![Smart meters shock electricity consumers in Chittoor](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/222.jpg.webp?itok=ZdTptaZO)
చిత్తూరులో ఓ వ్యాపారికి రూ.25,748 కరెంటు బిల్లు
చిత్తూరు కార్పొరేషన్/రొంపిచెర్ల: విద్యుత్ స్మార్ట్ మీటర్లతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ.వేలల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో షాక్‌కు గురవుతున్నారు. చిత్తూరులో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ డిసెంబర్‌లో ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ తయారీ పరిశ్రమ సప్తగిరి ఎయిర్ ప్రొడక్ట్స్‌లో స్మార్ట్ మీటర్ ఏర్పాటుచేశారు.
ఈ సంస్థకు డిసెంబర్‌లో బిల్లు రూ.3,142 రాగా, ఫిబ్రవరిలో అంతకు 8 రెట్లు అధికంగా రూ.25,748 బిల్లు వచ్చిందని యజమాని ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రోజూ మూడు గంటలు మాత్రమే మోటారు వాడుతామని, గతంలో నెలకు 400–500 యూనిట్లు మాత్రమే వినియోగించామని రూ.3వేల నుంచి రూ.5 వేల మధ్యలో బిల్లులు వచ్చేవని తెలిపారు.
కానీ, స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత జనవరి నెలలో 1,570 యూనిట్లు వినియోగించారని రూ.12,444 బిల్లు వచ్చిందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదన్నారు. ఫిబ్రవరిలో 3,461 యూనిట్లు వాడారంటూ రూ.25,748 బిల్లు, బకాయిలతో కలిపి మొత్తం రూ.38,192 వచ్చిందన్నారు. దీనిపై విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే కండక్టర్ల సమస్య పేరు చెప్పి బిల్లు కట్టాలని బుకాయిస్తున్నారని, లేని పక్షంలో సరఫరా ఆపివేస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
15 యూనిట్లకు రూ.387 బిల్లు
15 యూనిట్లు మాత్రమే వినియోగించిన ఓ ఇంటికి రూ.387 బిల్లు వచ్చింది. చిత్తూరు జిల్లా బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఫజులుపేటలో కె.సుహాసిని ఇంట్లో (సర్వీస్ నంబర్ 5831200004266) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 2 వరకు 15 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. దానికి రూ.387 బిల్లు వచ్చింది.
వాస్తవానికి 15 యూనిట్లకు రూ.28.50 బిల్లు కాగా, సర్దుబాటు చార్జీల పేరిట వారికి 2022 జూన్‌కు రూ.153, 2023 మే నెలకు రూ.77.50, 2025 జనవరికి రూ.7.60 చొప్పున రూ.266.6, ఫిక్సిడ్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్‌చార్జీలు తదితర పేర్లతో మరో రూ.120 కలిపారు. ఇదేమిటని ట్రాన్స్‌కో అధికారులను అడిగితే ప్రభుత్వం గతంలో వాడిన విద్యుత్‌కు అదనంగా డబ్బు వసూలు చేస్తోందని తామేమీ చేయలేమని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment