ఇరకాటంలో శిల్పా
- కాంగ్రెస్, జేఎస్‌పీ అభ్యర్థులతో తలనొప్పి
- గతంలో ఇద్దరికీ చేయివ్వడమే కారణం
- మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల వ్యవహారంతో జహీర్ మనస్తాపం
- గోస్పాడులో ఆధిపత్యం భరించలేని రాకేష్‌రెడ్డి
- టీడీపీ శిబిరంలో ఓటమి భయం
నంద్యాల, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. చంద్రబాబు ద్వంద్వ నీతికి తోడు.. అభ్యర్థుల స్వయంకృతాపరాధం వారిని ఓటమి దిశగా పయనింపజేస్తోంది. బీజేపీతో జత కట్టడంతో ముస్లిం ఓటర్లు ‘పచ్చ’ పార్టీకి దూరం కాగా.. గతంలో కలిసి నడిచిన నేతలే ఇతర పార్టీల తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలవడం శిల్పా మోహన్‌రెడ్డికి తలనొప్పిగా మారింది.
నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లె రాకేష్‌రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) అభ్యర్థిగా జహీర్‌బాషాలు బరిలో నిలిచారు. జహీర్ ప్రస్తుతం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఫరూక్ సోదరుని కుమారుడు కావడం గమనార్హం. ఈయన మూడు దశాబ్దాలకుపైగా ఆ పార్టీ జెండా మోశారు.
ఫరూక్‌కు చేదోడువాదోడుగా.. పార్టీ శ్రేణులకు తలలో నాలుకగా మెలిగిన జహీర్ ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆరు వార్డుల్లో తన మద్దతుదారులకు టికెట్లు ఇవ్వాలని ఫరూక్ ద్వారా ఎమ్మెల్యే శిల్పాను సంప్రదించారు. అయితే ఒక్క వార్డు విషయంలోనూ ఆయన మాటకు విలువివ్వకపోవడంతో మనస్థాపం చెందారు.
ఏమాత్రం గుర్తింపు లేని పార్టీలో తానెలా కొనసాగాలంటూ ఫరూక్ వద్ద జహీర్ మొరపెట్టుకోగా ఆయన కూడా చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ బరిలో నిలిచి తన సత్తా ఏంటో శిల్పా మోహన్‌రెడ్డికి చాటేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఆ మేరకు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా జహీర్ టీడీపీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.
ఓట్లు చీలుతాయనే భయంతో ఫరూక్, శిల్పాలు మధ్యవర్తుల ద్వారా ఆయనతో రాయబారం నెరపగా.. ససేమిరా అనడం టీడీపీ శిబిరాన్ని ఇరుకున పెడుతోంది. జహీర్ వైపు టీడీపీ శ్రేణులు వెళ్లకుండా ఫరూక్ తన తనయుడు ఫిరోజ్‌ను రంగంలోకి దింపడం ఆయన మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేసేందుకు కారణమవుతోంది.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ రాకేష్‌రెడ్డి కుటుంబీకులు మూడు దశాబ్దాలుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఈయన స్వగ్రామం గోస్పాడు మండలంలోని సాంబవరం. మండలంలో ప్రహ్లాదరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డికి ఎమ్మెల్యే శిల్పా మద్దతునిస్తుండటంతో వారిద్దరి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్ల క్రితం రాకేష్‌రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌కు దూరమైంది.
ఆ తర్వాత పరిణామాలతో శిల్పా టీడీపీలో చేరిపోవడంతో.. కాంగ్రెస్ తరఫున పోటీకి రాకేష్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈయన బంధువులు రాజగోపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, స్వామిరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటం రాకేష్‌రెడ్డికి కలసిరానుంది. వీరంతా శిల్పా ఓటమే ధ్యేయంగా పని చేస్తుండటం గమనార్హం.
ఇదే సమయంలో గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామంలో శిల్పా ప్రధాన అనుచరుడు దామోదర్‌రెడ్డి సైతం రాకేష్‌రెడ్డి వెంట నడిచేందుకు నిర్ణయించుకోవడం శిల్పాకు మింగుడుపడటం లేదు. మొత్తం మీద శిల్పాను ఓడించడమే రాకేష్‌రెడ్డి, జహీర్ లక్ష్యం కావడంతో టీడీపీ శ్రేణులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.