
‘ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు’ అన్నట్టు... వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీలకు, సచివాలయాలకు పార్టీ రంగు వేశారంటూ గగ్గోలుపెట్టిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తాము అధికారంలోకి వచ్చిన తరువాత.. వరుసపెట్టి ప్రభుత్వ భవనాలకు ‘పచ్చ’రంగు పులుముతోంది. తాజాగా కృష్ణాజిల్లా, యనమలకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సచివాలయాలకు పసుపు రంగులు వేస్తోంది. దీంతో జనాలంతా పై విధంగా విమర్శిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
నాన్నా... సాధించా..!
గుంటూరు వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే (Graduation Day) వేడుకలు మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్‌డి.ఎస్.వి.ఎల్. నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఓ విద్యార్థి డిగ్రీ సాధించిన క్రమంలో తన ఉత్సాహాన్ని తండ్రితో ఈ విధంగా పంచుకుంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
ఆకర్షిస్తున్న అడుగు ఎత్తు పుంగనూరు గిత్త దూడ
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణం, గునుపూడిలోని పురోహితుడు వేలూరి రామకృష్ణ గోశాలలో నందిని అనే ఆవుకు అడుగు ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ పుట్టింది. ఒక్క అడుగు ఎత్తుతో చూడముచ్చటగా కనిపిస్తోంది. సాధారణంగా పుంగనూరు ఆవు ఎత్తు సుమారు 1.5 నుంచి 3 అడుగుల మధ్య ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఆవుగా పుంగనూరు ఆవు గుర్తింపు పొందింది.
– భీమవరం (ప్రకాశంచౌక్)
నేలపై నింగి నీలిముద్ర
పరిశీలించి చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఓ సుందర దృశ్యమే. మండుటెండలో ఈ నీలినీడ చూపరులను ఆకట్టుకుంది. కడప నగరంలోని చెమ్ముమియాపేట–రాయచోటి వంతెనపై మంగళవారం మధ్యాహ్నం ఈ నీలి నీడలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్ కడప
వేసవితాపం.. వీటితో దూరం
వేసవి వచ్చిందంటే రోడ్లపై ఎక్కడికక్కడ పుచ్చకాయలు కుప్పలుపోసి అమ్ముతుంటారు. వేసవితాపం నుంచి సేదతీరేందుకు ప్రజలు కూడా వీటినే ఎక్కువగా తీసుకుంటారు. నెల్లూరు మినీ బైపాస్‌లో అమ్మకం కోసం పెట్టిన పసుపు రంగు పుచ్చకాయలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
పిలవని అతిథి
విరిసిన పూలపైకి పిలవని అతిథిగా వచ్చి ఊటలూరే మకరందాన్ని ఒడుపుగా సేకరిస్తుంది తేనెటీగ. ఇలా మైళ్లకొద్ది ప్రయాణించి సేకరించిన మకరందాన్ని తేనెపట్టులో భద్రపరుస్తుంది. గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో తేనెటీగ (Honey Bee) పూల నుంచి మకరందాన్ని సేకరిస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment