akilapriya
-
ముగ్గురికీ ఇవ్వాల్సిందే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో సీట్ల కేటాయింపు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు కోట్ల కుటుంబం రాకతో అటు ఆలూరు, ఇటు డోన్‌లో ఎమ్మెల్యే సీటు విషయంలో చర్చ మొదలుకాగా..ఇప్పుడు కర్నూలు సీటు విషయంలో మరింత రచ్చ జరుగుతోంది. కర్నూలు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పట్టుబడుతున్నారు. లేనిపక్షంలో తాము ముగ్గురమూ బరిలో ఉండబోమని టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికి సీటు ఇవ్వకపోయినా తామంతా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూలు, నంద్యాల, డోన్‌లో కూడా మొదట్లో సిట్టింగులకే ఇస్తామని చెప్పారు. అయితే, టీజీ వెంకటేష్ చక్రం తిప్పడంతో కర్నూలు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీజీ వెంకటేష్ కుమారుడు భరత్..మంత్రి లోకేష్‌తో భేటీ తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఎస్వీ, భూమా కుటుంబాలు సిద్ధమైనట్టు సమాచారం. ఎస్వీ, భూమా కుటుంబాలు వేర్వేరన్న విషయాన్ని గ్రహించాలని, ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడం లేదని, రెండు కుటుంబాలకు కలిపి మూడు సీట్లు అన్న విషయాన్ని గుర్తించాలని అధిష్టానానికి వివరించినట్టు తెలుస్తోంది. ఇక కోట్ల కుటుంబం చేరికతో డోన్ విషయంలోనూ చర్చ మొదలయ్యింది. లోకేష్‌ను కలవడంతో.. వాస్తవానికి చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్ష సందర్భంగా కర్నూలు సీటు ఎస్వీకే అని ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. నంద్యాల సీటు కూడా భూమా బ్రహ్మానందరెడ్డికే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, టీజీ భరత్ మంత్రి లోకేష్‌ను కలిసిన తర్వాత చర్చ మరో విధంగా సాగుతోంది. విజన్‌యాత్రను మరింత దూకుడుగా చేసుకోవాలని, సర్వే ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని భరత్‌తో లోకేష్ అన్నట్టు తెలుస్తోంది. దీంతో భరత్ మరింత దూకుడు పెంచారు. టీజీ కుటుంబానికి సీటివ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలయ్యింది. అయితే, ఎస్వీకి సీటు ఇవ్వకపోయినప్పటికీ ఎటూ పోయే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దీంతో భరత్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురికీ సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే బరి నుంచి తప్పుకుంటామంటూ అల్టిమేటం జారీచేసినట్టు తెలుస్తోంది. -
వేడెక్కుతున్న నంద్యాల టీడీపీలో వర్గపోరు
-
మరోసారి వేడెక్కిన ఆళ్లగడ్డ రాజకీయాలు
అమరావతి: నంద్యాల టీడీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి అఖిల ప్రియ చుట్టు అసమ్మతి రాగాలు ఎక్కువ కావటంతో ఆళ్లగడ్డ రాజకీయం మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య కోల్డ్‌వార్ మళ్లీ తెరమీదకు వచ్చింది. భూమా వర్థంతికి తనకు పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియపై తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి వర్థంతి రోజు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏవీ సుబ్బారెడ్డి..ఆమెతో విభేదాలు వాస్తవమేనని అంగీకరించారు. ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానని, ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. ముఖ్యమంత్రితో తనకు సత్సంబంధాలున్నాయని ... ఏ పదవి ఇవ్వాలో త్వరలో సీఎంయే నిర్ణయిస్తారని సుబ్బారెడ్డి తెలిపారు. వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మంత్రి పొడిపొడిగానే మాట్లాడి చేతులు దులిపేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నాయకత్వం వహించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా అదే తీరే కొనసాగుతోంది. కాగా భూమాకు, ఏవీకి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలూ నడిపే అవకాశం లేనంతగా వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయితే, భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఓ కాంట్రాక్టు వ్యవహారంలో కూడా తమకు తెలియకుండా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య అగాధం భారీగా పెరిగిపోయింది. దీంతో వీరిద్దరూ నిప్పు-ఉప్పు చందంగా మారింది. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
చంద్రబాబు అగ్రిమెంట్ రాసివ్వాలి- భూమా అఖిలప్రియ
హైదరాబాద్: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో అగ్రిమెంట్ చేయాలని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మంగళవారం ఆమె మాట్లాడుతూ...ప్రాజెక్టు పూర్తి చేయకుంటే తనదే బాధ్యత అని చంద్రబాబు అగ్రిమెంట్లో రాయాలన్నారు. దానితో పాటు అగ్రిమెంట్ కాపీని గవర్నర్ కు సమర్పించాలని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం వెనుక మంత్రుల వాటాలెంతో బయటపట్టాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, నారాయణ స్వామి లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.