐల నడుమ పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొంది. పలు పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు 291 మంది బరిలో మిగిలారు. టీఆర్‌ఎస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒంటరి పోరు చేస్తుండగా.. కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్ రెబల్స్‌ను నయానో భయానో బుజ్జగించింది. ఆ పార్టీ ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కార్పొరేషన్‌లోనే తిష్ట వేసి.. ఒకే డివిజన్ నుంచి రెండు మూడు నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరణ చేయించడం గమనార్హం. ఎన్నికల్లో అన్ని పార్టీలు, స్వతంత్రులతో కలిపి 50 డివిజన్లకు మొత్తం 587 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ నుంచే ఆశావహులు 139 మంది నామినేషన్లు వేశారు.
టీఆర్‌ఎస్ ఆశావహులు తమకే బీఫాం వస్తుందని ఆశించి.. చాలా మంది చివరికి భంగపడ్డారు. ఆ పార్టీ నేతలు దగ్గరుండి మరీ నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరించుకునేలా చేశారు. కొందరు బీఫాం రాలేదని ఆవేదనకు లోనైతే.. మరికొందరు కన్నీటి పర్యంతమయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకుని బరువెక్కిన హృదయంతో వెళ్లిపోయారు. తాము పార్టీకేం అన్యాయం చేశామంటూ ఆవేదన వెలిబుచ్చారు. శుక్రవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణలు జరిగాయి. 587 నామినేసన్లు దాఖలైతే.. ఇందులో 11 నామినేషన్లను తిరస్కరించారు. ఒకే అభ్యర్థి రెండు మూడు నామినేషన్లు వేసిన 100 నామినేషన్లను పక్కన పెట్టారు. అలాగే మరో ఐదు నామినేషన్లు ఇతర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 471 నామినేషన్లు అర్హత సాధిస్తే.. ఇందులో 180 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇవన్నీ పోగా.. 291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
సామ, దానాలతో దారికి...
టీఆర్‌ఎస్ నుంచి ఆశావహులు చాలామంది నామినేషన్లు వేశారు. వారిని ఎలాగైనా బరిలో నుంచి తప్పించేందుకు ఆ పార్టీ నేతలు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించారు. సుమారు రెండింతల ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడం.. చివరి వరకు వీరు బీఫాం కోసం ఆరాటపడ్డారు. అయితే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ దగ్గరుండి మరీ ఆ పార్టీ నేతలు వేసిన నామినేషన్లను చాలా వరకు ఉపసంహరించుకునేలా చేశారు. పార్టీ పరంగా సహకారం, మంచి భవిష్యత్ ఉంటుందని అన్ని రకాలుగా నామినేషన్లు వేసిన వారికి బుజ్జగింపులు, హెచ్చరికలు చేసి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. చాలామంది తమకు బీఫాం ఇవ్వాలని, తాము పార్టీ కోసం కష్టపడి పని చేశామంటూ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఎమ్మెల్సీ పల్లా, రెడ్యానాయక్‌ను వేడుకుని.. కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా నామినేషన్లు వేసిన ఆశావహులను ఆ పార్టీ నేతలు విత్‌డ్రా చేయించడంలో సఫలీకృతులయ్యారు.
42 మంది స్వతంత్రులు
టీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి బీఫాం అందక, ఇతరులు మొత్తం 42 మంది బరిలో ఉన్నారు. వీరిని కూడా తమ పార్టీకే సహకరించాలని ఇప్పటికే అన్ని పార్టీలు ఉప సంహరణల అనంతరం బుజ్జగింపులకు దిగాయి. వారికి డివిజన్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అంచనా వేసుకుని ఎంతో కొంత నజరానా ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది ఇలా పార్టీల వైపు ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మిగిలిన కొంతమందిలో కీలకమైన అభ్యర్థులు తమ ఓట్లను కొల్లగొడతారేమోనని పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు హైరానా పడుతున్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించారు.