![Kunki Elephant Camp work start in Palamaneru](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/elephent.jpg.webp?itok=0cJ-Qxq7)
పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపు పనులు ప్రారంభం
ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచ్‌లు, సోలార్ ఫెన్సింగ్ వృథానే
ఫలితమివ్వని ననియాల ఎలిఫెంట్ క్యాంప్
కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి
మూడు దశాబ్దాలుగా కౌండిన్యలో తీరని ఏనుగుల సమస్య
ఇప్పటికే 16 ఏనుగులు మృతి, ఏనుగుల దాడుల్లో 14 మంది మృతి
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/elephent1222.jpg)
కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ
పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్‌నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి.
ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/elephent1.jpg)
కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.
మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.
గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు....
పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.
వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు.
అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే...
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
క్యాంప్ పనులు సాగుతున్నాయి
పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరు
కుంకీలతోనైనా సమస్య తీరితే చాలు..
గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది.
– ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment