76% పోలింగ్ | 76% polling | Sakshi
Sakshi News home page

76% పోలింగ్

Published Mon, Mar 31 2014 1:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

76% polling

కోదాడలో అత్యధికం.. నల్లగొండలో అత్యల్పం
 
 సాక్షి, నల్లగొండ,మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయి. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఓటర్లు ఓటు హక్కును సాఫీగా వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినా.. వెంటనే మరమ్మతులు చేసి పోలింగ్ కొనసాగించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాగా 8గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌కేంద్రాల్లో బారులుదీరారు.
 
 
 సాయంత్రం ఐదు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరినీ ఓటు వేసేందుకు అధికారులు  అనుమతించారు. దీంతో అక్కడక్కడా సాయంత్రం 6గంటల వరకు ఓట్లు వేశారు. ఎస్పీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో బందోబస్తు  ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చేసుకోలేదు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం వచ్చేనెల 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఫలితాల ప్రకటనపై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉంది. ఏప్రిల్ ఒకటిన హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. కోర్టు తీర్పు మేరకు ఓట్ల లెక్కింపు ఎప్పుడన్నది తేలనుంది.
 
 నల్లగొండలో అతి తక్కువ
 
 జిల్లాలో సరాసరిగా 76శాతం పోలింగ్ నమోదైంది. తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన కోదాడలో ఓటర్ల చైతన్యం వెలువెత్తింది. అత్యధికంగా ఇక్కడే పోలింగ్ నమోదైంది. 83.34 శాతం నమోదైనట్లు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. అతితక్కుగా నల్లగొండలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.ఇక్కడ 69.29 శాతం మాత్రమే నమోదైంది.
 
 కలెక్టర్ పరిశీలన...
 
 ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా కలెక్టర్ చిరంజీవులు, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ తీరును కలెక్టర్ తన బంగ్లా నుంచి, జేసీ తన ఛాంబర్ నుంచి పరిశీలించారు. ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పాదర్శకంగా జరిగాయని ప్రకటించారు. జిల్లాకేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో వీరిద్దరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత జేబీఎస్ పాఠశాల, బీటీఎస్ నవోదయ పాఠశాలల్లోని పోలింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
 
 ఓటర్లకు అసౌకర్యం.....
 
 మున్సిపల్ ఎన్నికలకు మూడు నాలుగు రోజుల ముందే ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటరు చీటీలను అంద జేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఓటర్లకు పూర్తిస్థాయిలో పోల్ చిటీలు అందిన పాపాన పోలేదు. ఒకరికి అంది.. మరొకరికి అందకపోవడంతో ఓటరు చిటీలు ఉంటేనే ఓటు వేయనిస్తారన్న ఓ అపోహ ఓటర్లలో నెలకొంది. దీన్ని నివృత్తి చేయాల్సిన వారు కరువయ్యారు. దీంతో ఓటరు చిటీల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటరు చిటీలు ఇచ్చినా.. జాబితాలో పేరు దొరక్కపోవడంతో చాలాసేపు దానికోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఒక వార్డు ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో మరో వార్డుకు పరుగులు పెట్టారు. అంతేగాక ఒకే కుటుంబంలోని సభ్యుల ఓటర్లు గల్లంతయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద నీడనిచ్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు.
 
 కేంద్రాల వద్దే ప్రచారం, డబ్బు పంపిణీ...

 
 పోలింగ్ కేంద్రాల ఎదుటే ఆయా పార్టీల అభ్యర్థులు యథేచ్ఛగా ప్రచారం సాగించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా పట్టించుకోలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు మిన్నకుండిపోయారు. దీంతో తమకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థులు ఇబ్బందులకు గురిచేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వాహనాలు రాకుండా చేసిన ఖాకీలు... అభ్యర్థుల ప్రచారాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బహిరంగంగా డబ్బులు పంపిణీ చేశారని సమాచారం.
 
 మొరాయించిన ఈవీఎంలు...
 
 అక్కడక్కడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ప్రారంభంలోనే ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అధికారులు అప్రమత్తమై ఈవీఎంలకు అప్పటికప్పుడే ఇంజినీర్లు మర మ్మతు చేశారు. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలో 12వ వార్డులో టేబుల్ సరిగా లేకపోవడంతో ఈవీఎం కింద పడింది. దీంతో ఈవీఎం వైరు దెబ్బతినడంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది. 30 నిమిషాల్లో మరమ్మతులు చేసి కొనసాగించారు.
 
 
  కోదాడలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. వీటికి మరమ్మతులు చేసి పోలింగ్ నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో 11వ వార్డు ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో 20 నిమిషాలు పోలింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత మరమ్మతులు చేయడంతో పోలింగ్ సజావుగా కొనసాగింది. సూర్యాపేటలోనూ నాలుగైదు వార్డుల్లో ఈవీఎంలు మొరాయించాయి. భువనగిరిలోని 18వ వార్డులో ఈవీఎం మొరాయించడంతో మరో దానిని ఏర్పాటు చేశారు.
 
 స్వల్ప ఘర్షణలు....
 
 కొన్ని మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ఘర్షణలకు దిగారు. జిల్లాకేంద్రంలోని మర్రిగూడ (40వ వార్డు)లో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 17వ వార్డులో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. సూర్యాపేటలో 27, 4వ వార్డుల్లో కాంగ్రెస్ టీడీపీ, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement