సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏవీ సుబ్బారెడ్డి ...మంత్రి అఖిలప్రియతో ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఆళ్లగడ్డలో గురువారం జరిగిన ఏవీ హెల్ఫ్‌లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవీ సుబ్బారెడ్డి ...మంత్రి అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భూమా నాగిరెడ్డి బతికుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడు. అది మా ఇద్దరి మధ్య అనుబంధం. భూమా నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్‌ను. సినిమాలో హీరోనే కనబడతాడు..డైరెక్టర్ కనిపించడు...నేను కూడా అంతే. భూమా వర్థంతి సభలో నేను లేకుంటే.. ఆయన ఆత్మ శాంతిస్తుందా?. భూమా నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 7093382333’ అని తెలిపారు.
కాగా దివంగత భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల స్నేహం బలమైంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అయితే భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏవీ సుబ్బారెడ్డిని.. అఖిలప్రియ ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటి నుంచే ఫీలర్స్ వదులుతున్నారు. అందులో భాగంగానే ఏవీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment