‘మహా’ ఘర్షణ
తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మహానాడు ప్రాంగణం సాక్షిగా పదవులు, పంపకాల కోసం తెలుగు తమ్ముళ్లు తన్నులాడుకోవడం జిల్లాలో సంచలన ం కలిగించింది. దూషణల పర్వంతో ప్రారంభమైన గొడవ చివరికి ముష్టిఘాతాల వరకు చేరుకోవడంపై ఆ పార్టీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నగర పార్టీ నాయకులు వీధికెక్కి మరీ ఘర్షణ పడడంతో పార్టీ పరువు బజారున పడిందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఆధిపత్యం కోసం నిన్నటి వరకు ఫిర్యాదుల పర్వంతో అంతర్లీనంగా సాగిన విభేదాలు గురువారం ఏకంగా ఘర్షణకు దారితీసి భగ్గుమన్నాయి. ఏకంగా ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లింది. మహానాడుకు ముందు పార్టీ పరువుతీసేలా తమ్ముళ్లు కొట్లాడుకోవడంపై అధిష్టానం సీరియస్ అయ్యింది.
తిరుపతి సిటీ : తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసంతృప్తి సెగలు తిరుగుబాటుకు దారితీశాయి. మహానాడు వేదిక వద్ద రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 27 నుంచి మూడ్రోజుల పాటు తిరుపతిలో మహానాడు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే పలు కమిటీలను కూడా ఏర్పాటుచేసింది. జిల్లా నేతలతో పాటు నగర నాయకులు కొంతమందికి ఈ కమిటీల్లో స్థానం కల్పించారు. ఇక్కడే కొంత విభేదాలు పొడచూపాయి. మహానాడు కమిటీల్లో తమకు సముచిత స్థానం కల్పించలేదన్న భావన కొందరిలో పెరిగింది. కొత్తగా వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తూ పార్టీ జెండా మోసిన తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి కూడా కొంత మందిలో ఉంది. ఈ అసంతృప్తి గొడవలకు కారణమైంది. పార్టీలో సభ్యత్వం లేని వారికి కూడా కమిటీల్లో స్థానం కల్పించారన్న భావన ఇబ్బందికరంగా మారింది. నాయకుల్లో అంతర్లీనంగా దాగిఉన్న ఈ విభేదాలు గురువారం మహానాడు మైదానంలో బయటపడ్డాయి.
వేదికైన మహానాడు ప్రాంగణం
తిరుపతిలో బుధవారం జరిగిన టీడీపీ నగర కమిటీ సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్దగా పాల్గొనలేదు. ఖాళీ కుర్చీలున్న ఫోటోలను అలీఖాన్ అనే నాయకుడు వాట్సప్‌లో అప్‌లోడ్ చేసి పార్టీ పెద్దలకు పంపాడు. దీనిపై గురువారం మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మైదానానికి వెళ్లిన టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, కృష్ణాయాదవ్ అక్కడున్న ప్రాంగణ వేదిక కమిటీ సభ్యులు పీఎస్ అలీఖాన్, తెలుగు యువత నాయకుడు మధులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా భాస్కర్‌యాదవ్, అలీఖాన్ మధ్య ఘర్షణ నెలకొంది. మధుబాబు తిరగబడడంతో భాస్కర్‌యాదవ్, కృష్ణయాదవ్‌తోపాటు అనుచరులు తలపడ్డారు. ఆ సమయంలో మధుబాబుపై పిడిగుద్దులు గుద్ది ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ సమాచారం తెలిసి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, మధుబాబు, రాజారెడ్డి, రఫీ మరి కొంతమంది మహానాడు సభా స్థలిలో ఉన్న కట్టెలు, రాడ్లు తీసుకుని కేకలు వేసుకుంటూ అక్కడున్న నగర అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, కష్ణాయాదవ్‌లపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో కృష్ణయాదవ్ తమ్ముడు ఆనంద్‌బాబు యాదవ్, యుగంధర్, అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని డాక్టర్ కోడూరి బాలసుబ్రమణ్యంపై ఘర్షణకు దిగారు.
పోలీసులకు ఫిర్యాదు..
దాడి సంఘటనపై యువత జిల్లా అధికార ప్రతినిధి మధుబాబు, దంపూరి భాస్కర్ యాదవ్ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. నగర కమిటీ నేతలు మంత్రి గోపాలకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జోక్యంతో విరమించుకున్నారు.
గాయపడిన పత్రికా ఫొటోగ్రాఫర్
తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడుతుండగా ఫొటోలు తీసిన ఓ దినపత్రిక ఫొటోగ్రాఫర్ భాస్కర్‌ను పక్కకు నెట్టేశారు. దీంతో ఆయన కిందిపడిపోయి కెమెరా లెన్స్ పాడవడంతో పాటు కుడికాలికి గాయమైంది.