తోడేళ్లుగా మారిన వారి ముఖాలు
న్యూఢిల్లీ : స్పెయిన్‌లో ‘అలోపేసియా (జుట్టు సహా శరీరంపై ఎక్కడ వెంట్రుకలున్నా రాలిపోవడం)’ వ్యాధితో బాధ పడుతున్న కొంత మంది యువకులు అందుకు విరుగుడు మందులు వాడడంతో అనూహ్యంగా వారి ముఖాలే మారిపోయాయి. ఒక జుట్టుపైనే కాకుండా ముఖం నిండా వెంట్రుకలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వారి ముఖాలు తోడేలు ముఖాల్లా తయారయ్యాయి. అందుకే దీన్ని ‘వర్‌ఫూల్ఫ్ సిండ్రోమ్’ అని పిలుస్తారని, వైద్య పరిభాషలో ‘హైపర్ట్రికోసిస్’గా వ్యవహరిస్తారని స్పెయిన్ వైద్యాధికారులు తెలిపారు.
మందు కల్తీ అవడం వల్ల ఇలా జరిగిందని, ఈ మందును తయారు చేసిన ‘ఫార్మా క్విమికా’ లైసెన్స్‌ను రద్దు చేశామని, ఆ బ్యాచ్ సరకును మొత్తం మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నామని వైద్యాధికారులు చెప్పారు. 16 మంది యువకులు ఈ వ్యాధి బారిన పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ముఖాన భారీగా వెంట్రుకలు వస్తుండడంతో వారు మందులు మానేశారని, అప్పటి నుంచి వెంట్రుకలు అవాంఛిత చోట రావడం ఆగిపోయిందని వైద్యాధికారులు వివరించారు. ఫార్మా క్విమికా కంపెనీ భారత్‌కు కూడా ఔషధాలను విక్రయిస్తుందని అక్కడి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
అయితే ఈ విషయం భారతీయ వైద్యాధికారుల దృష్టికి వచ్చిందా లేదా? అన్నది స్పష్టం కావడం లేదని అక్కడి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అలోపేసియా అంటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ అవసరమైన దానికంటే ఎక్కువగా వెంట్రుకలు పెరగడం. దీనికి ఒక మందు అంటూ లేదు. వెంట్రుకలు ఏ ప్రాంతంలో పెరుగుతున్నాయి? అవి ఏ స్థాయిలో పెరుగుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఉంటుందట. ఇది ఎక్కువ మందికి పుట్టుకతో రాగా, కొందరిలో యుక్త వయస్సులో వస్తుందట. పురుషుల్లో మేల్ హార్మోన్సు అధికంగా ఉండడం వల్ల ఇలా అవాంఛిత వెంట్రుకలు వస్తాయట.