Tangirala Sowmya
-
దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం ఎదురైంది. రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపించింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ఎమ్మెల్యే సౌమ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్‌కు కాకుండా మరొకరికి అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది.తాను చెప్పిన కౌన్సిలర్‌కే ఛైర్మన్ ఇవ్వాలని సౌమ్య పట్టుబట్టారు. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన అధిష్టానం.. కృష్ణకుమారికి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో అధిష్టానంపై ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేక సభ్యులు.. కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం సూచించిన అభ్యర్ధికే ఓటేశారు. -
ఒక సీటు.. ముగ్గురి పెత్తనం..
-
కృష్ణాజిల్లా టీడీపీలో టికెట్ల లొల్లి
సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించవద్దని సొంతపార్టీ నేతలే డిమాండ్ చేయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు భయటపడుతున్నాయి. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులపై వివాదాలు తారాస్థాయికి చేరాయి. విజయవాడ పశ్చిమ టికెట్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ప్రకటన ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీటు తన కుమార్తెకే దక్కుతుందని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ నాగూల్ మీరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నాగూల్ మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోతే టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నానితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. మరోవైపు నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పామర్రులో కూడా టీడీపీ అసమ్మతి సెగలుగక్కుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యవహారంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు ఏకమవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ వర్గం టీడీపీ నేతలు ఎన్నారైను రంగంలోకి తీసుకువచ్చారు. (మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?) అలాగే నందిగామలో టీడీపీలో కూడా అదే వరుస. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యకు ఈసారి టిక్కెట్ కేటాయించవద్దని అసమ్మతి నేతల నిరసన స్వరం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను మార్చాలంటూ టీడీపీ నేతలు ఏకంగా నిరసన దీక్షలకు దిగారు. అలాగే పెడనలో కూడా కాగిత వెంకట్రావు, వేదవ్యాస్ గ్రూపుల మధ్య విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. నూజివీడులోనూ టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. కాపా శ్రీనివాస్, ముద్రబోయిన వర్గాల మధ్య టికెట్ వివాదం తారాస్థాయికి చేరింది. (అమరావతికి టికెట్ల వేడి!) -
సౌమ్య ప్రమాణస్వీకారం
నందిగామ : నందిగామ ఉప ఎన్నికలో గెలుపొందిన తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా బుధవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణంతో ఈ నెల 13న ఉప ఎన్నిక, 16న కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సౌమ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు ధ్రువీకరణ పత్రం అందించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సౌమ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సౌమ్య లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఎమ్మెల్యేగా సౌమ్య ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: నందిగామ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన చాంబర్లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి తంగి రాల ప్రభాకర్‌రావు ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గత సంప్రదాయాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతా దృక్పథంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేదు. -
నాన్న మంచితనమే గెలిపించింది
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్ దివంగత తంగిరాల ప్రభాకరరావు కుమార్తెకు పట్టం 74,827 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్‌కు దక్కిన డిపాజిట్ ‘నోటా’కు మూడో స్థానం నందిగామ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మంచితనం వల్లే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందానని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ నెల 13న నందిగామ(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌ను మంగళవారం స్థానిక కేవీఆర్ కళాశాలలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో 1,84,064 ఓట్లు ఉండగా, 1,27,434 ఓట్లు పోలయ్యాయి. సౌమ్యకు 99,748 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన కటారపు పుల్లయ్యకు 941, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం సౌమ్య మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడం కూడా తన గెలుపునకు దోహదపడినట్లు ఆమె తెలిపారు. తన గెలుపునకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలసి ర్యాలీగా స్థానిక రైతుపేటలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సౌమ్య మంత్రి ఉమాకు పాదాభివందనం చేశారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచారు. అక్కడి నుంచి తంగిరాల ప్రభాకరరావు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు టీడీపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు. ప్రతి రౌండ్లోనూ మెజారిటీ నందిగామ కేవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఉదయం 8 గంటలకు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ సిబ్బందికి అందజేశారు. ఎన్నికల రిటర్సింగ్ అధికారి రజనీకాంతరావు కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సస్పెండ్ చేయటంతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, అబ్జర్వర్ సాగర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరిగింది. కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చివరి 15వ రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, ఎన్నికల అబ్జర్వర్ సాగర్, తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాకు గెలుపు, ఓటములతో పనిలేదు : బోడపాటి తమకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావు అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఎన్నికల్లో పోటీ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చిన తమ పార్టీకి ఉప ఎన్నికల్లో 24,921 ఓట్లు లభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, గింజుపల్లి అనిల్, జాఫర్ పాల్గొన్నారు. డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. టీడీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 74,827 భారీ మెజారిటీ రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఊరట లభించింది. మూడో స్థానంలో ‘నోటా’ నందిగామ ఉప ఎన్నికల్లో మూడో స్థానం ‘నోటా’కు లభించింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కటారపు పుల్లయ్యకు 941 ఓట్లు, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. కానీ, నోటా గుర్తును 1,177 మంది నొక్కారు. దీంతో మూడో స్థానం ‘నోటా’కు లభించినట్లయింది. -
