Punganuru cow
-
పుంగనూరు గిత్త దూడ ఎత్తు 16 అంగుళాలు
కాకినాడ జిల్లా, కరప మండలం జెడ్. భావారం గ్రామంలో పుంగనూరు జాతి గిత్త దూడ 16 అంగుళాల ఎత్తుతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మరీ పొట్టిగా ఉండటంతో గ్రామంలోని రైతులు వింతగా చూస్తున్నారు. పుంగనూరు ఆవు బుధవారం ఉదయం ఈ దూడకు జన్మనిచ్చిందని ఆ గ్రామానికి చెందిన రైతు కంచెర్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 36 అంగుళాల పొడవు, 4 కిలోల బరువు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. – కరపరైతులకు ‘జల’గండంవరుసగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామ రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీరి పంట భూములు బాహుదానదికి అవతల ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బాహుదా గెడ్డలోకి నీరు చేరడంతో కోత కోసిన ధాన్యం ఓవులను ఇంటికి తెచ్చేందుకు రైతులు పీకల్లోతు నీటిలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం మినీ వంతెన నిర్మిస్తేనే ‘జలగండం’ తప్పుతుందని అన్నదాతలు చెబుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్‘మా రోడ్డు చూడండి..’తమ రోడ్డు దుస్థితిని చూడాలంటూ విజయనగరం జిల్లా వంగర మండలం భాగెంపేట యువకులు రోడ్డుకోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరసాడ జంక్షన్ నుంచి భాగెంపేట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును డ్రోన్ కెమెరాలో బుధవారం చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీలయ్యవలస, భాగెంపేట, పటువర్ధనం, శ్రీహరిపురం, దేవకివాడ ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలకు ఈ గోతులమయమైన రోడ్డే గతని, అధికారులు సమస్యపై స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బస్సు సర్వీసును నిలిపివేశారని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – వంగరచదవండి: బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..! -
సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం
సాక్షి, అమరావతి/ రైల్వేకోడూరు : దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా, మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరీఫ్ నిర్థారించారు. చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈనెల 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ధృవీకరించారు. దేశంలోనే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించడం ఇది తొలిసారి. తొలిసారిగా సాహివాల్ దూడకు..: గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాలలో మేలు జాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి టీటీడీ గోసాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు జన్మనిచ్చేలా చేశారు. ఈసారి ఓ రైతు ఇంట ఓ నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనివ్వడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో మేలుజాతి దేశీ ఆవుల సంతతిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
చిట్టి పొట్టి ఆవులు.. చలాకీ గోవులు
పుంగనూరు జాతిలోనే అత్యంత బుల్లి ఆవు ఇది. 12 అంగుళాల (అడుగు) ఎత్తు.. 36 అంగుళాల (3 అడుగుల) పొడవుండే ఈ ఆవులను ‘మైక్రో మినీయేచర్ పుంగనూరు’గా పిలుస్తున్నారు. మనుషులకు ఇట్టే మచ్చికయ్యే ఈ ఆవులు ఇళ్లు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా.. ఏ వాతావరణంలో అయినా.. ఎక్కడైనా పెరుగుతాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. నట్టింట్లో గంతులేస్తూ.. చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తూ.. యజమానుల చుట్టూనే ఇవి తిరుగుతున్నాయి. గతంలో పెరటికి మాత్రమే పరిమితమైన ఈ బుజ్జి గోవులు ఇప్పుడు బెడ్ రూముల్లోనూ సందడి చేస్తున్నాయి. ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచుతున్నాయి. సాక్షి, అమరావతి: గోవులు.. మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ అఖండ భారతదేశంలో 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పరిమితమైంది. పొట్టి జాతి ఆవుల విషయానికి వస్తే మల్నాడ్ గిడ్డ (కర్ణాటక), వేచూరు (కేరళ), మన్యం (ఆంధ్రప్రదేశ్), బోనీ (బెంగాల్), మినీ మౌస్ (నేపాల్) జాతులు ఉన్నాయి. మన్యం–ఒంగోలు బ్రీడ్స్ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. పుంగనూరుతో సహా కనుమరుగైన పొట్టి జాతి గోవులను సంరక్షించాలన్న తపనతో కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ నాడీపతి వైద్యుడు పెన్మత్స కృష్ణంరాజు సాగించిన పరిశోధనల ఫలితంగా అతి చిన్నవైన ‘మైక్రో మినీయేచర్ పుంగనూర్’ ఆవులు పురుడు పోసుకున్నాయి. ఏ వాతావరణంలోనైనా పెరిగేలా.. మట్టి నేలలతోపాటు గచ్చు, ఫామ్‌హౌజ్, టైల్స్, మార్బుల్స్‌తో కూడిన ఇళ్లు, అపార్టుమెంట్స్‌లో సైతం పెంచకునేలా 4 రకాలుగా వీటిని అభివృద్ధి చేశారు. అడుగు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు, 40 నుంచి 70 కిలోల బరువుతో రోజుకు లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలిచ్చేలా వీటిని అభివృద్ధి చేశారు. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పశుగ్రాసంతోపాటు ఎలాంటి ఆహారన్నయినా జీర్ణించుకోగలుగుతాయి. పెద్దలకే కాకుండా పిల్లలకు సైతం కూడా ఇట్టే మచ్చికవుతాయి. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మందికి వీటిని అందించారు. మైక్రో మినీయేచర్ సహా వివిధ జాతులతో అభివృద్ధి చేసిన 500 వరకు పొట్టి జాతుల ఆవులు నాడీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. నిత్యం గో ప్రేమికులు ఈ గోశాలను సందర్శిస్తూ చెంగుచెంగున గంతులేసే పొట్టి గోవుల మధ్య పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ మురిసిపోతున్నారు. నాడీపతి గోశాలలో సందడి చేస్తున్న పొట్టి ఆవులు వాటి అల్లరి చెప్పనలవి కాదు ఏడాది వయసున్న 2 అడుగుల ఎత్తు గల రెండు మినీయేచర్ పుంగనూరు ఆవులను తీసుకెళ్లి మా అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని ప్లాట్‌లో పెంచుకుంటున్నాం. ఎలాంటి ఆహారం పెట్టినా తింటున్నాయి. మాతో పాటే వాకింగ్ చేస్తాయి. కారులో కూడా మా వెంట తీసుకెళ్తాం. ఇంట్లో అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కుటుంబంలో భాగమైపోయాయి. చిన్నప్పటి నుంచి పెరట్లో ఆవులను పెంచుకోవాలన్న మా కోరికను ఇలా తీర్చుకుంటున్నాం. – వల్లివాటి శ్రీనివాసబాబు, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వాటి మధ్య ఉంటే టెన్షన్ హుష్‌కాకి మా ఇంట్లో రెండు మినీయేచర్ గిత్తలను పెంచుకుంటున్నాం. అవి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. వాటిని చూస్తే చాలు మాలో ఉన్న టెన్షన్స్ చేత్తో తీసేసినట్టు పోతాయి. మాతోనే ఉంటున్నాయి. మాతో పాటే తింటున్నాయి. వాటికి ప్రత్యేకంగా బెడ్స్ కూడా ఏర్పాటు చేశాం. మాతో పాటే పడుకుంటున్నాయి. – పి.