వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్‌ రికార్డ్‌! | Werewolf Syndrome Indian Boy Gets Guinness Title For Hairiest Face | Sakshi
Sakshi News home page

వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్‌ రికార్డ్‌!

Published Fri, Mar 7 2025 1:22 PM | Last Updated on Fri, Mar 7 2025 6:23 PM

Werewolf Syndrome Indian Boy Gets Guinness Title For Hairiest Face

లావుగా ఉన్నవాళ్లు సన్నగా రివటలా మారాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాగే సన్నగా  ఉన్నవాళ్లు కాస్తంత బొద్దుగా ఉంటే బావుండు అని నిట్టూరుస్తూ ఉంటారు.  ఇక రింగు, రింగులు జుట్టు  ఉన్నవాళ్లలో కొంతమంది స్మూత్‌ అండ్‌ సిల్కీ  హెయిర్‌ చూసి మురిసిపోతుంటారు. నాకూ అలా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే కానీ అసహజమైన,  వింత సిండ్రోమ్‌తో బాధపడుతున్న   భారతీయ బాలుడు  తన పరిస్థితి గురించి బాధపడ లేదు..ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు? అతనికున్న సిండ్రోమ్‌  ఏంటి? తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు. అవమానపడేవాడు. కానీ దైర్యం కోల్పోకుండా  ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇపుడు అతని జుట్టే అతడికి రికార్డు తెచ్చి పెట్టింది. చదరపు సెంటీమీటర్‌కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్‌ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95 శాతానికి పైగా వెంట్రులున్నాయి.మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటిదార్‌ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్   గుర్తించింది.

అయితే మొదట్లో తాను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ,  ఆ తరువాత అందరూ తనను అర్తం చేసుకున్నారని అన్నాడు.  ఇపుడు చాలా మంది దయతో ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే..దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటం నాకిష్టం...నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని’ చెప్పాడు."నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు" అంటూ ఆనందం  వ్యక్తం చేశాడు.

 

మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్  పుట్టినప్పటి నుండి అరుదైన ''వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్'తో బాధపడుతున్నాడు. 'వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్' లేదా హైపర్‌ట్రికోసిస్  తల నుండి కాలి వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది.  ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండటం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్‌ పాటిదార్‌ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ   బాయ్ అంటూ  మరికొంతమంది ఏడిపించేవారు. "కొరుకుతాడేమో" అని భయపడేవారు.  రాళ్ళు విసిరేవారు. 

మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. లలిత్‌  తండ్రి రైతు , అతని తల్లి గృహిణి. ప్రస్తుతం, ముఖం 95 శాతానికి పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్‌కు తల్లితండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు.  వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు.  దీన్ని హైపర్‌ట్రైకోసిస్ అంటారని,  ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు.

లలిత్‌కు ఇన్‌స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానెల్‌లో  ఫాలోయింగ్‌కు కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాలో 2 లక్షల 65 వేలు, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోయర్లున్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్‌ టెలివిజన్ షో లో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు,  ప్రోత్సాహతో  ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు.  విభిన్న సంస్కృతులను అన్వేషించాలనే  కల సాకారం దిశగా సాగుతున్నాడు లలిత్‌.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement