మల్లీ.. ఇదేం లొల్లి..!
సాక్షి, గుంటూరు :కొత్త లీడరుతో రేపల్లె టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగుతోంది. ఇక్కడ టీడీపీలో కొత్తగా చేరిన మల్లికార్జునుడి హవా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనగాని సత్యప్రసాద్‌కు సైతం ఈయన చేతిలో పరాభవం తప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒంటెత్తు పోకడలతో పార్టీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఆయనపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చివరికిది పార్టీలో అంతర్ధ్యుద్ధానికి దారితీయడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ పెత్తనమేంటంటున్న కార్యకర్తలు..
గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ నాయకులను టార్గెట్ చేసి అణగదొక్కారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడీ నాయకునికి పెత్తనం ఇవ్వడమేంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఈ మాజీ ఎమ్మెల్యేను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడటం ఆలోచించదగిన అంశం. 2004 ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముమ్మనేని వెంకటసుబ్బయ్య ఓడిపోవటానికి కారణమవ్వటమే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులు ఓటమికి తీవ్ర కృషి చేశారని, దీంతోపాటు ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను కనీసం బయటకు తిరగనివ్వకుండా పోలీసు కేసుల్లో ఇరికించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని..
ఇటువంటి వ్యక్తి తిరిగి తమపై పెత్తనం చెలాయించడం ఏమిటని బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్నిపల్ ఎన్నికల్లో సైతం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను విస్మరించిన ఈ మాజీ ఎమ్మెల్యే తన అనుచరులకు పలు వార్డుల్లో సీట్లు కేటాయించటంపై గుర్రుమంటున్నారు. కనీసం అభ్యర్థికి కూడా గౌరవం ఇవ్వకుండా దూషించడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే నష్టపోతామని.. సదరు అభ్యర్థికి ఆయన వర్గం నాయకులు సూచిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జిల్లా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా మహిళలపై దురుసుగా ప్రవర్తించేవారని విమర్శలున్నాయి. అప్పటి జెడ్పీ చైర్‌పర్సన్‌పై, అప్పటి కలెక్టర్‌లను వేర్వేరు సందర్భాల్లో ఏకవచనంతో సంబోధించటంతో పాటు వారిపై దురుసుగా ప్రవర్తించటంపై ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటున్నారు.
అనుచరుల అరాచకాలపై విమర్శలు..టీడీపీలో ఇటీవల చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అధికారంలో ఉండగా ఆయన అనుచరులు చేసిన అరాచకాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూళ్లు నుంచి మున్సిపాలిటీతో పాటు చెరుకుపల్లి మండలంలో ఏ చిన్న పనికావాలన్నా ఆయన అనుచరులు వసూళ్లకు తెగబడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకోవటంతో పనులు నాణ్యత లేకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పట్టణంలో డ్వాక్రా గ్రూపు మహిళా రుణాల కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు ఆయన అనుచరులేననే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పార్టీలో చేరటంతో ఆ ప్రభావం పార్టీపై పడుతున్నదనే ఆవేదన టీడీపీ పాత నాయకుల్లో వ్యక్తమవుతోంది.