అమరావతి: నంద్యాల టీడీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి అఖిల ప్రియ చుట్టు అసమ్మతి రాగాలు ఎక్కువ కావటంతో ఆళ్లగడ్డ రాజకీయం మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య కోల్డ్‌వార్ మళ్లీ తెరమీదకు వచ్చింది. భూమా వర్థంతికి తనకు పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియపై తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి వర్థంతి రోజు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏవీ సుబ్బారెడ్డి..ఆమెతో విభేదాలు వాస్తవమేనని అంగీకరించారు. ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానని, ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. ముఖ్యమంత్రితో తనకు సత్సంబంధాలున్నాయని ... ఏ పదవి ఇవ్వాలో త్వరలో సీఎంయే నిర్ణయిస్తారని సుబ్బారెడ్డి తెలిపారు.
వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మంత్రి పొడిపొడిగానే మాట్లాడి చేతులు దులిపేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నాయకత్వం వహించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా అదే తీరే కొనసాగుతోంది.
కాగా భూమాకు, ఏవీకి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలూ నడిపే అవకాశం లేనంతగా వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయితే, భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఓ కాంట్రాక్టు వ్యవహారంలో కూడా తమకు తెలియకుండా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య అగాధం భారీగా పెరిగిపోయింది. దీంతో వీరిద్దరూ నిప్పు-ఉప్పు చందంగా మారింది. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment