
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!
అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.
రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్‌లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది.
ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట.
Comments
Please login to add a commentAdd a comment