622 వార్డుల్లో 23 స్థానాలకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ తెలంగాణలో చతికిలపడింది. 53 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలు, 3 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ ఖాతానే తెరవలేదు. తొమ్మిది జిల్లాల్లోని 1379 మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అనేక చోట్ల అభ్యర్థులనే నిలపలేదు. పోటీ చేసిన స్థానాల్లో కూడా 161 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. వీటిలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 622 వార్డుల్లో టీడీపీ గెలిచిన సీట్లు కేవలం 23 మాత్రమే. ఇక్కడ టీడీపీ కన్నా బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది.
ఇక నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే ఓ మోస్తరు సీట్లను టీడీపీ గెలుచుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 8 మున్సిపాలిటీలలో 14 వార్డులే దక్కాయి. గద్వాల, కల్వకుర్తి, షాద్‌నగర్, ఐజ, నాగర్‌కర్నూలులో ఒక్క సీటు కూడా రాలేదు. ఇక కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లలోని మొత్తం 150 డివిజన్లలో కేవలం కరీంనగర్‌లో మాత్రమే టీడీపీ ఒక డివిజన్‌ను గెలుచుకుంది.
ఒక్క మున్సిపాలిటీలోనే మెజారిటీ: తెలంగాణలోని ఆరు మున్సిపాలిటీల్లో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. సత్తుపల్లిలోని 20 వార్డులకుగాను 17 చోట్ల విజ యంతో మెజారిటీ సాధించింది. గజ్వేల్‌లో 10, పెద్ద అంబర్‌పేటలో 9, ఇబ్రహీంపట్నంలో 10, వనపర్తిలో 8, సూర్యాపేటలో 12 స్థానాలు గెలుచుకున్నా 50 శాతానికి మించి స్థానాలు దక్కలేదు. గజ్వేల్‌లోని 20 సీట్లలో టీడీపీ 10, టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 1 వార్డు గెలుచుకోగా, భవిష్యత్తులో ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కలిస్తే టీఆర్‌ఎస్‌కే ఆ పీఠం దక్కే అవకాశం లేకపోలేదు. పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, వనపర్తి, సూ ర్యాపేటల్లో బీజేపీతో కలిస్తే మెజారిటీ దక్కనుంది. నారాయణపేటలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాగా, ఇక్కడ ఆ పార్టీ టీడీపీతో కలిస్తేనే మున్సిపల్ చైర్మన్ దక్కుతుంది. భువనగిరిలో 30 స్థానాలకు టీడీపీ(7), బీజేపీ(8) కలిస్తే మెజారిటీ దక్కుతుంది.
ఉత్తర తెలంగాణలో టీడీపీ మాయం
Published Tue, May 13 2014 1:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement