తిరక్రాసు
- గేటర్ క్రాస్ ఓటింగ్
- ఒక్క పార్టీకే పరిమితం కాని ఓటరు
- లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల మధ్య ఓట్లలో వ్యత్యాసం
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ ఓటర్లు తమ తీర్పును ఏ ఒక్క పార్టీకో పరిమితం చేయలేదు. ఒకే ఓటరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్టీకి ఓటు వేస్తే.. లోక్‌సభ నియోజకవర్గంలో మరో పార్టీకి ఓటేశారు. ఇందుకు కారణాలనేకం. కేంద్రంలో ఒక పార్టీ ఉంటే బాగుంటుందని ఆలోచించిన ఓటరే.. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరోపార్టీపై మొగ్గు చూపాడు. అలాగే.. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని సైతం పరిగణనలోకి తీసుకున్నాడు.
అభ్యర్థుల పనితీరు.. అందుబాటులో ఉండే తీరు.. తదితర అంశాలతో ఒకే ఓటరు భిన్నమైన పార్టీలకు ఓటేశాడు. దీంతో పార్లమెంట్-అసెంబ్లీ స్థానాలకు క్రాస్ ఓటింగ్ జరిగింది. మిత్రపక్షాల పొత్తులోనూ ఇది కనిపించింది. టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఓట్లలో అన్ని చోట్లా అది కనిపించలేదు. ఎంపీగా బీజేపీకి ఓటేసిన ఓటరు ఎమ్మెల్యేగా టీడీపీకి ఓటు వేయని పరిస్థితి ఉంది.
ఉదాహరణకు.. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థికి 65,355 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 50,898 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే.. బీజేపీ ఎంపీ అభ్యర్థికి పడినన్ని ఓట్లు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థికి లభించలేదు. ఇలా.. పలు సెగ్మెంట్లలో పలు వ్యత్యాసాలున్నాయి. ఎంఐఎంకు యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థికి 83,081 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి కేవలం 66,843 ఓట్లు మాత్రమే లభించాయి.
అంటే దాదాదపు 16 వేల ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అలాగే బీజేపీకి మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి 41,825 ఓట్లు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 35,713 ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే ఆరువేల ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి 16,912 ఓట్లు మాత్రమే రాగా, అదే అసెంబ్లీ అభ్యర్థికి 45,964 ఓట్లు లభించాయి. అంటే.. దాదాపు 29 వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెం ట్‌లో 37,823 ఓట్లు రాగా, అదే సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థికి 27,226 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపు 10 వేల తేడా. ఇలా పలు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ జరిగింది..
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలు.. వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో (సెగ్మెంట్లలో) ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. ఒకే పార్టీకి అసెంబ్లీలో తక్కువ ఓట్లు వచ్చిన చోట అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడాన్ని.. పార్లమెంట్ స్థానానికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తక్కువ ఓట్లు వచ్చిన చోట అదే పార్టీ అసెంబ్లీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడాన్నీ దిగువ పట్టికల ద్వారా గమనించవచ్చు.