![West Benga Wild Elephant Attacks JCB Machine After Being Provoked viral video](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/elephant_jcbattack.jpg.webp?itok=QRUt896v)
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది.
పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్‌టవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్‌కవేటర్ బకెట్‌ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today.
In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025
వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!
మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్‌తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్‌తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.
బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు.
అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్‌లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్‌లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment