
ఎమ్మెల్యేగా సౌమ్య ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: నందిగామ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన చాంబర్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి తంగి రాల ప్రభాకర్‌రావు ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గత సంప్రదాయాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతా దృక్పథంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేదు.