రోడ్డెక్కిన టీడీపీ విభేదాలు
⇒శ్రీకాళహస్తిలో అధికార పార్టీ కౌన్సిలర్ల నిరసన
⇒మున్సిపల్ వైస్ చైర్మన్ వర్గానికి వ్యతిరేకంగా చైర్మన్ వర్గం పోరాటం
⇒అడ్డుకున్న పోలీసులు.. ఏడుగురి అరెస్టు
⇒తమ అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారని చైర్మన్ రాధారెడ్డి ఆగ్రహం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లతో కలసి రోడ్డెక్కారు. మంత్రి మద్దతుదారుడైన వైస్‌చైర్మన్ వర్గానికి చెందిన కౌన్సిలర్ తండ్రి మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరసన దీక్షకు పూనుకున్నారు. 25వ వార్డు కౌన్సిలర్ ఉత్తరాది శరవణకుమార్ తండ్రి లక్ష్మణమూర్తి మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించాలని బ్యానర్ చేతపట్టి టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కంఠా ఉదయకుమార్, శాంతి, లీలావతి, మిన్నల రవితోపాటు బీజేపీ కౌన్సిలర్లు లత, ముత్తు, కోఆప్షన్ సభ్యుడు ధనంజయులు సోమవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం పెండ్లి మండపం వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్ శరవణ్‌కుమార్ తండ్రి, మంత్రి అనుచరుడు లక్ష్మణమూర్తి కూరగాయల మార్కెట్ టెండర్ పాడుకుని రూ.17.36లక్షలు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉందన్నారు. ఏడాదిగా ఆ మొత్తం చెల్లించకపోయినా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ వ్యక్తి రూ.500 చెల్లించాల్సి ఉంటే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. ఇటీవల స్కిట్ కళాశాల ఆస్తిపన్ను చెల్లించలేదని కళాశాలను జప్తు చేస్తామని హెచ్చరించిన అధికారులు మున్సిపల్ వైస్‌చైర్మన్‌కు అనుచరుడి బకాయిలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉందని డిమాండ్ చేశారు.
పెండ్లి మండపం వద్ద రగడ
మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు ధర్నా చేసుకునేందుకు రెండు రోజుల క్రితం డీఎస్పీ వెంకటకిషోర్‌కు వినతిపత్రం అందజేసి అనుమతి పొందారు. ఆమేరకు సోమవారం ముత్యాలమ్మ ఆలయం నుంచి మొదట ర్యాలీ నిర్వహించారు. సీఐ చిన్నగోవింద్ నేతృత్వంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయిన్పటికీ వారు పెండ్లిమండపం వద్ద దీక్షకు కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
మా అనుచరులను ఎలా అరెస్టుచేస్తారు? : రాధారెడ్డి
‘‘మా అనుచరులు.. గౌరవప్రదమైన కౌన్సిలర్లు.. అంతేకాదు అధికారపార్టీకి చెందిన నాయకులు.. వారిని అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోపెడుతారా.. మున్సిపాలిటీకి బకాయిలు ఉంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేయాల్సి ఉందని నేను ఎప్పుడో తెలియజేశాను. ఓ కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ మా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేయడం నేరమా...’’ అంటూ మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ర్యాలీలు, దీక్షలు చేపట్టరాదనే ఉద్దేశ్యంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు రాధారెడ్డికి వివరించారు. దాంతో పోలీసులు కౌన్సిలర్లను, కోఆప్షన్ సభ్యుడిని వదిలిపెట్టారు.