సూర్యనారాయణరాజు, పత్తేపురం, పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టాం రెండు మినీయేచర్ పుంగనూరు ఆవుల్ని తెచ్చుకున్నాం. లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టుకున్నాం. పేరు పెట్టి పిలవగానే చెంగున వచ్చి ఒడిలో వాలిపోతాయి. వాటిని చంటిపాపల్లా చూసుకుంటున్నాం. అవి లేకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్తున్నాం. వాటితో గడుపుతుంటే మనసు ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది – అమటం పద్మావతి, విశాఖ ప్రపంచంలో ఎక్కడా లేవు 1,632 ఆవులను బ్రీడింగ్ చేయడం ద్వారా వీటిని ఒక అడుగు ఎత్తు వరకు తీసుకురాగలిగాం. మినియేచర్ పుంగనూరు ఆవుల ఎత్తు 2 అడుగుల్లోపు కాగా, మైక్రో మినీయేచర్ పుంగనూరు ఆవుల ఎత్తు అడుగులోపే. ప్రపంచంలో ఇవే అత్యంత పొట్టి జాతి ఆవులు. వీటికి పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేశా. వచ్చే పదేళ్లలో కనీసం లక్ష ఆవులను పునరుత్పత్తి చేసి అడిగిన ప్రతీ ఒక్కరికి అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. – డాక్టర్ పెన్మత్స కృష్ణంరాజు, పరిశోధకుడు, నాడీపతి గోశాల వ్యవస్థాపకుడు 14 ఏళ్ల పరిశోధనల ఫలితం నాడీపతిలో పీహెచ్డీ చేసిన కృష్ణంరాజు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన ప్రాచీన భారతీయ సనాతన వైద్యవిధానంతోపాటు అంతరించిపోతున్న అరుదైన పొట్టిజాతి గోవుల పునరుత్పత్తిపై 14 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నాడీపతి వైద్య విధానంపై శిక్షణ ఇస్తూ సర్జరీలు, సైడ్ఎఫెక్ట్ లేని 100 రకాల థెరఫీల ద్వారా దీర్ఘకాలిక రోగాలకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతి అవులను సృష్టించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో నాడీపతి గోశాల నెలకొల్పారు. తొలుత పుంగనూరు–బోనీ జాతులను క్రాసింగ్ చేసి 3 అడుగుల ఎత్తు గల పొట్టి ఆవులను అభివృద్ధి చేశారు. వాటిని దేశంలో ఇతర పొట్టి జాతి బ్రీడ్‌లతో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో మరిన్ని పొట్టి జాతి ఆవులను అభివృద్ధి చేశారు. చివరగా పుంగనూరుతో బోనీ, మల్నాడ్ గిడ్డ, మినీ మౌస్, వేచూరు ఆవులతో క్రాసింగ్ చేసి మైక్రో మినేయేచర్ పుంగనూరు ఆవును సృష్టించారు. -
ప్రభవించిన పుంగనూరు
పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్‌లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. – పలమనేరు పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్‌ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. అధిక వెన్న, పోషక విలువలు పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది. -
పుంగనూరు ఆవులకు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, అమరావతి: అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా పలమనేరులోని పుంగనూరు పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022 లభించింది. జాతీయ స్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఏపీకి ప్రత్యేకం ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు జాతి పశువులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం. కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే పెరిగే ఈ జాతి పశువులు రెడ్, బ్రౌన్, బ్లాక్, తెల్లటి రంగుల్లో తోక నేల భాగాన్ని తాకే విధంగా ఉంటాయి. ఏడాదికి సగటున 5 నుంచి 8 శాతం కొవ్వుతో 500 కేజీల వరకు పాల దిగుబడి ఇస్తాయి. ‘మిషన్ పుంగనూర్’ కింద ఈ జాతి పశువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ కృషి ఫలితంగా గడచిన మూడేళ్లలో 176 పుంగనూరు దూడలు జన్మించాయి. ప్రస్తుతం రీసెర్చ్ స్టేషన్లో 268 పుంగనూరు జాతి పశువులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈ ఏడాది నాలుగు కేటగిరీలలో బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డులను ఐసీఎఆర్ ప్రకటించగా, కేటిల్ కేటగిరీలో పుంగనూరు జాతికి ఈ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుతో పుంగనూరు జాతి పరిరక్షణకు ఐసీఏఆర్ కూడా అవసరమైన చేయూత ఇచ్చేందుకు మార్గం సుగమమైందని రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వేణు ‘సాక్షి’కి తెలిపారు. -
జాతి మెరిసేలా.. పునరుత్పత్తి పెరిగేలా!
అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల సంరక్షణే ధ్యేయంగా వెటర్నరీ యూనివర్సిటీ అడుగులు వేస్తోంది. మేలు జాతి దూడల పరిరక్షణే లక్ష్యంగా దూసుకుపోతోంది. దీనికోసం అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పిండ మార్పిడి చేసేందుకు వీలుగా సరికొత్త ప్రయోగశాలను సిద్ధం చేసింది. సరోగసీ ద్వారా పుంగనూరు జాతి సంతతిని మరింత పెంచేలా ప్రణాళిక రచించింది. ఈమేరకు పలమనేరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ప్రారంభించనుండటం విశేషం. తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ తన ప్రగతి ప్రస్థానంలో మరో ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లాలకు తలమానికమైన పుంగనూరు జాతి పొట్టిరకం ఆవుల పరిరక్షణ, మేలు జాతి దూడల పునరుత్పత్తికి ఇన్విట్రో ఫరి్టలిటీ(ఐవీఎఫ్), ఎంబ్రియో ట్రాన్స్ఫర్(పిండ మార్పిడి) టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. పలమనేరులోని వర్సిటీ పశుపరిశోధన స్థానంలో ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.1.8 కోట్ల రా్రïÙ్టయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) నిధులు వెచ్చించింది. మూడో ప్రయోగశాల శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధి, పలమనేరులోని పశుపరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఐవీఎఫ్ ల్యాబ్ మూడవది. గుంటూరులోని లాం ఫామ్‌లో ఒంగోలు జాతుల అభివృద్ధికి ఐవీఎఫ్ ల్యాబ్ ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే టీటీడీతో కుదుర్చుకున్న ఎంఓయూలో భాగంగా టీటీడీ గోశాలల్లోని దేశీయ ఆవుల్లో మేలు జాతిని ఉత్పత్తిచేసి శ్రీవారి సేవకు ఉపయోగించేందుకు వీలుగా తిరుపతి వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ)లో రూ.3.2 కోట్లతో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దేశీయ ఆవుల ఉత్పత్తి పెంచి రోజుకు 3 వేల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి కోసం పలమనేరు పరిశోధన స్థానంలో ఐవీఎఫ్ ప్రయోగశాలను బుధవారం ప్రారంభించనున్నారు. నేడు ప్రారంభం వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం, పలమనేరులోని పశు పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్, ఈటీ ప్రయోగశాలలను పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారంప్రారంభించనున్నారు. విద్యలో ప్రమాణాల పెంపునకు పరిశోధనల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున వెటర్నరీ వర్సిటీ పశువైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వెటర్నరీ వర్సిటీ ఆవరణలో రూ.7.04 కోట్లతో అత్యాధునిక వసతులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆకట్టుకునే విధంగా భవన నిర్మాణం రూపకల్పన చేశారు. ఇందులో పూర్వవిద్యార్థి (ఎన్ఆర్ఐ) ప్రతాపరెడ్డి పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పశువైద్య విద్య, న్యూట్రిషన్ కోర్సులకు సంబంధించి అత్యాధునిక జర్నల్స్ అందుబాటులో ఉంచనున్నారు. -
పుంగనూరు పొట్టి ఆవు@ రూ.4.10 లక్షలు
సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అరుదైన పుంగనూరు జాతి పొట్టి ఆవును రూ.4.10 లక్షలకు హరిద్వార్‌లోని బాబా రామ్‌దేవ్ ఆశ్రమం కొనుగోలు చేసింది. తెనాలి పట్టణంలోని రామలింగేశ్వపేటకు చెందిన కంచర్ల శివయ్య దేశవాళీ ఆవులను పెంచుతున్నారు. ఆయన దగ్గర ఒంగోలు, పుంగనూరు, కపిల, సాహిల్, గిర్ జాతి ఆవులు వంద వరకు ఉన్నాయి. ఇందులోని ఒక పుంగనూరు ఆవును ప్రముఖ యోగాచార్యుడు, పతంజలి ఆయుర్వేద మందుల ఉత్పత్తిదారు అయిన బాబా రామ్‌దేవ్ ఆశ్రమం కొనుగోలు చేసింది. మూడున్నర సంవత్సరాల వయసు గల తొలి చూడి ఆవును రూ.4.10 లక్షలకు విక్రయించినట్టు శివయ్య కుమారుడు కంచర్ల శివకుమార్ వెల్లడించారు. ఆదివారం ఈ ఆవును ప్రత్యేక వ్యానులో హరిద్వార్ తరలించారు. చదవండి: సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు -
అరుదైన రకం.. మేలైన నిర్ణయం!
అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులకు మంచి రోజులు వచ్చాయి. వెయ్యేళ్ల నాటి ఆవుగా గుర్తింపు పొందిన ఈ పొట్టి రకాన్ని అధికంగా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం ఐవీఎఫ్ ల్యాబ్‌తోపాటు సెమన్ స్టోరేజీ బ్యాంకును పలమనేరులోనే ఏర్పాటు చేసింది. సరోగసీ పద్ధతిలో పొట్టి జాతి ఆవుల అధికోత్పత్తికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతోంది. పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు జాతికి పేరుంది. ప్రస్తుతం వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వీటిని అధికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశుపరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ల్యాబ్‌ను నెలరోజుల్లో ప్రారంభించేందుకు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం పేరుతో ప్రారంభమైన ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్‌సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 276 పశువుల వరకు పెరిగినప్పటికీ ఆశించినంత ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంక్రమణం చెందడంతో జన్యుపరమైన ఇబ్బందులతో దూడలు ఆరోగ్యకరంగా జన్మించడం లేదు. దీనిపై దృష్టిపెట్టిన ప్రభుత్వం స్థానిక పరిశోధనా కేంద్రంలో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ల్యాబ్) నెలకొల్పింది. దీంతోపాటు ఎన్ఏహెచ్ఈపీ (నేషనల్ అగ్రికల్చర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్)కింద ఐకార్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ద్వారా రూ.3 కోట్ల నిధులతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా స్థానిక ల్యాబ్‌లో సెమన్ స్టోరేజీ చేసి, ఆ వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్‌లోని యన్.బి.ఏ.జి.ఆర్ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరిచేవారు. ఇకపై పూర్తి స్థాయిలో అన్ని పనులు ఇక్కడే జరగనున్నాయి. పిండమార్పిడి పద్ధతి పుంగనూరు జాతి ఎద్దునుంచి సెమన్‌ను తీసి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భ«ధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగుచేసి సరోగసీ పద్ధతిలో ఎదకొచ్చిన ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. తద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టిరకం పశువుల ఉత్పత్తి జరగనుంది. అంతరించిపోతున్న అరుదైన జాతులు దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 276కు చేరుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఇవి వందకు పైగా ఉన్నట్టు సమాచారం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవుల (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. ఇక అ«ధిక పాలనిచ్చే షాహీవాల్ రకం కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి మన దేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్‌లోనూ మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా వీటన్నింటికంటే అత్యంత అరుదైన జాతి పుంగనూరు రకమే. అందుకే వీటిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుంగనూరు రకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 276 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎల్డీఏ ద్వారా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు ఇప్పటికే కృషి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ సిద్ధమవుతుంది. దీంతో వీర్యాన్ని వృథా కానీయకుండా ఎక్కువ పశువులకు ఇచ్చి పుంగనూరు వెరైటీని పెంచుతాం. రాబోవు రెండేళ్లలో పశువుల సంఖ్యను 500 చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. డాక్టర్ వేణు, సైంటిస్ట్, పశుపరిశోధన కేంద్రం, పలమనేరు -
Punganur Cow: బుల్లి ఆవుకు అరుదైన గౌరవం
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు జాతి ఆవులను క్రీ.శ. 610 సంవత్సరంలో గుర్తించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. బాణులు, నోళంబులు, వైదంబ చోళ ప్రభువులు పుంగనూరు ఆవును పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకు గల అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందాయి. చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా! ఆవుల విశిష్టత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు ఆవులు చిన్న అకారాన్ని కలిగి ఉంటాయి. మంచి ఔషధ గుణాలు, స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఆవు పాలకు మంచి గిరాకీ ఉంది. తెలుపు, నలుపు వర్ణాలతో ఉంటాయి. ఈ ఆవు పాలలో ఉన్న ఔషధ గుణాలు మరే పాలలోనూ లేదని బయోడైవర్సిటీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ ఆవుల చరిత్ర, విశిష్టత గురించి మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో గెజిట్‌ను విడుదల చేసింది. అలాగే కేఎస్ఎస్ శేషన్ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్ రోల్ ఇన్ రూరల్ ఎకానమీలో పుంగనూరు ప్రాంత ఆవుల గురించి జమీందారులు చేపట్టిన సంరక్షణ చర్యలను విశదీకరించారు. రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఈ జాతి ఆవులు అంతరించిపోతుండడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్శా ఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు జాతి ఆవుకు తగిన గుర్తింపునకు చర్యలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా పోస్టల్ స్టాంపు, కవర్ విడుదల చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆవుకు జాతీయ గుర్తింపు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకతలు ♦ఈ ఆవులు 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ♦ఎద్దులు కూడా ఇదే పరిణామంలో ఉంటాయి. ♦పుంగనూరు ఆవులను దేవతా గోవులుగా పిలుస్తారు. ♦సాధారణ గోవు పాలలో 3 నుంచి 3.5 శాతం వరకు కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ జాతి ఆవు పాలలో 8 శాతం కొవ్వు పదార్థాలతో పాటు పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ♦ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువు కలిగి ఉంటుంది. ♦ప్రతి రోజూ ఒక ఆవు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ♦2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. ♦ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. ♦లేత చర్మం, చిన్న పొదుగు, చిన్న తోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. ♦వీటి ధర రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. -
పుంగనూరు గిత్తలా.. మజాకా!
