నందిగామలో కొనసాగుతున్న పోలింగ్
నందిగామ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శనివారం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలో 1,84,064 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ తరఫున బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలో గెలుపుకోసం టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. దాంతో నందిగామ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు అకాల మరణంతో సానుభూతి పవనాలు వీస్తాయని టీడీపీ తరఫున బరిలో ఉన్న ఆయన కుమార్తె సౌమ్య విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ చేసిన వాగ్ధానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. ఈ ఉప ఎన్నికకు 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.