సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. మంత్రి అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు వెలువడ్డాయి. గత కొంతకాలంగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. వీరిరువురి మధ్య ఎన్నిసార్లు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీని చేపట్టారు.
ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని ఏవీ సుబ్బారెడ్డి హుటాహుటీన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైకిల్ ర్యాలీ కార్యక్రమం చేపడుతున్న సుబ్బారెడ్డిపై దాడులు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిని రేపు అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment