సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తా.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.
కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. మందిమార్బలంతో డెయిరీ ప్రాంగణంలోని చైర్మన్ గదిలోకి వెళ్లారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడి అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలాఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యకం చేశారు. తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని అఖిల సూచించారు.
‘నాతో మామగా మాట్లాడుతున్నావా... లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నంద్యాలకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని.. తమ పరిధిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment