టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సుధీర్
కుప్పం టీడీపీ నేతల్లో నిప్పు రాజేసుకుంది. మహానాడు వేదికగా జరిగిన సమీక్షలో స్టీరింగ్ కమిటీ సభ్యులకే తమ పార్టీ అధినేత ప్రాధాన్యమిచ్చారని ద్వితీయశ్రేణి నేతలు మండిపడుతున్నారు. వారి మాటలు విని సామాన్య కార్యకర్తలపై చిర్రుబుర్రులాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బలమైన సామాజిక వర్గాన్ని అణగదొక్కడానికే బాబు కంకణం కట్టుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక ఆయనతో వేగలేమని పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కుప్పం: కుప్పం టీడీపీ నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపైనే క్షేత్రస్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహానాడు పూర్తయిన తర్వాత కుప్పం నేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు కేవలం కొందరికే ప్రాధాన్యమిచ్చారని మండిపడుతున్నారు. క్రియాశీలక కార్యకర్తలను తీవ్రంగా అవమానించారని కుంగిపోతున్నట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో అసంతృప్తి
విజయవాడలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానా డు కార్యక్రమం అనంతరం కుప్పం నేతలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అధినేతతో మాట్లాడేందుకు కుప్పం నుంచి సుమారు 300 మంది కార్యకర్తలు తరలివెళ్లారు. అందులో కేవలం స్టీరింగ్ కమిటీ సభ్యులైన 24 మందితోనే చంద్రబాబునాయుడు మూడు గంటలకుపైగా సమీక్షించారు. సమావేశం ముగిసేంత వరకు క్రియాశీలక సభ్యులు బయటే నిరీక్షించారు.
వారితోనే పార్టీకి చేటు
కుప్పం నియోజకవర్గ టీడీపీలో విభేదాలు పొడజూపాయి. అధినేతతో సఖ్యతగా ఉన్న కొందరు నేతల వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తోందని క్రియాశీలక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మహానాడు వేదికగా జరిగిన సమీక్షలో వారికే తమ అధినేత ప్రాధాన్యమివ్వడం వారికి మింగుడు పడడంలేదు. మూడు గంటలౖకుపెగా నిరీక్షించినా తమను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మాపైనే చిందులా?
3 గంటలు, 24 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం ముగిశాక బయట వేచి ఉన్న కార్యకర్తలపై బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. సమస్యలు తెలుసుకోకుండా స్టీరింగ్ కమిటీ సభ్యులు చెప్పిన మాటలు విని పార్టీ భుజాన మోసేవారిపై మండిపడడం ఏంటని పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఓ బలమైన సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. సాక్షాత్తు అధినేతే ఇలా వ్యవహరించడం పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది.
రాజీనామాల దిశగా అడుగులు
టీడీపీలో బలమైన సామాజికవర్గ నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పదవులు అనుభవిస్తూ ప్రజల వద్ద విమర్శలు తీసుకొస్తున్న ప్రజాప్రతినిధులను వదిలి సామాన్య కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేయడం అధినేతకు తగదని, ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు బహిరంగంగా వాపోతున్నారు. రాజధానిలో జరిగిన కుప్పం నేతల సమావేశంలో తీవ్ర మనస్తాపానికి గురైన నేతలు పదవులు, పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కుప్పం ఉప సర్పంచ్ భర్త రాజీనామా
మేజర్ గ్రామ పంచాయతీ కుప్పం ఉప సర్పంచ్ భర్త జి.ఎమ్.సుధీర్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన 20 ఏళ్ల నుంచి పార్టీలో క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో మంచి నాయకత్వం లేదని, అనుకున్న స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడంలేదని, అందుకే తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment