
సాక్షి, అమరావతి: అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా పలమనేరులోని పుంగనూరు పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022 లభించింది. జాతీయ స్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు.
ఏపీకి ప్రత్యేకం
ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు జాతి పశువులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం. కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే పెరిగే ఈ జాతి పశువులు రెడ్, బ్రౌన్, బ్లాక్, తెల్లటి రంగుల్లో తోక నేల భాగాన్ని తాకే విధంగా ఉంటాయి. ఏడాదికి సగటున 5 నుంచి 8 శాతం కొవ్వుతో 500 కేజీల వరకు పాల దిగుబడి ఇస్తాయి. ‘మిషన్ పుంగనూర్’ కింద ఈ జాతి పశువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో కార్యాచరణ రూపొందించింది.
ప్రభుత్వ కృషి ఫలితంగా గడచిన మూడేళ్లలో 176 పుంగనూరు దూడలు జన్మించాయి. ప్రస్తుతం రీసెర్చ్ స్టేషన్‌లో 268 పుంగనూరు జాతి పశువులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈ ఏడాది నాలుగు కేటగిరీలలో బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డులను ఐసీఎఆర్ ప్రకటించగా, కేటిల్ కేటగిరీలో పుంగనూరు జాతికి ఈ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుతో పుంగనూరు జాతి పరిరక్షణకు ఐసీఏఆర్ కూడా అవసరమైన చేయూత ఇచ్చేందుకు మార్గం సుగమమైందని రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వేణు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment