Class conflicts
-
పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు
సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లె: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవిని రూ.20 కోట్లకు అమ్ముకోవాలని చూశారని.. అలాంటి వ్యక్తి వెంట ఎలా నడవాలని పలువురు ముఖ్య నేతలు సతీష్‌రెడ్డి ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. తమను బీటెక్ రవి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్ రవిని నమ్మితే నట్టేట మునుగుతామని తేల్చి చెప్పారు. మీరే పార్టీని నడిపించాలని సతీష్‌రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ శంకించారు: సతీష్‌రెడ్డి 30 ఏళ్లపాటు తాను నిజాయితీగా పనిచేసినా చంద్రబాబు, లోకేశ్ తనను శంకించారని, తాను అమ్ముడుపోయినట్టుగా మాట్లాడారని సతీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు ఎన్ని ఇబ్బందులున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పించి మళ్లీ ఇన్చార్జిగా తననే నియమిస్తే పార్టీలో చేరతానని సతీష్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఇందుకు చంద్రబాబును ఒప్పిస్తామని, త్వరలోనే కార్యకర్తలతో వెళ్లి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటామని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, పార్టీని వదిలి వెళ్లిపోయిన సతీష్‌రెడ్డిని టీడీపీ నేతలు, కార్యకర్తలు కలవడంపై బీటెక్ రవి, ఆయన వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్‌రెడ్డి సమావేశ వివరాలను బీటెక్ రవి చంద్రబాబు, లోకేశ్‌తోపాటు పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాను కూడా చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకుంటానని బీటెక్ రవి తేల్చి చెప్పినట్టు సమాచారం. పులివెందులలో అరకొరగా ఉన్న టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి రచ్చకు దిగడంపై ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో పులివెందులలో టీడీపీ వర్గపోరు మరింత రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం సతీష్‌రెడ్డితో సమావేశమైన వారిలో తొండూరు మాజీ జెడ్పీటీసీ శివమోహన్‌రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకుడు తూగుట్ల సిద్ధారెడ్డి, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలస్వామిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథరెడ్డి, చక్రాయపేట టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఓబుళరెడ్డి, హరినాథరెడ్డిలతోపాటు మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు. -
రోడ్డెక్కిన టీడీపీ విభేదాలు
⇒శ్రీకాళహస్తిలో అధికార పార్టీ కౌన్సిలర్ల నిరసన ⇒మున్సిపల్ వైస్ చైర్మన్ వర్గానికి వ్యతిరేకంగా చైర్మన్ వర్గం పోరాటం ⇒అడ్డుకున్న పోలీసులు.. ఏడుగురి అరెస్టు ⇒తమ అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారని చైర్మన్ రాధారెడ్డి ఆగ్రహం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లతో కలసి రోడ్డెక్కారు. మంత్రి మద్దతుదారుడైన వైస్‌చైర్మన్ వర్గానికి చెందిన కౌన్సిలర్ తండ్రి మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరసన దీక్షకు పూనుకున్నారు. 25వ వార్డు కౌన్సిలర్ ఉత్తరాది శరవణకుమార్ తండ్రి లక్ష్మణమూర్తి మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించాలని బ్యానర్ చేతపట్టి టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కంఠా ఉదయకుమార్, శాంతి, లీలావతి, మిన్నల రవితోపాటు బీజేపీ కౌన్సిలర్లు లత, ముత్తు, కోఆప్షన్ సభ్యుడు ధనంజయులు సోమవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం పెండ్లి మండపం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్ శరవణ్‌కుమార్ తండ్రి, మంత్రి అనుచరుడు లక్ష్మణమూర్తి కూరగాయల మార్కెట్ టెండర్ పాడుకుని రూ.17.36లక్షలు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉందన్నారు. ఏడాదిగా ఆ మొత్తం చెల్లించకపోయినా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ వ్యక్తి రూ.500 చెల్లించాల్సి ఉంటే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. ఇటీవల స్కిట్ కళాశాల ఆస్తిపన్ను చెల్లించలేదని కళాశాలను జప్తు చేస్తామని హెచ్చరించిన అధికారులు మున్సిపల్ వైస్‌చైర్మన్‌కు అనుచరుడి బకాయిలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉందని డిమాండ్ చేశారు. పెండ్లి మండపం వద్ద రగడ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు ధర్నా చేసుకునేందుకు రెండు రోజుల క్రితం డీఎస్పీ వెంకటకిషోర్‌కు వినతిపత్రం అందజేసి అనుమతి పొందారు. ఆమేరకు సోమవారం ముత్యాలమ్మ ఆలయం నుంచి మొదట ర్యాలీ నిర్వహించారు. సీఐ చిన్నగోవింద్ నేతృత్వంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయిన్పటికీ వారు పెండ్లిమండపం వద్ద దీక్షకు కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మా అనుచరులను ఎలా అరెస్టుచేస్తారు? : రాధారెడ్డి ‘‘మా అనుచరులు.. గౌరవప్రదమైన కౌన్సిలర్లు.. అంతేకాదు అధికారపార్టీకి చెందిన నాయకులు.. వారిని అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోపెడుతారా.. మున్సిపాలిటీకి బకాయిలు ఉంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేయాల్సి ఉందని నేను ఎప్పుడో తెలియజేశాను. ఓ కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ మా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేయడం నేరమా...’’ అంటూ మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ర్యాలీలు, దీక్షలు చేపట్టరాదనే ఉద్దేశ్యంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు రాధారెడ్డికి వివరించారు. దాంతో పోలీసులు కౌన్సిలర్లను, కోఆప్షన్ సభ్యుడిని వదిలిపెట్టారు. -
‘మహా’ ఘర్షణ
తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మహానాడు ప్రాంగణం సాక్షిగా పదవులు, పంపకాల కోసం తెలుగు తమ్ముళ్లు తన్నులాడుకోవడం జిల్లాలో సంచలన ం కలిగించింది. దూషణల పర్వంతో ప్రారంభమైన గొడవ చివరికి ముష్టిఘాతాల వరకు చేరుకోవడంపై ఆ పార్టీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నగర పార్టీ నాయకులు వీధికెక్కి మరీ ఘర్షణ పడడంతో పార్టీ పరువు బజారున పడిందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఆధిపత్యం కోసం నిన్నటి వరకు ఫిర్యాదుల పర్వంతో అంతర్లీనంగా సాగిన విభేదాలు గురువారం ఏకంగా ఘర్షణకు దారితీసి భగ్గుమన్నాయి. ఏకంగా ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లింది. మహానాడుకు ముందు పార్టీ పరువుతీసేలా తమ్ముళ్లు కొట్లాడుకోవడంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. తిరుపతి సిటీ : తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసంతృప్తి సెగలు తిరుగుబాటుకు దారితీశాయి. మహానాడు వేదిక వద్ద రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 27 నుంచి మూడ్రోజుల పాటు తిరుపతిలో మహానాడు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే పలు కమిటీలను కూడా ఏర్పాటుచేసింది. జిల్లా నేతలతో పాటు నగర నాయకులు కొంతమందికి ఈ కమిటీల్లో స్థానం కల్పించారు. ఇక్కడే కొంత విభేదాలు పొడచూపాయి. మహానాడు కమిటీల్లో తమకు సముచిత స్థానం కల్పించలేదన్న భావన కొందరిలో పెరిగింది. కొత్తగా వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తూ పార్టీ జెండా మోసిన తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి కూడా కొంత మందిలో ఉంది. ఈ అసంతృప్తి గొడవలకు కారణమైంది. పార్టీలో సభ్యత్వం లేని వారికి కూడా కమిటీల్లో స్థానం కల్పించారన్న భావన ఇబ్బందికరంగా మారింది. నాయకుల్లో అంతర్లీనంగా దాగిఉన్న ఈ విభేదాలు గురువారం మహానాడు మైదానంలో బయటపడ్డాయి. వేదికైన మహానాడు ప్రాంగణం తిరుపతిలో బుధవారం జరిగిన టీడీపీ నగర కమిటీ సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్దగా పాల్గొనలేదు. ఖాళీ కుర్చీలున్న ఫోటోలను అలీఖాన్ అనే నాయకుడు వాట్సప్‌లో అప్లోడ్ చేసి పార్టీ పెద్దలకు పంపాడు. దీనిపై గురువారం మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మైదానానికి వెళ్లిన టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, కృష్ణాయాదవ్ అక్కడున్న ప్రాంగణ వేదిక కమిటీ సభ్యులు పీఎస్ అలీఖాన్, తెలుగు యువత నాయకుడు మధులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా భాస్కర్‌యాదవ్, అలీఖాన్ మధ్య ఘర్షణ నెలకొంది. మధుబాబు తిరగబడడంతో భాస్కర్‌యాదవ్, కృష్ణయాదవ్‌తోపాటు అనుచరులు తలపడ్డారు. ఆ సమయంలో మధుబాబుపై పిడిగుద్దులు గుద్ది ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ సమాచారం తెలిసి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, మధుబాబు, రాజారెడ్డి, రఫీ మరి కొంతమంది మహానాడు సభా స్థలిలో ఉన్న కట్టెలు, రాడ్లు తీసుకుని కేకలు వేసుకుంటూ అక్కడున్న నగర అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, కష్ణాయాదవ్లపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో కృష్ణయాదవ్ తమ్ముడు ఆనంద్‌బాబు యాదవ్, యుగంధర్, అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని డాక్టర్ కోడూరి బాలసుబ్రమణ్యంపై ఘర్షణకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు.. దాడి సంఘటనపై యువత జిల్లా అధికార ప్రతినిధి మధుబాబు, దంపూరి భాస్కర్ యాదవ్ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. నగర కమిటీ నేతలు మంత్రి గోపాలకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జోక్యంతో విరమించుకున్నారు. గాయపడిన పత్రికా ఫొటోగ్రాఫర్ తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడుతుండగా ఫొటోలు తీసిన ఓ దినపత్రిక ఫొటోగ్రాఫర్ భాస్కర్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో ఆయన కిందిపడిపోయి కెమెరా లెన్స్ పాడవడంతో పాటు కుడికాలికి గాయమైంది. -
తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు
కడప: తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. నాయకుల ఒంటెత్తు పోకడలపై కేడర్ ఆవేదన చెందుతోంది. పార్టీనే నమ్ముకున్న వారిని కాదని ధనవంతుల వైపు మొగ్గు చూపుతుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కష్ట కాలంలో ఉన్నవారిని కాదని అరువు నేతల కోసం అర్రులు చాస్తుండటం పొమ్మనలేక పొగపెట్టడమేనని పలువురు వాపోతున్నారు. అధినేత చెవులో జోరీగలాగ చేరి జిల్లాలో టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నారని పోట్లదుర్తి బ్రదర్స్‌పై తమ్ముళ్లు పలువురు మండిపడుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం టీడీపీ వ్యవహారాల్లో అధికమైంది. పార్టీ పటిష్టత కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆయన చర్యలున్నట్లు కేడర్ అభిప్రాయ పడుతోంది. అంకితభావంతో పనిచేస్తున్న వారికి ఇబ్బందులు సృష్టించడమే అందుకు కారణంగా వారు చెప్పుకుంటున్నారు. జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తరుణంలో ప్రొద్దుటూరులో టీడీపీ ఎమ్మెల్యేగా మల్లేల లింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈమారు ఆయనకు టికెట్ దక్కకుండా పోట్లదుర్తి సోదరులు సీఎం రమేష్, సీఎం సురేష్ చురుగ్గా పావులు కదుపుతున్నారని అక్కడి కేడర్ మండిపడుతున్నట్లు సమాచారం. ఏకైక ఎమ్మెల్యేకి ముప్పుతిప్పలు.... జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ప్రొద్దుటూరు మాత్రమే చేజిక్కించుకుని టీడీపీ ఉనికిని ఎమ్మెల్యే లింగారెడ్డి గుడ్డిలోమెల్లలాగా నిలిపారని ఆపార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. అలాంటి లింగారెడ్డిని మరింత ప్రోత్సహించి మరోమారు గెలుపొందేందుకు కృషి చేయకుండా అసలు టికెట్ దక్కకుండా శల్యసారధ్యం చేస్తున్నారని పోట్లదుర్తి బ్రదర్స్‌పై ఆయన వర్గీయులు విరుచుకుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని టీడీపీలోకి రప్పించి ఆయనకు టికెట్ ఇప్పించాలనే దిశగా సీఎం రమేష్ అడుగులు వేస్తున్నట్లు లింగారెడ్డి వర్గీయులు మథనపడుతున్నట్లు సమాచారం. అలాగే రాజంపేటలో సైతం రాజ్యసభ సభ్యుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్న నేతలంద ర్ని ఒకతాటిపైకి తేకుండా మరో కొత్తనేత వైపు మొగ్గుచూపడం ఏమిటని అక్కడి కేడర్ ప్రశ్నిస్తోంది. పార్టీ కోసం కష్టనష్టాల కోర్చిన మాజీ మంత్రి బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి కోసం అర్రులు చాస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఆర్ఆర్ తనయుడి తీవ్ర ప్రయత్నం... జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సైతం రాజ్యసభ సభ్యుడు రమేష్ చర్యల కారణంగా విసిగిపోతున్నట్లు సమాచారం. వర్గ రాజకీయాల నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ నేత రాంప్రసాద్‌రెడ్డి వైపు పాలకొండ్రాయుడు మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే అందులో కూడా అడ్డుపుల్ల వేస్తూ మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి(వాసు)ని టీడీపీలోకి తెచ్చుకోవాలని ఎంపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాయుడు వర్గీయులకు నచ్చలేదని సమాచారం. జిల్లా టీడీపీలో ఇటీవల సీఎం రమేష్ జోక్యం అధికమైపోయిందని, పార్టీ కోసం తాను ఖర్చు చేయకుండా ఇతరులతో ఖర్చు చేయించే దిశగా ఆయన చర్యలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు సాక్షిప్రతినిధితో పేర్కొన్నారు.