శోభమ్మ అభివృద్ధి చేయలేదా?
శోభమ్మ అభివృద్ధి చేయలేదా?
Published Wed, Feb 24 2016 12:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
మరోవైపు అభివృద్ధి చేయలేదంటూ పరోక్షంగా శిల్పాపై భూమా విమర్శలు
మండిపడుతున్న మాజీ మంత్రి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలు ఆ రెండు నియోజకవర్గాలతో పాటు అధికార పార్టీ నేతల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచీ భూమా కుటుంబ సభ్యులదే హవా. సుమారు రెండు దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని పాలించింది ఆ కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదన్న భూమా అఖిలప్రియ వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. అంటే తమ కుటుంబ హయాంలోనే అభివృద్ధి జరగలేదంటూ.. అందులోనూ శోభమ్మ అభివృద్ధి చేయలేదనే రీతిలో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కేడర్ బాధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదంటూ భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల శిల్పా వర్గీయులు గుర్రుమంటున్నారు. తమ నేతను లక్ష్యంగా చేసుకునే భూమా మాట్లాడారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా చేరికలు అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
రెండు దశాబ్దాల పాలనలో..
వాస్తవానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి భూమా కుటుంబానిదే హవా. 1989 లో భూమా శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ కుటుంబం నుంచి రంగప్రవేశం చేశారు. అయితే, 1992 లో శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో సాధారణ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ.. ఆ తర్వాత ఎంపీ కావడంతో 1997లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1997లో శోభానాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1999 సాధారణ ఎన్నికల్లోనూ ఆమె గెలు పొందారు. కేవలం 2004 నుంచి 2009 వరకూ గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2009లో పీఆర్‌పీ నుంచి శోభానాగిరెడ్డి ఎన్నికయ్యారు. తాజాగా భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నది రెండు దశాబ్దాల పాటు పాలించింది భూమా కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటూ తమ కుటుంబాన్నే విమర్శించేలా మాట్లాడటం తగదనే అభిప్రాయం వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది.
మా పైనే విమర్శలా?
నంద్యాల అభివృద్ధిపై అనేక వాగ్దానాలు చేసి ఎమ్మెల్యేగా గెలు పొంది.. చివరకు ఏమీ చేయలేక అధికార పార్టీలో చేరుతూ తమపై పరోక్షంగా విమర్శలు చేయడం తగదని అధికార పార్టీలోని నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదన్న వ్యాఖ్యలు.. పరోక్షంగా శిల్పా, ఫరూఖ్‌లపై విమర్శలు చేశారని తెలుస్తోంది. కేవలం గతంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదనే వ్యాఖ్యలపై అటు శిల్పా వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. పార్టీలో చేరిన వెంటనే తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం చూస్తుంటే విభేదాలకు ఆజ్యం పోయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమా వ్యాఖ్యలపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
‘‘ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాను.’’
- టీడీపీలో చేరిక సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
‘‘నంద్యాల నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేయలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరుతున్నా.’’
- విజయవాడలో భూమా నాగిరెడ్డి
Advertisement
Advertisement