మామిడికుదురు: పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలను కొనేందుకు పలు ప్రాంతాల నుంచి రైతులు క్యూ కడుతున్నారు. ఒక్కో గిత్తను రూ.లక్షకు కొనేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలకు జన్మనిచ్చింది. అచ్చమైన తెలుపు వర్ణంలో ఉండటంతో వాటికి ఎనలేని డిమాండ్ వచ్చింది. మూడు నెలల వయస్సున్న ఒక్కో కవల కోడె దూడ ధర రూ.లక్ష పలుకుతోంది. ఆ కవల గిత్తలను కొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు వస్తున్నారు. చెన్నై, భీమవరం, రాజమహేంద్రవరం, సఖినేటిపల్లి, బెండమూర్లంక తదితర ప్రాంతాల నుంచి రైతులు క్యూ కట్టారు. కానీ వాటిని అమ్మేందుకు రైతు నాగేశ్వరరావు విముఖత చూపుతున్నారు. పుంగనూరు గిత్తల వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే వాటిని కొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. -
ఈ ఆవు దూడ ధర 1.75 లక్షలు.. ఇక ఈ వింత చేప..!
ఖమ్మం అర్బన్: ఖమ్మం 10వ డివిజన్ కార్పొరేటర్ చావ మాధురినారాయణరావుకు పశుపోషణ, వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. అందుకే ఆయన ఏ పదవిలో ఉన్నా వ్యవసాయాన్ని మాత్రం వీడలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని చక్రి గ్రామంలో పుంగనూరు జాతికి చెందిన ఆవు దూడను రూ.1.75లక్షలకు ఆయన కొనుగోలు చేశారు. ఈ దూడ ఎత్తు రెండున్నర అడుగులు, పొడవు 4 అడుగుల వరకు ఉంది. ఈ జాతి ఆవుల పాలు, నెయ్యిని తిరుమలలో పూజలకు వినియోగిస్తారని మాధురినారాయణరావు తెలిపారు. కాగా, ఖరీదైన దూడను చూసేందుకు స్థానిక రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. వింత చేప... ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ పడమర కోటలో ఓ వింత చేప వలలో చిక్కింది. మంగళవారం ఉదయం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన వలకు ఓ చేప చిక్కింది. సుమారు అరకిలో బరువు ఉన్న ఈ చేప పొలుసుల వెంట మొత్తం ముళ్లు ఉన్నాయి. చేపను స్థానికులు ఆసక్తిగా గమనించారు. రెండు తలలతో గొర్రె పిల్ల జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం రెండు తలలు, నాలుగు కళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్‌కు చెందిన మందలోని ఓ గొర్రె ఈ పిల్లను ఈనింది. చదవండి: కో.. కో.. కోడి బాగుంది.. -
AP: పుంగనూరు ఆవులపై పరిశోధనలు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు లాం ఫాం పరిశోధన స్థానంలో అరుదైన దేశీయ జాతి అయిన పుంగనూరు గో జాతిపై పరిశోధనలు జరగనున్నాయి. ఈ జాతి అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.69.32 కోట్లతో మిషన్ పుంగనూరు ప్రాజెక్ట్‌కు అనుమతులిచ్చిన సంగతి తెల్సిందే. లాం ఫాం శాస్త్రవేత్తలు చేపట్టే ఈ పరిశోధనలకు శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్ లాం ఫాంలో ఇప్పటికే ఒంగోలు జాతిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇన్విట్రో ఫెర్టిలిటీ టెక్నాలజీ (ఐవీఎఫ్) ద్వారా పిండమార్పిడి పరిశోధనలు చేస్తున్నారు. పుంగనూరు జాతి అభివృద్ధికి నిర్వహించే పరిశోధనల్లో పిండాలు, ఆవుల అండాలను సేకరించి భద్రపరిచే ప్రక్రియ (స్టాండర్డైజేషన్) కోసం ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కల్గిన 10 మేలు జాతి ఆవులను గుర్తించి గుంటూరుకు తరలిస్తున్నారు. ఇప్పటికే 6 పశువులను పంపామని, మరో 4 పశువులను పరీక్షల అనంతరం పంపుతామని వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు -
Punganur Cow: వెయ్యేళ్ల నాటి ఆవుకు వెయ్యికోట్లు
ఈ ఆవుల కోసం యుద్ధాలు జరిగాయి.. శాసనాలు కీర్తించాయి. కరువు రక్కసిని తట్టుకున్నాయి. ఔషధ పాలను అందించాయి. దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. అయితే కాలక్రమేణా అంతరించిపోయాయి. మందల నుంచి వందల్లోకి చేరాయి. ఈ క్రమంలో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. వెయ్యేళ్ల నాటి ఆవు కోసం వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. పుంగనూరు: దేశవాళీ ఆవుల్లోనే విశిష్టమైన పుంగనూరు జాతి అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆవుల పరిశోధనలు, ఉత్పత్తికి వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. కడపలో ఈ ఆవుల అభివృద్ధి, పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు గత ఏడాది రూ.70 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పుంగనూరు జాతి పశువులు 241 వరకు ఉన్నట్లు సమాచారం. పలమనేరు క్యాటిల్‌ఫామ్‌లో 221 ఉండగా, అనంతపురం జిల్లా కూడేరులో పాడి రైతు కృష్ణమూర్తి వద్ద 20 ఉన్నాయి. వీటిని సంరక్షిస్తూ పునరుత్పత్తిని పెంచడానికి అవసరమైన పరిశోధనలు జరిపేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పుంగనూరు జాతి అభివృద్ధే లక్ష్యం పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం ఏర్పడింది. ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్‌సైటీవ్ కాన్జర్వేషన్(స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో ఇది ప్రారంభమైంది. గతంలో పుంగనూరు పొట్టి రకం ఆవులు పుంగనూరు, పలమనేరు, మదనపల్లెల్లో పుట్టి వృద్ధి చెందేవి. అప్పట్లో పుంగనూరు సంస్థానాధీసులు వీటిని పిఠాపురం, కాకినాడ సంస్థానాధీసులకు బహుమానంగా అందజేయడంతో ఆ ప్రాంతంలోనూ ఇవి కొంతవరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన జాతులు దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 350 దాకా ఉండగా, అందులో 221 వరకు పలమనేరులోని పశు పరిశోధనా కేంద్రంలోనే ఉన్నాయి. అలాగే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవులు (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. అధిక పాలనిచ్చే షాహీవాల్ రకం కూడా కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్‌లోని మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. తగ్గుతున్న ఉత్పత్తి పదిహేడేళ్ల క్రితం 20 పొట్టి రకం ఆవులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అనుకున్నంతగా ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంకరణం చెందడంతో ఉత్పత్తి అయ్యే దూడలు ఆరోగ్యంతో జన్మిస్తున్నాయి. జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కోడెల ద్వారా ఉత్పత్తి అయ్యే దూడలు బలహీనంగా పుట్టి మృతిచెందుతున్నాయి. పిండమార్పిడి పద్ధతి ద్వారా.. పరిశోధనా కేంద్రంలో ప్రభుత్వం రూ.1.18 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబ్) నెలకొల్పింది. దీని ద్వారా ఎదకొచ్చిన ఆవుకు పుంగనూరు జాతి సెమన్‌ను ఇచ్చి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భాధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగు చేసి సరోగసి పద్ధతిలో ఇతర ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఈ జాతి వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్‌లోని యన్.బి.ఏ.జి.ఆర్ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరుస్తున్నారు. పుంగనూరు జాతి చరిత్ర క్రీస్తుశకం 610 సంవత్సరంలో పుంగనూరు జాతి ఆవులను గుర్తించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణాపద దేశంలోని పుంగనూరు ప్రాంతంలో పొట్టి ఆవులను కనుగొన్నారు. బాణులు, నోళంబులు, వైదంబచోళ ప్రభువులు పుంగనూరు ఆవులను తమ సంస్థానాల్లో పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకున్న అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవుల అభివృద్ధి సాగింది. మందలు మందలుగా ఉండే ఈ ఆవుల కోసం యుద్ధాలు చేసేవారు. విజేతలు విజయచిహ్నంగా ఆవుల మందలను తీసుకెళ్లినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకతలు పుంగనూరు జాతి ఆవులు దేశంలోనే మరెక్కడా కనిపించవు. సాధారణ ఆవు పాల ధరకంటే ఈ ఆవుపాలకు రెట్టింపు గిరాకీ ఉంది. తెలుపు, నలుపు ఆవుల పాలు, పెరుగు, నెయ్యికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాలలో అత్యధికంగా ఔషధ గుణాలున్నట్లు బయోడైవర్సిటీ ప్రకటించింది. పుంగనూరు ఆవుల చరిత్ర, విశిష్టతపై మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో గెజిట్‌ను విడుదల చేసింది. కెఎస్ఎస్.శేషన్ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్ రోల్ ఇన్ రూరల్ ఎకానమిలో పుంగనూరు జాతి సంరక్షణకు జమీందారులు చేపట్టిన చర్యలు విశదీకరించారు. మహాబలి బాణరాజు విక్రమాదిత్య కాలంలో నోళంబులు దాడులు చేసి ఆవుల మందలను తోలుకెళ్లినట్లు బూడిదపల్లె, కురిజల, మినికి, మేటిమంద, కరకమంద, ఈడిగపల్లె, సోమల, రామసముద్రం గ్రామాల్లోని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీరామారావు పుంగనూరు ఆవులను పోషించుకునేవారు. విశిష్టతలు ► పశువు 70 నుంచి 90 సెంటిమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ► ఈ ఆవు పాలలో 8 శాతం కొవ్వు ఉండి, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ► ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువుంటాయి. ► రోజుకు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ► 2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తుంది. ► ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. ► లేత చర్మము, చిన్న పొదుగు, చిన్నతోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. ► ఈ ఆవుల ధర లక్ష నుంచి ఇరవై లక్షల వరకు పలుకుతుంది. పూర్వవైభవం దిశగా చర్యలు కనుమరుగవుతున్న పుంగనూరు జాతి పాడి ఆవులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేశాం. అతి తక్కువ ధరకు లభించే ఈ ఆవులను ఇప్పుడు లక్షలాది రూపాయలతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. తాజా పరిస్థితిపై సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికి నివేదికలు అందజేశాం. ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చొరవ చూపని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరు ఆవుల పునరుత్పత్తికి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం అభినందనీయం. ఈ ప్రాంతం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. – డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి మంచి పరిణామం పుంగనూరు జాతి ఆవులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. నా చిన్నప్పుడు పుంగనూరు, పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోను రెండు, మూడు ఆవులు ఉండేవి. ప్రస్తుతం అవి వెదికినా కనిపించడం లేదు. నూరు రూపాయలకు లభించే ఆవు ఇప్పుడు రెండు లక్షల ధర పలుకుతోంది. ఈ జాతికి కోడెదూడలు పుడుతుండడంతో పునరుత్పత్తి బాగా తగ్గిపోయింది. – ఖాదర్‌ఖాన్, ఆవుల వ్యాపారి, పుంగనూరు మరింత అభివృద్ధి ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 221 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. అరుదైన పుంగనూరు పొట్టి రకం జాతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. – గంగరాజు, సీనియర్ సైంటిస్ట్, పలమనేరు సంరక్షణ సులభం పుంగనూరు ఆవులను డార్వ్స్కౌస్ అంటారు. ప్రపంచ దేశాలలో అతిపొట్టి రకమైన పుంగనూరు ఆవులో వ్యాధి నిరోధక శక్తి అధికం. ఇంగ్లండ్‌లోని డెస్టర్కౌ 90 సెంటిమీటర్ల ఎత్తు ఉంటుంది. పుంగనూరు ఆవులు 70 నుంచి 80 సెంటిమీటర్లు ఎత్తు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ డస్టర్కౌకు ఇవ్వడం సమంజసం కాదు. జమీందారులకు ప్రీతిపాత్రమైన పుంగనూరు జాతి ఆవుల మేత కోసం నియోజకవర్గంలోని ఆవులపల్లెలో కొన్నివేల ఎకరాలను కేటాయించిన చరిత్ర ఉంది. – కెఎస్ఎస్.శేషన్, విశ్రాంత ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ -
నెట్టింట్లో హల్చల్ చేస్తోన్న అరుదైన జాతి దూడ
సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చాక చిన్న చిన్న విషయాలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇదేదో రాజకీయాలు, సినిమాలకు సంబంధించినది అని అనుకుంటే పొరపాటే. ఓ చక్కటి అందమైన చిన్న లేగదూడకు చెందినది. ఇది సాధారణ లేగ దూడ కాదు. ఇదో ప్రత్యేకమైన జాతికి చెందినది. చిత్తూరు జిల్లాలోని పంగనూరులో ఈ జాతి ఆవులు ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చేస్తున్న రాజీవ్ కృష్ణ ట్విటర్లో పోస్టే చేశారు. ఇతను వైఎస్సార్సీపీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇక ఆవు గురించి చెబుతూ.. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవని, బరువు కూడా 150 నుంచి 200 కేజీలే ఉంటాయని తెలిపారు. కానీ పాలు మాత్రం రోజూ 4 నుంచి 5 లీటర్ల దాకా ఇస్తాయనీ, ఆ పాలు చాలా చిక్కగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా వీడియో విషయానికొస్తే.. ఈ లేగ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ ఇళ్లంతా సందడి చేస్తోంది. ఈ ప్రత్యేకమైన జాతి ఆవు వీడియోను చూస్తుంటే ప్రతి ఒక్కరికి క్యూట్ ఫీల్ కలిగిస్తోంది. అందుకే 50 సెకండ్ల వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు. జనరల్‌గా పిల్లులు, కుక్కల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల వీడియోలను కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఇది మాత్రం ప్రత్యేకమైన వీడియోనని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ Awwwww, I want one of these. pic.twitter.com/AGVtiB9Lw5 — Shefali Vaidya. (@ShefVaidya) February 14, 2021 -
‘దేశీ’ దశగవ్య!
