భూమా వర్సెస్ శిల్పా
భూమా వర్సెస్ శిల్పా
Published Fri, Nov 4 2016 10:02 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
⇒ పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే పో : భూమా
⇒ రెండు రోజుల్లో బండారం బయట పెడతా : శిల్పా
⇒ భూమా సెటిల్‌మెంట్ దందాలు చేస్తున్నారు : చైర్‌పర్సన్
నంద్యాల: ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇరువురు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇందుకు జనచైతన్య యాత్రలను వేదికలుగా చేసుకున్నారు. భూమా తొలి సభ నుంచే శిల్పాపై విమర్శల దాడికి దిగగా, శిల్పా రెండు రోజుల నుంచి తానేమి తీసిపోనని ఎదురుదాడికి దిగారు. భూమాకు మద్దతుగా వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, శిల్పాకు మద్దతుగా చైర్‌పర్సన్ దేశం సులోచన నిలిచి ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. భూమా శుక్రవారం పట్టణంలోని 22, 23వార్డుల్లో, శిల్పా సాయంత్రం పట్టణంలోని 18వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు.
పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోండి : భూమానాగిరెడ్డి
నన్ను రెచ్చగొట్టడంతోనే పార్టీ ఫిరాయించాను. ఇదంతా మీ స్వయం కృపారాదం. మీరు పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోండి నేను మాత్రం మళ్లీ పోటీ చేస్తా. ఉప్పు, పప్పులు అమ్ముకునే వారికి రాజకీయాలు ఎందుకు. అలాంటి వారు నాకు పోటీనేకాదు. గెలిచిన వారికి, ఓడిన వారికి తేడా ఉంది. గెలిచిన వారే ప్రజల సమస్యలను తీరుస్తారు. ఓడిన వారు ఏం చేయగలరు. ప్రతి మీటింగ్‌లో తనకు ఓట్లు వేయకుండా ఓడించారని ప్రజలను నిందించడం కంటే ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది.
బండారం బయట పెడతా : శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి
ఉప్పు, కందిపప్పు విక్రయించినది వాస్తవమే. కాని పేద ప్రజలకు లాభాపేక్షలేకుండా అందించాను. రెండు మూడు రోజులు చూస్తా. ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తాం. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారు. ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులను కేటాయించారో వివరాలతో వెల్లడించాలి. రోడ్ల వెడల్పు మాత్రమే సమస్యలకు పరిష్కారం కాదు. ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆలోచించి మాట్లాడండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.
సెటిల్‌మెంట్లు చేయడమే మీ పని: దేశం సులోచన, చైర్‌పర్సన్
శిల్పా ఉప్పు, పప్పు అమ్ముకున్నది నిజమే. ఆయన ప్రజల బాగుకోసమే చేశారు. మీరు మాత్రం సెటిల్‌మెంట్లు, దందా చేస్తున్నారు. శిల్పా రెండోసారి గెలిచినప్పుడే మంత్రి పదవి వచ్చింది. మీరు 30ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా మంత్రి పదవి రాకపోవడానికి కారణం నేతలకు మీ పై నమ్మకం లేకపోవడమే. అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం మంచిది కాదు. అమృత్ పథకం కింద శిల్పా బ్రదర్స్ తెచ్చిన నిధులను తాము తెచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు.
Advertisement
Advertisement