కనిగిరిలో రూ.కోట్లు కుమ్మరించిన టీడీపీ
- అయినా.. ఓటమి తప్పదని భావించి ఆగడాలకు పాల్పడిన వైనం
- పట్టణంలో పలుచోట్ల క్రాస్ ఓటింగ్
కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి నియోజకవర్గంలో ఓటమి భయంతో కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ కుమ్మరించింది. పోలింగ్ రోజైన బుధవారం కూడా ఒక్క కనిగిరి పట్టణంలోనే కోటి రూపాయలకుపైగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో పలుచోట్ల ఆగడాలకు పాల్పడ్డారు. పామూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో దౌర్జన్యాలకు దిగారు. వీరభద్రాపురం, మోపాడు, మోపాడుబంగ్లా, అయ్యవారిపల్లి, పట్టణంలోని పాతూరు తదితర పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు సృష్టించేందుకు యత్నించారు.
తమకు అనుకూలమనుకున్న కనిగిరి నగర పంచాయతీలో సైతం రెండు వార్డులు మినహా మిగతాచోట్ల ఓటర్లు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన టీడీపీ నాయకులు.. రెండోవిడతగా ఓటుకు 500 రూపాయల చొప్పున బుధవారం రహస్యంగా పంపిణీ చేశారు. అంతేగాకుండా ఒక సామాజికవర్గానికి చెందిన ఓట్లను మొత్తంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజు ఇంతజరుగుతున్నా నిఘా విభాగం అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది.
అధికారులు, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనిగిరి పట్టణంలో మొత్తం 28,483 ఓట్లున్నాయి. వారందరికీ రెండోవిడత కూడా డబ్బు పంపిణీ చేసినప్పటికీ గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో టీడీపీ నేతలు అల్లర్లు చేసి వేరే అడ్డదారుల కోసం ప్రయత్నించారు. అయితే, అవేమీ వీలుపడకపోవడంతో పాటు క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుసుకుని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.