దేశీ ఆవుల ఆలంబనగా సేంద్రియ వ్యవసాయాన్ని ఓ మహిళా రైతు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గిర్ ఆవుల పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయబద్ధంగా నెయ్యిని తీస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవుల నెయ్యి, పాలు, పేడ, మూత్రం తదితరాలతో పంచగవ్య మాదిరిగా ‘దశగవ్య’(సేంద్రియ పంటల పెరుగుదలకు ఉపకరించే పోషక ద్రావణం) తయారు చేస్తున్నారు. తన 25 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పశుగ్రాసాలు, ఆహార పంటలను పండిస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, దశగవ్య, ఘనజీవామృతం విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటున్న ఉడుముల లావణ్యారెడ్డి ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. మంజీర నది తీరాన సంగారెడ్డి జిల్లా అందోలు వద్ద 25 ఎకరాల్లో కొలువైన విలక్షణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అది. హైద్రాబాద్‌కు చెందిన ఉడుముల లావణ్య రెడ్డి మక్కువతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200కు పైగా ఉత్తమ దేశీ గిర్ జాతి గోవులున్నాయి. పుంగనూరు, సాహివాల్ వంటి ఇతర దేశీ జాతుల ఆవులు సైతం ఒకటి, రెండు ఉన్నాయి. ప్రస్తుతం 40 గిర్ ఆవులు పాలు ఇస్తున్నాయి. లావణ్య రెడ్డి పాలు అమ్మరు. పాలను కాచి తోడుపెట్టి, పెరుగును చిలికి సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. ప్రతి 28 లీటర్ల పాలకు కిలో నెయ్యి తయారవుతుందని, నెలకు 80–90 కిలోల నెయ్యిని తాము ఉత్పత్తి చేస్తున్నామని ఆమె తెలిపారు. దీంతోపాటు.. సేంద్రియ పంటలు ఏపుగా పెరిగేందుకు దోహదపడే దశగవ్య అనే పోషక ద్రావణాన్ని తయారు చేసి తమ పంటలకు వాడుకుంటూ, ఇతరులకూ విక్రయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, దశగవ్య, అగ్రి అస్త్రం కూడా తయారు చేసుకొని పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తొలి ఏడాదే జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్ సన్న రకాల ధాన్యాన్ని ఎకరానికి 40 బస్తాలు(70 కిలోల) పండించామని ఆమె తెలిపారు. ఆమె కృషికి మెచ్చిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఇటీవల ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని ప్రదానం చేసింది. దశగవ్య తయారీ పద్ధతి సేంద్రియ పంటల పెరుగుదలకు దోహదపడే గోఉత్పత్తులతో ‘పంచగవ్య’ తయారీకి తమిళనాడుకు చెందిన డా. నటరాజన్ ఆద్యుడు. అదే రీతిలో 10 ఉత్పాదకాలను కలిపి దశగవ్యను తయారు చేయడం వాడుకలోకి వచ్చింది. దశగవ్య తయారీపై లావణ్య రెడ్డి అందించిన వివరాలు.. 50 లీటర్ల బ్యారెల్‌ను తీసుకొని.. 40 లీటర్ల దశగవ్యను తయారు చేయాలి. 7.5 కిలోల పేడ, 7.5 లీటర్ల మూత్రం, 750 గ్రాముల నెయ్యి, 5 లీటర్ల పాలు, 5 లీటర్ల పెరుగు, 5 లీటర్ల కొబ్బరి నీళ్లు, 5 లీటర్ల చెరుకు రసం, చిన్నవైతే 24–పెద్దవైతే 18 అరటి పండ్లు, 2 కిలోల నల్ల ద్రాక్ష పండ్లు, 5 లీటర్ల తాటి కల్లుతో దశగవ్యను తయారు చేయాలి. మొదట బ్యారెల్‌లో పేడ, నెయ్యి వేసి అరగంట నుంచి గంట వరకు కట్టెతో బాగా కలపాలి. అనంతరం దానికి మూత పెట్టకూడదు. పల్చటి గుడ్డ కట్టాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట కలియదిప్పాలి. 5వ రోజు పైన చెప్పిన మోతాదులో మిగతా 8 రకాలను కలపాలి. 18వ రోజు వరకు రోజూ ఇలాగే రోజుకు నాలుగు సార్లు కలియదిప్పుతూ ఉండాలి. 19వ రోజున వడపోస్తే.. దశగవ్య సిద్ధమవుతుంది. సీసాల్లో నింపి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత కలియదిప్పాల్సిన అవసరం లేదు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. వడపోయగా వచ్చిన పిప్పిని పంట పొలంలో ఎరువుగా వేసుకోవచ్చు. 15 రోజులకోసారి పిచికారీ దశగవ్యను వివిధపంటలపై 30 లీటర్ల నీటిలో ఒక లీటరు దశగవ్యను కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయవచ్చని లావణ్యారెడ్డి తెలిపారు. డ్రిప్ ద్వారా కూడా పంటలకు అందించవచ్చు. ఎకరం వరి పంటకు పిచికారీకి సుమారు 200 లీటర్ల ద్రావణం అవసరమవుతుందని, అందుకు ఆరు–ఏడు లీటర్ల దశగవ్య అవసరమవుతుందని ఆమె తెలిపారు. కూరగాయ పంటలకు పిచికారీ చేసేటప్పుడు 25 లీటర్ల నీటికి ఒక లీటరు దశగవ్య కలపాలని తెలిపారు. దశగవ్య పిచికారీ చేసిన పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని, మంచి దిగుబడినిస్తాయని ఆమె అన్నారు. ఆవుపేడ, మూత్రం పుష్కలంగా ఉంది కాబట్టి ఘనజీవామృతం తయారు చేసుకొని నెలకోసారి ఎకరానికి 5–6 క్వింటాళ్లు చల్లుతున్నామన్నారు. నీటిని అందించేటప్పుడు జీవామృతం కలిపి పారిస్తున్నామన్నారు. అగ్రి అస్త్రం, బ్రహ్మాస్త్రం కూడా అవసరాన్ని బట్టి వాడుతున్నామని, మొత్తంగా తమ పంటలు ఆశ్చర్యకరంగా దిగుబడులు వస్తున్నాయన్నారు. జంజుబ గడ్డి.. 