![Kaadhal Enbadhu Podhu Udamai Tamil Movie Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/tamil.jpg.webp?itok=7gIqdFsv)
చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారతాయి. అయితే సమాజంలో జరుగుతున్న ఘటనలనే తాము చిత్రాల్లో చూపిస్తున్నామన్నది దర్శక నిర్మాతల వాదనగా ఉంటుంది. కాగా లెస్బియన్ల ఇతి వృత్తంతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. వాటి తరహాలో తాజాగా కోలీవుడ్‌లో రూపొందిన చిత్రం కాదల్ ఎన్నబదు పొదువుడమై. గతంలో లెన్స్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రానికి జయప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రమే కాదల్ ఎన్నబదు పొదువుడమై..
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_170.jpg)
గ్లోవింగ్ టంగ్ట్‌న్, మ్యాన్‌కైండ్ సినిమాస్, నిత్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జై భీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ లెస్బియన్‌గా నటిస్తున్నారు. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు వినీత్ రోహిణి కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రేమికుల రోజు సందర్బంగా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయప్రకాశ్ మాట్లాడుతూ.. 'లెన్స్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత మస్కిటో ఫిలాస్పి అనే చిత్రాన్ని చిన్న బడ్జెట్‌లో తెరకెక్కించాను. దాని ఎడిటింగ్ కోసం బెంగుళూర్ వెళ్లినప్పుడు అక్కడ ఓ మిత్రుడితో చర్చించినప్పుడు ఈ కథకు లైన్ దొరికింది.
దీంతో కథను తయారు చేసి నిర్మాతల కోసం ప్రయత్నించినప్పుడు పలువురు ఈ కథతో చిత్రాన్ని చేయడానికి వెనుకడుగు వేశారు. కారణం ఇది లెస్బియన్ ఇతి వృత్తంతో కూడిన కథ కావడమే. అదే విధంగా మరి కొందరైతే దీన్ని మలయాళం, హిందీ భాషల్లో చేయమని, తమిళంలో వద్దని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత జియోబేబీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈయన ఇంతకు ముందు ది గ్రేట్ ఇండియన్ కిచ్చన్ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించారు.' అని తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_452.jpg)
ఇద్దరు యువతుల మధ్య ప్రేమను ఆవిష్కరించిన కథా చిత్రం కాదల్ ఎన్నబదు పొదువుడమై అని దర్శకుడు జయప్రకాశ్ చెప్పారు. చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విడుదల కోసం చాలా ప్రయత్నాలు చేసినట్లు, అలాంటి పరిస్థితిలో ధనుంజయన్ తమకు దేవుడిగా ముందుకొచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న ధనుంజయన్ మాట్లాడుతూ తానీ చిత్రాన్ని ఇంతకు ముందే చూసి విడుదల చేయడానికి సంప్రదించానని, అయితే అప్పుడు నిర్మాతల ఓటీటీ సంస్థతో మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. అలాంటిది మళ్లీ ఈ చిత్రం తన వద్దకే రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment