నందిగామ(కృష్ణా జిల్లా): వైఎస్సార్ హయాంలో సుబాబుల్ పంట టన్నుకు రూ.4,400 ధర లభించేదని, చంద్రబాబు పాలనలో సుబాబుల్ పంట టన్నుకు కనీసం రూ.2500 కూడా లభించడం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ జగన్ ప్రసగించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆవేదన చెందుతున్నారని, అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నందిగామ నియోజకవర్గమని, బాధితులకు న్యాయం జరగకపోగా.. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని చంద్రబాబు, లోకేష్, ఆయన బినామీలు దోచుకున్నారని ఆరోపించారు.
బాబుకు ఓటేస్తే ప్రభుత్వ స్కూళ్లు ఉండవ్.. అన్నీ నారాయణ స్కూళ్లే
చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లన్నీ మూతపడతాయనీ, ఇదివరకే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు మూసేశారని, ఇకపై ఉన్న నాలుగు స్కూళ్లూ కూడా మూసేస్తారని అన్నారు. ఆ స్కూళ్ల స్థానంలో నారాయణ స్కూళ్లు వస్తాయని, ఆ స్కూళ్లలో ఇప్పుడు ఎల్‌కేజీ చదవడానికి రూ.25 వేలు వసూలు చేస్తున్నారని, బాబు అధికారంలోకి వస్తే ఫీజు రూ.లక్షకు పెంచుతారని విమర్శించారు. కాలేజీ చదువులకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించిందని అన్నారు.
భూరికార్డులు తారుమారు
చంద్రబాబు నాయుడికి ఒక్కసారి ఓటేసినందుకు భూసేకరణ చట్టాన్ని పూర్తిగా సవరించారని, అలాగే భూరికార్డులను పూర్తిగా తారుమారు చేశారని అన్నారు. మరోసారి బాబుకు ఓటేస్తే మీకు భూములుండవని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడు లారీ ఇసుక రూ.40 వేలు పలుకుతోందని, మరోసారి బాబుకు ఓటేస్తే లారీ ఇసుక రూ. లక్షకు చేరడం ఖాయమన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలన్నీ చంద్రబాబు పెట్టిన పథకాలు కాదు కాబట్టి క్రమ క్రమంగా తీసేస్తారని వైఎస్ జగన్ అన్నారు.
మరోసారి ఓటేస్తే ఎవ్వరినీ బతకనివ్వరు
చంద్రబాబుకు మరోసారి ఓటేస్తే తనను వ్యతిరేకించే ఎవ్వరినీ బతకనివ్వరని, మీ బంధువులను చంపి ఆ నేరాన్ని మీపైనే నెడతారని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో బ్యాంకుల నుంచి వచ్చే రుణాలకు పూర్తిగా కటింగ్ పెడతారని ఆరోపించారు. బాబు అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఎంత దారుణంగా పెంచారో అందరికీ తెలుసునని అన్నారు. బాబు గత చరిత్ర ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.. 1994లో సంపూర్ణ మద్య నిషేదం, కిలో రూ.2 లకే బియ్యం ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక బియ్యం ధర రూ. 2 నుంచి ఐదున్నరకు పోయింది. మద్య నిషేధం చేయకుండా కొత్తగా మద్యం షాపులు వెలిశాయని అప్పటి విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రేషన్ కార్డులు, పెన్షన్ ఎన్నికలు ముగియగానే చంద్రబాబు వెనక్కిలాగేసుకుంటారని ఆరోపించారు.
బాబు వాగ్దానాలు ఒక్కసారి గమనించండి
ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు చేస్తోన్న పనులు, వాగ్దానాలు ఒక్కసారి గమనించాలని ప్రజలను కోరారు. ఎన్నికల రాకపోయి ఉంటే అంతకు ముందున్న రూ.1000 పింఛన్ రూ.2 వేలకు పెంచేవాడా అని ప్రశ్నించారు. పైపెచ్చు ఎన్నికలయ్యాక రూ.3 వేలు ఇస్తానంటూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
బాబు వస్తే వాళ్ల జాబులు, ప్రమోషన్లు పోతాయ్
చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జాబులు రావని అన్నారు. బీసీలకు ప్రమోషన్లు ఇవ్వవద్దంటూ పై అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. బాబుకు ఓటేసి ఒకసారి మోసపోయాం.. మరోసారి ఓటేసి మోసపోవద్దని ప్రజలను కోరారు. విశ్వసనీయతకు ఓటేయాలని విన్నవించారు.
పిల్లల్ని బడికి పంపిస్తే ప్రతి కుటుంబానికి రూ.15 వేలు
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పాలని కోరారు. 14 రోజులు ఓపిక పట్టమని చెప్పండి.. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి.. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తామన్నారు. అలాగే ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్‌మోహన్ రావు, ఎంపీ అభ్యర్థి పొట్టూరి వరప్రసాద్‌లను ఆశీర్వదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment