
అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న భార్య కోసం టాయిలెట్ బెడ్‌ను కనిపెట్టిన శరవణముత్తు జాతీయస్థాయి బహుమతి అందుకున్నారు. ‘అవసరం.. కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది’ అనడానికి ఆయన ఒక నిదర్శనం.
తమిళనాడులోని తలవైపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి శరవణముత్తు. ఆయన భార్య కృష్ణమ్మాళ్ 2014లో అనారోగ్యంతో మంచం పట్టింది. సర్జరీ అయ్యాక, మూడు నెలల పాటు మంచం దిగలేకపోయింది. నలభై ఏళ్ల వయసులోనే కాలకృత్యాలు కూడా కష్టమైపోయాయి. భార్య లేవలేని స్థితిలో ఉండడంతో ఆమె కోసం ముత్తు.. ‘టాయిలెట్ పాట్’ అటాచ్‌డ్‌గా ఉండే ఒక మంచాన్ని రూపొందించాడు. ఈ సదుపాయం వల్ల కృష్ణమ్మాళ్‌కు మంచం దిగే అవసరమే లేకపోయింది. ‘‘నా భార్యకు ఎవరి మీదా ఆధారపడటం ఇష్టం ఉండదు. తను ఎంత అనారోగ్యంతో ఉన్నా తన పనులు తనే చేసుకునేది. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. అందుకే ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు టాయ్‌లెట్ పాట్ తయారు చేశాను’’ అంటారు శరవణముత్తు. వృత్తిరీత్యా ఆయన వెల్డర్. అందువల్ల ఇటువంటి మంచం తయారుచేయడం అతనికి పెద్ద కష్టం కాలేదు. కొత్తగా ఆలోచించాడు. ఆలోచన ఫలించింది.
పాట్‌కు రిమోట్
పన్నెండు వోల్టుల బ్యాటరీని ఆమర్చి, రెండు గేర్ల మోటారును జత చేసి, టాయిలెట్ పాట్‌ను మంచం పక్కన నిలువుగా అమర్చాడు ముత్తు. దానికి రిమోట్ కంట్రోల్ ఫ్లషింగ్ కూడా ఉంది. అందువల్ల ఆ కుండను వాడగానే శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ఫ్లష్ ట్యాంకును అమర్చి, దానిని ఒక వైపు సెప్టిక్ ట్యాంకుకు జత చేశాడు. దాంతో మంచం మీద ఉన్న రోగి, రిమోట్ కంట్రోల్‌తో పాట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం సాధ్యం అయ్యింది. రిమోట్ బటన్ ద్వారా మూత తెరుచుకోవడం, మూసేయడం, ఫ్లష్ చేయడం అన్ని పనులూ సులువుగా అయిపోతాయి. శరవణముత్తు చేసిన ఈ ఆవిష్కరణ గురించి ఒక స్థానిక పత్రికలో వార్త రావడంతో, ముత్తుకు మొదటి ఆర్డరు 2015 ఆరంభంలో వచ్చింది. చెన్నైలో నివసించే ఒక వ్యక్తి, తన తల్లి ఆరు సంవత్సరాలుగా మంచం మీదే ఉండటంతో, ఈ వార్తకు వెంటనే స్పందించాడు.
ముత్తు చేత అలాంటి బెడ్‌నే తయారు చేయించుకున్నాడు. ఆ నోటా ఆ నోటా ఈ వార్త అందరికీ చేరటం మొదలైంది. దానితో శరవణముత్తుకి వచ్చే ఆర్డర్‌ల సంఖ్య పెరిగింది. అయితే తన నిరక్షరాస్యతతో, రోజు కూలీ కావడం, తన మీద తనకు నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో శరవణముత్తు ఈ రకమైన బెడ్స్ పూర్తిస్థాయిలో తయారు చేయలేకపోయాడు. దానికితోడు అతడి దగ్గర పెట్టుబడికి అవసరమైన డబ్బు కూడా లేకపోయింది. ‘‘ఈ మంచాలకు చాలా డిమాండు ఉంటుందని నేను చెప్పినప్పుడు, నా మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కొందరు నన్ను ఎగతాళి చేశారు. మా కుటుంబ సభ్యులు మాత్రం ప్రోత్సహించారు’’ అంటాడు శరవణముత్తు. ఆ ఉత్సాహంతోనే చెన్నై వాసి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుని, మొదటి మంచం తయారుచేసి పంపించాడు.
కొన్ని నెలల తర్వాత
శరవణముత్తుకి అదే ఏడాది భారత మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలామ్‌ను కలిసే అవకాశం కలిగింది. ‘నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్’కి దరఖాస్తు చేసుకోమని సూచించారు కలామ్. శరవణముత్తు దరఖాస్తు చేసుకున్నాడు. కలామ్ మాటలు వృథా పోలేదు. తన ఆవిష్కరణకు బహుమతిగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికేట్, రెండు లక్షల నగదును అందుకున్నాడు. ఈ బహుమతితో శరవణముత్తు జీవితం మారిపోయింది. నలుగురిలో గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు ఎగతాళి చేసినవారంతా గౌరవించడం మొదలుపెట్టారు. రాష్ట్రపతి చేతి మీదుగా బహుమతి అందుకున్న తరవాత ఆర్డర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఒక్క చెన్నైలోనే 350 ఆర్డర్లు వచ్చాయి. ‘‘నేను ఈ రోజుకీ ఒక కూలీనే. ఒకేసారి ఎక్కువ డబ్బు రావాలంటే రాదు. అయితే నాకు ఆర్థిక సహాయం అందితే మరింత బాగా చేయగలను’’ అంటున్న శరవణముత్తుకి రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఫ్యూయల్ ఫ్రీ కారుని కనిపెట్టడం, తన పిల్లలకు ఒక రోల్‌మోడల్‌గా నిలబడటం.
– జయంతి