18 రోజులకో కోత లావణ్యారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం 9 ఎకరాల్లో సంప్రదాయ రకం జంజుబ గడ్డితోపాటు పారాగడ్డి, సూపర్ నేపియర్, తీపిజొన్న రకాలను సాగు చేస్తున్నారు. అరెకరంలో కూరగాయలు, ఎకరంలో పసుపు, ఎకరంలో చెరకు, రెండెకరాల్లో సుగంధ దేశీరకం వరిని సాగు చేస్తున్నారు. జుంజుబ రకం గడ్డిని ఆవులు ఇష్టంగా తింటాయన్నారు. ఇది 18 రోజులకోసారి కోతకు వస్తుందన్నారు. కోత కోసిన తర్వాత నీటితోపాటు జీవామృతం పారిస్తామని, 5–6 రోజుల తర్వాత దశగవ్య పిచికారీ చేస్తామన్నారు. మోకాళ్ల ఎత్తుకు ఎదిగిన తర్వాత కోసి ఆవులకు వేస్తామన్నారు. –ఆకుల రాంబాబు, సాక్షి, జోగిపేట, సంగారెడ్డి జిల్లా సేంద్రియ సాగు వ్యాప్తే లక్ష్యం దేశీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి మూలాధారం. గో ఉత్పత్తుల ద్వారా వ్యవసాయంలో రసాయనాలకు పూర్తిగా స్వస్తి చెప్పటం సాధ్యమేనని రైతులకు తెలియజెప్పడం కోసం మోడల్ ఫామ్‌ను ఏర్పాటు చేశాను. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తికి దోహదపడే దశగవ్య, ఘనజీవామృతాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాను. సేంద్రియ సేద్యాన్ని వ్యాప్తిలోకి తేవాలన్నదే లక్ష్యం. – డా. ఉడుముల లావణ్యారెడ్డి (92468 45501), అందోలు, సంగారెడ్డి జిల్లా దేశీ రకం వరి, వంగ మొక్కలు, చెరకు తోట, కొర్ర పంట ప్లాస్టిక్ బ్యారెల్‌లో దశగవ్యను కలియదిప్పుతున్న కార్మికులు ఆవుల కోసం దాణా జుంజుబ గడ్డి -
‘పుంగనూరు’ మురి‘పాలు’!
- ప్రాణానికి ప్రాణంగా పుంగనూరు ఆవులను సాకుతున్న గో సంరక్షకుడు - 8 ఏళ్లుగా పుంగనూరు గోవులతో పెనవేసుకున్న జీవనశైలి - హైదరాబాద్ నగరంలో ఇంటివద్దనే సంరక్షిస్తున్న విజయ డెయిరీ ఉన్నతాధికారి - పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డుకు ఎంపికైన కుడాల రామదాసు పరిరక్షించుకోకపోతే ఎంతటి అపురూపమైన పశు జాతైనా కాలగర్భంలో కలిసిపోతుంది. అత్యంత పొట్టిగా ఉండి, తక్కువ మేత – నీటితో, ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించడం, ఔషధ విలువలున్న చిక్కటి పాలను అందించే అరుదైన గోజాతి ‘పుంగనూరు’. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో తరతరాలుగా విరాజిల్లుతున్న ఈ పశుజాతి సంతతి కొన్ని వందలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పూర్వరంగంలో హైదరాబాద్ వంటి మహానగరంలో పుంగనూరు ఆవుల సంరక్షణే ప్రాణప్రదంగా భావిస్తున్నమనసున్న మనిషి రామదాసు. తాను రైతు కాకున్నా.. ప్రభుత్వాలు మిన్నకున్నా పుంగనూరు గో జాతి ఉద్ధరణకు నడుం బిగించారు. ఆయన ఇంటి ప్రాంగణంలో మువ్వలు తొడిగిన కాⶠ్లతో పరుగెత్తే ఆవు దూడలు.. ఘల్లు ఘల్లుమని సవ్వడులు చేస్తూ.. మంగళవాద్యాలు మోగించిన అనుభూతినిస్తాయి. పుంగనూరు గోజాతికి పునర్జన్మనిస్తున్న రామదాసుకు జాతీయ స్థాయి బ్రీడ్ సేవియర్ అవార్డు దక్కడం విశేషం. మే 21–22 తేదీల్లో హర్యానాలోని కర్నాల్‌లో ఈ జాతీయ అవార్డును ఆయన అందుకోనున్నారు.. ఈ సందర్భంగా ‘సాగుబడి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం. ఆనాడు భద్రాద్రి రాముడికి గుడికట్టి గుండెల్లో దాచుకున్న గోపన్న రామదాసుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన పేరు పెట్టుకున్న ఈ రామదాసు అంతరించిపోయే దశలో ఉన్న పుంగనూరు గోవులకు తన ఇంటిలోనే గుడికట్టి కాచుకుంటూ గోదాసుగా నిలిచిపోతున్నారు కుడాల రామదాసు. డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణవీధి ఆయన స్వగ్రామం. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్ పద్మావతి కాలనీలో నివసిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆం. ప్ర. డైరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ, కుటుంబ విధులను చక్కబెట్టుకుంటూనే గోవుల సంరక్షణకు సమయం కేటాయిస్తున్నారు. 2009లో చిత్తూరు జిల్లా పలమనేరులోని పశు పరిశోధనా స్థానం నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పుంగనూరు ఆవుల సంఖ్య 8కి, గిత్తల సంఖ్య 7కు పెరిగింది. ఆవులకు శాంభవి, హరిప్రియ, జ్ఞాన ప్రసూనాంబ, బృంద, మహాలక్ష్మి అని.. గిత్తలకు దీపక్, మహాకాళ్, శ్రీపాద్, నారాయణ, సుబ్రహ్మణ్యం అని పేర్లు పెట్టుకున్నారాయన. రామదాసు పేరుతో పిలిస్తే చాలు.. ఆ పేరు గల ఆవు లేదా ఎద్దుlమేతను సైతం వదలి పిలుపు వచ్చిన దిశగా తలెత్తి, చెవులు రిక్కిస్తుంది. ఆయన కనిపించగానే చుట్టూ చేరి ఆపాద మస్తకం నాలుకతో స్పర్శిస్తూ గారాలు పోతాయి. ఆయన వెన్ను నిమురుతుంటే చిన్నపిల్లల్లా మారాం చేస్తాయి. చిన్న దూడలు ఆయన కౌగిట్లో దూరి కేరింతలు కొడతాయి. ఇంక ఆయన సెలవు రోజైన ఆదివారం అయితే వాటికి పండగ రోజు. ఆరోజు రామదాసు వాటì కి శుభ్రంగా స్నానం చేపిస్తారు. వాటిని కాన్వెంటుకు వెళ్లే పిల్లల్లా ముస్తాబు చేసి మురిసిపోతారు. గోస్నానానికి వేసవిలో చన్నీళ్లను చలికాలంలో వేన్నీళ్లను వాడతారు. దీనికోసం ఇంటిపైన నీటిని వేడిచేసే సౌరశక్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటికి ఆనుకునే ఉన్న ఖాళీస్థలంలో పగలు ఆవులను ఉంచుతారు. రక్షణ కోసం ఇనుప మెష్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే మేతను అందిస్తారు. రాత్రిళ్లు మాత్రం వారి ఇంటి వర ండానే ఆవులకు శయనాగారం. అవి విశ్రమించేటప్పుడు మెత్తగా ఉండేందుకు రబ్బరు షీట్లు ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు నిద్రాభంగం కలగకుండా నివారించేందుకు దోమతెరలు ఏర్పాటు చేశారు. వేసవి తాపం నుంచి కాపాడేందుకు ఫ్యాన్లు, కూలర్లు, వట్టివేళ్ల చాపలు ఏర్పాటు చేశారు. స్థానిక పశువైద్యులు వారం వారం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పుంగనూరు ఆవుల మధ్య ఇన్ బ్రీడింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే.. తమకు జన్మనిచ్చిన ఆవుతో కోడె గిత్తల సంపర్కాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటారు. దూడలు పుట్టిన తేదీలు, బరువు, సమయం, తల్లి ఆవు, ఆబోతుకు సంబంధించిన అన్ని వివరాలూ (పిడిగ్రీ) నమోదు చేస్తారు. జీవితం గో సేవకే అంకితం ఉదయం ఆరు గంటలకు మేత అందిస్తారు. రోజూ 20 కిలోల దాణా పెడతారు. ఉలవలు, కందులు, పెసర, మినుములు, మొక్కజొన్న, కొబ్బరి పిండిని దాణాగా పెడతారు. జొన్న చొప్ప, వరిగడ్డిని మేతగా ఇస్తారు. ప్రతి రోజూ సాయంత్రం ఆవులను షికారుకు తోలుకెళతారు. పశువుల సంఖ్య పెరగటంతో ఒక్కడి వల్ల కాక ఇటీవలె ఒక పనివాడిని నియమించుకున్నారు. అతను రాకుంటే రామదాసే స్వయంగా రంగంలోకి దిగుతారు. సూర్యోదయానికి ముందే పాకను శుభ్రం చేసి కసువు ఎత్తిపోస్తారు. పాలు పితుకుతారు. మేతవేస్తారు. తాను సంతృప్తి చెందాక ఉద్యోగానికి బయలుదేరతారు. మళ్లీ సాయంత్రం యథాప్రకారం సేవ చేసుకుంటారు. ఆవున్న చోటే అన్నముంది..అందుకే మొదటి ముద్ద ఆవుకే చెందాలంటారాయన. వీటిని వదలి వెళ్లినా మనసంతా వీటిపైనే ఉంటున్నందున ప్రయాణాలను తగ్గించుకున్నారు. వీటిని సాకేందుకు అయ్యే ఖర్చు నెలకు రూ. 60 వేలను రామదాసు తన జీతం డబ్బులోంచే ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే దేశవాళీ గో జాతిని పరిరక్షించాలనే నా ప్రయత్నంలో నాకు ఆత్మసంతృప్తి లభిస్తోంది. ఒక మంచి పనిని చేస్తున్నాననే భావన నాకు కొత్త శక్తిని ఇస్తోంది అంటారాయన. పుంగనూరు ఆవుపాలలో ఔషధీయ గుణాలు ఉండటం వల్ల తల్లిపాలు లేని పిల్లలకు పుంగనూరు ఆవుల పాలను ఉచితంగా ఇస్తున్నారు రామదాసు. ఆవుపేడతో నడిచే బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనితోనే వంట అవసరాలు పూర్తిగా తీరుతున్నాయి. అంతరించిపోతున్న పుంగనూరు గోజాతి పరిరక్షణకు పాటుపడుతున్న రామదాసుకు జేజేలు! – దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ ఫొటోలు : వర్థెల్లి రవీంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు ప్రతి ఇంట్లోనూ పుంగనూరు ఆవుండాలి! గ్రామాల్లో రైతులే కాదు, నగరాలు, పట్టణవాసులు కూడా కొంచెం ఖాళీ ఉన్న ప్రతి ఇంటి ఆవరణలోనూ పుంగనూరు ఆవును పెంచుకోవాలి. దీనివల్ల పంటలకు, ఇంటిపంటలకు అవసరమైన ఎరువు లభిస్తుంది. కలుషితం కాని, ఔషధ విలువలున్న పాలు తాగొచ్చు. కారు ఇంటి బయట ఆవు లోపటా అనే సంస్కృతి రావాలి. ఆవున్న చోట ఆరోగ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గోమాతను చూడాలని చాలామంది మా ఇంటికి వస్తున్నారు. వీళ్లని చూసినప్పుడు వసుదైక కుటుంబమనే భావన నాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. గోశాలలకు ధన రూపంలో సహాయం చేయవద్దు. మేత కొని వేయండి. గోవులకు సేవ చేయండి. ప్రతి కుటుంబం ఒక ఆవునయినా రక్షిస్తే అది సమాజాన్ని రక్షిస్తుంది. – కుడాల రామదాసు స్వరూప్‌నగర్, ఉప్పల్, హైదరాబాద్ ramdas.kudala@gmail.com పుంగనూరు ఆవు పాలకు అధిక ధర ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం పుంగనూరు. పొట్టి జాతి ఆవులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఒంగోలు జాతి ఆవులకు మల్లే ‘పుంగనూరు’ కూడా దేశం గర్వించదగ్గ గోజాతి. ఇవి అంతరించి పోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపొట్టి జాతి ఆవులివి. 70–90 సెం.మీ ఎత్తు ఉంటాయి. 115–200 కిలోల బరువుంటాయి. లేత బూడిద, తెలుపు రంగులో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు ఉంటాయి. వీటి తోకలు నేలను తాకీ తాకనట్టు ఉంటాయి. కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి. అచ్చం ఎండు గడ్డితిని మనుగడ సా«గించగలవు. రోజుకు 3–8 లీటర్ల పాలు ఇస్తాయి. సాధారణంగా ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) 9 శాతం ఉంటుంది. దీనివల్ల పాలకు అధిక ధర లభిస్తుంది. ఆధ్యాత్మికంగానూ పుంగనూరు ఆవులకు విశేష ప్రాధాన్యం ఉంది. పుంగనూరు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. మోపురం ఉన్న దేశీ ఆవులేవైనా విశ్వశక్తిని (కాస్మిక్ ఎనర్జీని) గ్రహించి చుట్టూ ఉన్న వాతావరణంలోకి విడుదల చేస్తాయని నమ్ముతారు. దీనివల్ల పుంగనూరు ఆవు ఉన్న పరసరాల్లో దైవిక వాతావరణం నెలకొంటుందని రామదాసు విశ్వసిస్తారు.