ఇచ్చిన హామీలు నెరవేరుస్తా
- త్వరలో కేసీఆర్‌తో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా
- నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ధ్యేయం
- నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్, పదిహేనేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు.. ఈ ఐదేళ్ల కాలంలో చేసే అభివృద్ధి మరో ఎత్తు.. అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేసి నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. శనివారం పట్టణం లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అనంతరం క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలుత నల్లగొండ జిల్లా కేంద్రానికి తీసుకవచ్చి మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయిస్తానని చెప్పారు.
రేయింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తన చిరకాల వాంఛ అయిన శ్రీశైలం సొరంగమార్గంతో పాటు బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. శ్రీశైలం సొరంగ మార్గానికి గతంలోనే *2వేల కోట్లు మంజూరు చేయించానని, పనులు పూర్తి చేయించి, సాగునీరు అందిస్తానని చెప్పారు. నీరు వస్తేనే రైతులు బాగుంటారు. కూలీలు అభివృద్ధి చెందుతారన్నారు.
ఎవరూ ముఖ్యమంత్రిగా ఉన్నా మనం గౌరవించాలని ప్రజా తీర్పును తప్పకుండా గౌరవిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనూ నల్లగొండ నియోజకవర్గాన్ని మోడల్ సీటీగా తీర్చిదిద్దుతానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే నల్లగొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం 32 కోట్లు మంజూరుకు సచివాలయంలో అధికారులతో మాట్లాడనని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉత్తర్వులు జారీ కానున్నాయని తెలిపారు.
ఆపదలో ఉన్న వారు తన ఇంటికి వస్తే అండగా ఉంటానన్నారు. త్వరలోనే నల్లగొండ పట్టణ శివారులో పేదలకు 5వేల ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. జిల్లా కేంద్ర సమీపంలో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. నల్లగొండ శాసనసభ్యుడిగా మరోమారు గెలిపించిన నియోజకవర్గం ప్రజల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనన్నారు. తనకు ఓటు వేసిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.
నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ 1000, 1500, భువనగిరిలో తన సోదరుడు రాజగోపాల్‌క్షరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం బాధకలిగించిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని కవిత, కేశాని కవిత, బొడ్డుపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.