పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్‌లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు.
ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది.
– పలమనేరు
పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ
పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది.
అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్‌కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్‌ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది.
అధిక వెన్న, పోషక విలువలు
పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment