సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించవద్దని సొంతపార్టీ నేతలే డిమాండ్ చేయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు భయటపడుతున్నాయి. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులపై వివాదాలు తారాస్థాయికి చేరాయి. విజయవాడ పశ్చిమ టికెట్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ప్రకటన ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీటు తన కుమార్తెకే దక్కుతుందని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ నాగూల్ మీరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నాగూల్ మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోతే టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నానితో కలిసి ముఖ‍్యమంత్రిని కలిశారు. మరోవైపు నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పామర్రులో కూడా టీడీపీ అసమ్మతి సెగలుగక్కుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యవహారంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు ఏకమవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ వర్గం టీడీపీ నేతలు ఎన్నారైను రంగంలోకి తీసుకువచ్చారు. (మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?)
అలాగే నందిగామలో టీడీపీలో కూడా అదే వరుస. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యకు ఈసారి టిక్కెట్ కేటాయించవద్దని అసమ్మతి నేతల నిరసన స్వరం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను మార్చాలంటూ టీడీపీ నేతలు ఏకంగా నిరసన దీక్షలకు దిగారు. అలాగే పెడనలో కూడా కాగిత వెంకట్రావు, వేదవ్యాస్ గ్రూపుల మధ్య విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. నూజివీడులోనూ టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. కాపా శ్రీనివాస్, ముద్రబోయిన వర్గాల మధ్య టికెట్ వివాదం తారాస్థాయికి చేరింది. (అమరావతికి టికెట్ల వేడి!)
Comments
Please login to add a commentAdd a comment