కడప: తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. నాయకుల ఒంటెత్తు పోకడలపై కేడర్ ఆవేదన చెందుతోంది. పార్టీనే నమ్ముకున్న వారిని కాదని ధనవంతుల వైపు మొగ్గు చూపుతుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కష్ట కాలంలో ఉన్నవారిని కాదని అరువు నేతల కోసం అర్రులు చాస్తుండటం పొమ్మనలేక పొగపెట్టడమేనని పలువురు వాపోతున్నారు. అధినేత చెవులో జోరీగలాగ చేరి జిల్లాలో టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నారని పోట్లదుర్తి బ్రదర్స్‌పై తమ్ముళ్లు పలువురు
మండిపడుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం టీడీపీ వ్యవహారాల్లో అధికమైంది. పార్టీ పటిష్టత కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆయన చర్యలున్నట్లు కేడర్ అభిప్రాయ పడుతోంది. అంకితభావంతో పనిచేస్తున్న వారికి ఇబ్బందులు సృష్టించడమే అందుకు కారణంగా వారు చెప్పుకుంటున్నారు. జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తరుణంలో ప్రొద్దుటూరులో టీడీపీ ఎమ్మెల్యేగా మల్లేల లింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈమారు ఆయనకు టికెట్ దక్కకుండా పోట్లదుర్తి సోదరులు సీఎం రమేష్, సీఎం సురేష్ చురుగ్గా పావులు కదుపుతున్నారని అక్కడి కేడర్ మండిపడుతున్నట్లు సమాచారం. ఏకైక
ఎమ్మెల్యేకి ముప్పుతిప్పలు....
జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ప్రొద్దుటూరు మాత్రమే చేజిక్కించుకుని టీడీపీ ఉనికిని ఎమ్మెల్యే లింగారెడ్డి గుడ్డిలోమెల్లలాగా నిలిపారని ఆపార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. అలాంటి లింగారెడ్డిని మరింత ప్రోత్సహించి మరోమారు గెలుపొందేందుకు కృషి చేయకుండా అసలు టికెట్ దక్కకుండా శల్యసారధ్యం చేస్తున్నారని పోట్లదుర్తి బ్రదర్స్‌పై ఆయన వర్గీయులు విరుచుకుపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని టీడీపీలోకి రప్పించి ఆయనకు టికెట్ ఇప్పించాలనే దిశగా సీఎం రమేష్ అడుగులు వేస్తున్నట్లు లింగారెడ్డి వర్గీయులు మథనపడుతున్నట్లు సమాచారం. అలాగే రాజంపేటలో సైతం రాజ్యసభ సభ్యుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్న నేతలంద ర్ని ఒకతాటిపైకి తేకుండా మరో కొత్తనేత వైపు మొగ్గుచూపడం ఏమిటని అక్కడి కేడర్ ప్రశ్నిస్తోంది. పార్టీ కోసం కష్టనష్టాల కోర్చిన మాజీ మంత్రి బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి కోసం అర్రులు చాస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు.
ఆర్‌ఆర్ తనయుడి తీవ్ర ప్రయత్నం...
జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సైతం రాజ్యసభ సభ్యుడు రమేష్ చర్యల కారణంగా విసిగిపోతున్నట్లు సమాచారం. వర్గ రాజకీయాల నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ నేత రాంప్రసాద్‌రెడ్డి వైపు పాలకొండ్రాయుడు మొగ్గు చూపినట్లు సమాచారం.
అయితే అందులో కూడా అడ్డుపుల్ల వేస్తూ మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి(వాసు)ని టీడీపీలోకి తెచ్చుకోవాలని ఎంపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాయుడు వర్గీయులకు నచ్చలేదని సమాచారం. జిల్లా టీడీపీలో ఇటీవల సీఎం రమేష్ జోక్యం అధికమైపోయిందని, పార్టీ కోసం తాను ఖర్చు చేయకుండా ఇతరులతో ఖర్చు చేయించే దిశగా ఆయన చర్యలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు సాక్షిప్రతినిధితో పేర్కొన్నారు.