భలే... డిపాజిట్ దక్కింది
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా కోపం చల్లారలేదు. ఆ విషయం నందిగామ ఉప ఎన్నిక ద్వారా మరోసారి రుజువైంది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావు... టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చేతిలో ఓడిపోయారు. కాకుంటే చావు తప్పి కన్నులోట్ట బోయినట్లు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ మాత్రం దక్కిందని ఆ పార్టీ నేతలు మురిసిపోతున్నారు ... రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలలో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకూడదంటూ తమ తీర్పు ద్వారా వెల్లడించారు. అయితే నందిగామ శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు ఆకస్మికంగా మరణించారు. దాంతో టీడీపీ ప్రభుత్వం ఉప ఎన్నికను నివారించేందుకు... తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాల మద్దతును కూడా కూడగట్టింది. అందుకు ఆ పార్టీలు కూడా సానుకూలంగా స్పందించాయి. సౌమ్య ఎన్నిక ఏకగీవ్రం అవుతుందని అనుకున్నరంతా. ఆ దశలో గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ ఆ ఉప ఎన్నిక ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నట్లుంది. అంతే తమ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వెల్లడించింది. అనుకున్నదే తడువుగా బోడపాటి బాబురావు తమ అభ్యర్థి అని ప్రకటించింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పార్లమెంట్, వివిధ రాష్ట్రాల శాసనసభకు నిర్వహించిన ఉప ఎన్నికలతోపాటు నందిగామ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలంతా ప్రచారం కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుపై టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని బాధ నుంచి డిపాజిట్ దక్కించుకున్నామని కొద్దిలో కొద్దిగా ఆత్మసంతృప్తి దక్కింది... సదరు నాయకులకు. దీంతో 100 రోజుల కిత్రం జరిగిన ఎన్నికల నాటికంటే కొద్దిగా పురోగతి సాధించామని కాంగ్రెస్ నాయకులు తెగ సంతోషంతో ఉన్నారు. -
నాన్నగారికి ప్రజలిచ్చిన నివాళి
-
నాన్నగారికి ప్రజలిచ్చిన నివాళి
తనకు దక్కిన ఈ విజయాన్ని తన తండ్రి తంగిరాల ప్రభాకరరావుకు ప్రజలు ఇచ్చిన నివాళిగా భావిస్తానని నందిగామ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య చెప్పారు. విజయం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ''ఈ విజయం నాన్నగారికి ప్రజలు ఇచ్చిన నివాళిగానే భావిస్తాను. విజయవాడను రాజధానిగా చేసినందుకు ప్రజలిచ్చిన కానుక. మొదటినుంచి ఎన్నికల ప్రచారంలో ఎంతో సహకరించిన రాష్ట్ర మంత్రులు ఉమా, కిశోర్ బాబులకు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నాన్నగారి అభిమానులు, నందిగామ ప్రజలు, అంతా కృషిచేశారు. ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తాను. అందరి సహకారంతో నందిగామను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు. విజయం ఊహించాను గానీ ఇంత భారీవిజయం ఊహించలేదు. గత పదేళ్లుగా నందిగామ ప్రతిపక్ష పాలనలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నాము, రాజధాని దగ్గర్లో ఉంది కాబట్టి కలిసొస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. శాయశక్తులా కృషి చేస్తాను. జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడి సహకారంతోనే ఇంత భారీ మెజారిటీ సాధ్యమైంది'' అని ఆమె చెప్పారు. -
నందిగామలో 69.49 శాతం పోలింగ్ నమోదు
(నందిగామ - అనిల్ ) నందిగామ: కృష్ణాజిల్లాలోని నందిగామ శాసనసభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆ నియోజకవర్గంలో మొత్తం 69.49 శాతం ఓట్లు పోలైయ్యాయి. ఆ శాసనసభ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పోలైన ఓట్లు చంద్రలపాడు (72.02), నందిగామ (65.21), వీరులపాడు (76.27), కంచికచర్ల (69.49). ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు విజయం సాధించారు. అయితే ఆయన గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబురావు ఎన్నికల్లో నిలబడ్డారు. -
నందిగామలో కొనసాగుతున్న పోలింగ్
-
నందిగామలో కొనసాగుతున్న పోలింగ్
నందిగామ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శనివారం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలో 1,84,064 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ తరఫున బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలో గెలుపుకోసం టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. దాంతో నందిగామ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు అకాల మరణంతో సానుభూతి పవనాలు వీస్తాయని టీడీపీ తరఫున బరిలో ఉన్న ఆయన కుమార్తె సౌమ్య విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ చేసిన వాగ్ధానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. ఈ ఉప ఎన్నికకు 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టీడీపీ అభ్యర్ధిగా తంగిరాల సౌమ్య నామినేషన్
విజయవాడ: నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తరపున తంగిరాల సౌమ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తంగిరాల సౌమ్య రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ పి.రజనీకాంతారావు అందచేశారు. తంగిరాల సౌమ్య ఇటీవల మరణించిన ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు కుమార్తె. తంగిరాల ప్రభాకర్ రావు మృతితో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సౌమ్య నామినేషన్ దాఖలు సమయంలో ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, కేశినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ ఎమ్మల్యే శ్రీరాం రాజగోపాల్ ఆమె వెంట ఉన్నారు. నందిగామ ఉప ఎన్నిక కోసం ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేయలేదని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు.