
సోలార్ బోట్ కోసం అన్నీ అమ్మేసుకున్నారు
అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడినవాళ్లను చూశాం. దేశానికి సేవ చేయాలన్న కతృనిశ్చయంతో ఐఏఎస్,ఐపీఎస్ ర్యాంకులను సాధించిన వారినీని చూశాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేం దుకు ఉద్యోగాలనూ, ఇంటినీ..అంతెందుకు సర్వస్వాన్ని వదిలేసిన ఫ్యామిలీ గురించి విన్నారా? రండి ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం!
రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్, కుమార్తె కైయా రివా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి, పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్‌లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజనులను ఆశ్చర్యపరిచింది.
ఈ ఆలోచన ఎలా వచ్చింది?
భారత నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌరవ్‌కి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు, వైదేహి చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కొచ్చి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితుడైనప్పుడు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య ,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న , ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత, ఈ జంట చూడాల్సినవి, ఆస్వాదించ వలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి.
అంతే ఇక ఆలస్యం చేయదల్చుకోవలేదు వీరు. 2022లో గౌతమ్ నావీ వీఆర్‌ఎస్ తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరూ వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6వేల కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వృధా అనుకున్నారు. రెండు క్యాబిన్లు, వంటగది, తొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్ , ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.

పడవపై ఎలా బతుకుతున్నారు?
సంవత్సరంలో దాదాపు 70 శాతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసి గడుపుతారు. మిగతా అన్నిసమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి, వంతులవారీగా బోటు నడపటం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటారు. అప్పుడప్పు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు.

ఎక్కడికైనా వెళ్లి సముద్ర మీదే. అయితే వాతావరణం, నావిగేషన్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్‌లు, వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో రాటు దేలారు. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల(1988లో దీన్ని తయారు చేశారు) పడవ నిర్వహణ ఖర్చులు, చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760-వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేయబడిన 800-AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది . దీనికి విండ్ జనరేటర్ కూడా అమర్చుకున్నారు.

మలేషియాలోని పెనాంగ్‌లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావీ (మలేషియా), థాయిలాండ్‌కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్ , డైవింగ్ చేస్తూ,కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్‌లో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది.
వీలైనన్ని ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక.తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్‌లను కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి, తరువాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారుట .“పడవలో జీవించడం సాధ్యమేనా?” అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్‌స్టా పేజ్‌లోని వీడియోలను చూస్తూ ఉంటే.. సమయమే తెలియదు. (వీలైతే ఒకసారి చూడండి)
ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంకెళ్లేవీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తాయి. ఒక విశాలమైన అవగాహనను కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment