నో ఓటు .. రేటు ప్లీజ్
సాక్షి, గుంటూరు, ఓటుకు రేటు అనేది పాత మాట .. ఓటు వేయకుంటే భారీగా ప్యాకేజిలిస్తామంటూ టీడీపీ, బీజేపీ నాయకులు ఏరియాల వారీగా గుత్త కాంట్రాక్టులకు దిగుతున్నారు. డబ్బు తీసుకున్నా ఓటు తమకు వేయరని గ్రహించి కొత్త పంథా ఎంచుకున్నారు. గ్రామాల్లోని కుల పెద్దలకు భారీ మొత్తంలో ఆశ చూపుతూ అసలు ఓటే వేయవద్దంటూ బేరాలాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఓటు వేయవద్దంటూ భారీ నజరానాలు ప్రకటిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టుందన్న విషయం అవగతం చేసుకున్న ఆ రెండు పార్టీల నాయకులు పేద, బడుగు, బలహీనవర్గాలు నివసించే కాలనీలపై కన్నేశారు. ముఖ్యంగా దళిత, ముస్లిం మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు నానా యాతన పడుతున్నారు. రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లోకి వెళ్లి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎంత కావాలో చెప్పండి, మీ వాళ్లందరూ ఓటింగ్‌కు రాకుండా చూడాలంటూ కుల పెద్దల కాళ్లావేళ్లా పడుతున్నారు. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేటలతోపాటు అనేక నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదన్న విషయం తెలుసుకున్న బీజేపీ, టీడీపీ నాయకులు చేస్తున్న నీతిమాలిన రాజకీయాలపై గ్రామాల్లోని ప్రజలే అసహ్యించుకుంటున్నారు.
రెండు రోజుల నుంచి ఈ తంతు కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రామాల్లోని కాలనీలు, దళితవాడల్లోని ప్రజలకు అవసరమైతే పెద్ద పెద్ద వస్తువులు కొని పెట్టేందుకు కూడా నాయకులు వె నుకాడటం లేదు. పది ఓట్లు ఉంటే ఇన్వర్టర్, 20 ఓట్లు ఉంటే ద్విచక్రవాహనం అందిస్తామంటూ ఆఫర్లు అందిస్తున్నారు. మరికొందరికైతే మీ కాలనీల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూస్తే భారీ ప్యాకేజీ అందజేస్తామని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
బడుగు, బలహీన వర్గాల్లో వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉందని గ్రహించి వారి ఓట్లకు గండి కొట్టేందుకు కుట్ర పూరిత రాజకీయాలకు తెర లేపుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తున్న టీడీపీ, బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరుతున్నారు.