సైకిల్ జిల్లాలో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ
- పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఈ పరిస్థితి
- నిరాశ పరిచిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు
- చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2014 సార్వత్రిక ఎన్నికలు
- ఇక.. చెట్టుకొకరు.. పుట్టకొకరేనా..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ, అంతా ఊహించిందే జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లాలో నామరూపాల్లేకుండా పోయింది. శుక్రవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరణశాసనంగా పరిణమించాయి. తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతమే ఈ ఫలితాలకు కారణమన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో టీడీపీ పోటీ చేసింది.
మరో నాలుగు స్థానాలతో పాటు, ఒక లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి వదిలేసింది. మొదటి నుంచీ దేవరకొండ, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగినా, ఆ రెండు చోట్లా ద్వితీయ స్థానానికే పరిమితమైంది. ఇక, గత ఎన్నికల్లో పార్టీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి, తుంగతుర్తిలతోపాటు కోదాడలో టీడీపీ ఓటమి పాలైంది. భువనగిరిలో మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించిన ఉమా మాధవరెడ్డికి ఈసారి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. తుంగతుర్తిలో మూడో స్థానానికే టీడీపీ పరిమితమైంది.
ఈ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల పోటీ చేసినా టీడీపీ మొత్తం పోలైన ఓట్లలో 2,90,529ఓట్లను మాత్రమే పొందింది. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ 2,78,937 ఓట్లు (ఏడు సెగ్మెంట్లు కలిపి) పొందింది. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీ సాధించిన ఓటు షేరు స్వల్పంగానే ఉంది. అయితే, కేవలం సార్వత్రిక ఎన్నికల్లోనే టీడీపీ తలబొప్పి కట్టలేదు. అంతకుముందు వెలువడిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలూ అంతే స్థాయిలో టీడీపీకి నిరాశ మిగిల్చాయి.
ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానాన్నీ గెలుచుకోలేకపోయిన టీడీపీ.. వార్డు కౌన్సిలర్ల స్థానాలనూ తక్కువ సంఖ్యలోనే గెలుచుకుంది. ఇక, స్థానిక ఎన్నికల్లో కేవలం రెండు జెడ్పీటీసీ స్థానాలు, రెండు మండలాల పరిషత్‌కే పరిమితమైంది. ఈ ఫలితాలను విశ్లేషించుకున్న మీదట జిల్లాలో తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నదని అంతుబట్టడం లేదన్న ఆవేదన టీడీపీ కార్యక ర్తల్లో వ్యక్తమైంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే గ్రూపులతో కొట్టుకు చచ్చిన టీడీపీ నేతలు ఇక, క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోoది.