టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమనీ, క్రమంగా ఈ భావన ప్రజల్లో బలపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగరాం అహిర్ అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర పదాదికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో బీజేపీని నంబర్ వన్‌గా నిలిపేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణలో బీజేపీ కంటే ముందున్న కాంగ్రెస్, టీడీపీ ఇపుడు వెనుకంజలో ఉన్నాయన్నారు. బీజేపీ బయట ఉండి.. మంచి చరిత్ర, నడవడిక, ప్రజాదరణ ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావాలని సూచించారు. ఏళ్ల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం నాయకత్వం కొరవడిం దన్నారు. సోనియా, రాహుల్‌పై కాంగ్రెస్ నేతలకు ప్రేమ, విశ్వాసం, నమ్మకం లేదని, దేశంలోని ఇతర పార్టీల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
మే 23న అమిత్ షా రాక..
కాగా, రాష్ట్రంలో మే 23, 24, 25వ తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీ పదాదికారులను ఉద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలతో బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. అవినీతి రహిత పాలన, పేదల కోసం అంకితభావంతో పనిచేయడంతో.. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లు, పసుపు రైతుల సమస్యలు తదితరాలపై ఇటీవల పార్టీ చేసిన ఆందోళనలు, ఉద్యమాలకు మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని.. ఇతర పార్టీలు ద్వంద్వ నీతి పాటిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడంపై కేంద్రంలో రాజకీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.