
నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది.
తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.
చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..
‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.
అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.