
ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్నవూలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకుని లబ్ది పొందాలని చూసింది మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే..
దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతోపాటు, సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం,ఇతర బహుమతులను కూడా ప్రకటించింది.
అర్హులైన లబ్ధిదారులతో హసన్‌పూర్‌లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతోంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఊహంచని పరిణామం ఎదురైంది.
ఈ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 35 కొట్టేయాలని చూసిన అస్మా , ఆమె సమీప బంధువు బావ జాబర్ అహ్మద్‌తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు, వరుడి కోసం రెండు జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకుని, బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటివారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బులు ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసి కొట్టింది.
అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం మూడేళ్ల క్రితమే నూర్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యా ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మ గారి ఇంట్లోనే ఉంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటివాళ్లు అప్రమత్తమయ్యారు.
ముఖ్యంగా ఆస్మా మామగారు ఆస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నవించాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. చివరికి ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమం, మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డు కున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment