క్రాస్‌ఓటింగ్... గుబులు | crass voting at nalgonda voters | Sakshi
Sakshi News home page

క్రాస్‌ఓటింగ్... గుబులు

Published Mon, May 5 2014 1:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

క్రాస్‌ఓటింగ్...  గుబులు - Sakshi

క్రాస్‌ఓటింగ్... గుబులు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీల మధ్య జరిగినట్లుగా భావిస్తున్న క్రాస్ ఓటింగ్ ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాడో తేల్చుకోలేక ఆందోళన చెందుతున్నారు..!!

సాక్షిప్రతినిధి, నల్లగొండ, ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో బహుముఖ పోటీలే జరిగాయి. దీంతో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి...?  గెలుపు ఎవరి ఖాతాలో పడుతుంది..? అన్న అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహారశైలిపై ఒక అంచనాకు వచ్చిన ఓటర్లలో మెజారిటీ ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కాకుండా వేర్వేరుగా ఎంచుకుని, క్రాస్ ఓటింగ్ చేశారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ పరిణామమే అభ్యర్థులను కలవరపరుస్తోంది. అయితే, క్రాస్ ఓటింగులో ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరిగిందనే అంశంపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల వారీగా ఓటింగ్ సరళిపై సమాచారం సేకరించుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌పై బూత్‌ల వారీగా ఆరా తీస్తున్నారు. ఓటర్ల వ్యవహార శైలి లోక్‌సభ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది.

 ఒకే పార్టీకి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేస్తారని ఆశించిన అభ్యర్థులకు ఈ సారి ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభలో ఒక అభ్యర్థికి మొగ్గుచూపిన ఓటర్లు, పార్లమెంట్ అభ్యర్థి  విషయానికి వచ్చేసరికి మరో పార్టీని ఆదరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఇదే పరిణామం చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

టీడీపీ ఓట్లే ... భారీగా క్రాసింగ్
నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, టీడీపీ, బీజేపీల నుంచి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఈ ఓట్ల క్రాసింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ నియోజకవవర్గంలో టీడీపీ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి వైపు మొగ్గుచూపినట్లు చెబుతున్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి విషయంలో మరో పార్టీకి మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతోంది.

దేవరకొండ నియోజకవర్గంలో టీడీపీ అభిమాన ఓటర్లు, తమ ఎంపీ అభ్యర్థి వైపు నిలిచినా, ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ప్రత్యామ్నాయం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో టీడీపీ అంచనాలు తారుమారయ్యాయి. ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి జై కొట్టినవారే ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మాత్రం మరో పార్టీ అభ్యర్థిని ఆదరించినట్లు సమాచారం. ఇదే పరిస్థితి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఎదుర్కొంటోంది. ఎంపీ అభ్యర్థి చిన్నపరెడ్డి పక్షాన నిలబడినా, అసెంబ్లీ అభ్యర్థి విషయంలో టీడీపీని కాదనుకున్నారని వినికిడి.

హుజూర్‌నగర్‌లో కూడా టీడీపీ ఓటర్లు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి మొగ్గుచూపినా,  ఎమ్మెల్యే అభ్యర్థికి పడాల్సి ఓట్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా చీలిపోయినట్లు సమాచారం. కాగా, కోదాడ నియోజకవర్గంలో దీనికి భిన్నంగా కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఓట్లు టీడీపీకి క్రాస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఓట్లు కూడా క్రాస్ అయినట్లు తెలుస్తోంది.

 

 భువనగిరి లోక్‌సభ స్థానంలోనూ ఇదే పరిస్థితి

భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఓట్లేసిన ఆ పార్టీ అభిమాన ఓటర్లు, ఎమ్మెల్యే విషయంలో మాత్రం మరో పార్టీ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీ డీపీ అభిమాన ఓటర్లు ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా నిలిచినా, ఎంపీ అభ్యర్ధి బరిలో ఉన్న పార్టీ బీజేపీ కాదని, ఇతర పార్టీ ఎంపీ అభ్యర్థికి మొగ్గు చూపారని తెలుస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లు చిల్లంకల్లం అయినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి పడిన ఓట్లలో మెజారిటీ ఓట్లు అసెంబ్లీ అభ్యర్థి విషయానికి వచ్చే సరికి కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐని కాదని మరో పార్టీని ఎంచుకున్నట్లు సమాచారం. ఇలా, మొత్తంగా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీల మధ్య ఓట్లు భారీగానే క్రాస్ అయినట్లు ప్రచారం జరుగుతుండడంతో ఎవరికి వారు ఆందోళనగానే గడుపుతున్నారు. దీనికి తెర దించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement