బైరెడ్డిపల్లి/పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా జత పొటేళ్లు రూ.40 వేల దాకా ఉంటాయి. కానీ బక్రీద్ పండుగ కోసం ప్రత్యేకంగా సంరక్షించిన కొమ్ములు తిరిగిన పొట్టేళ్ల ధరలు లక్షలు పలుకుతున్నాయి. రాష్ట్రంలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెలకు ప్రాచుర్యం పొందిన వారపు సంతల్లో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ముఖ్యమైంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి కూడా వస్తుంటారు.
బక్రీద్‌ను పురస్కరించుకుని బైరెడ్డిపల్లెలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వ చ్చినట్టు తెలిసింది. జత పొట్టేళ్లు రూ.30 వేల నుంచి రూ.2.70 లక్షల దాకా అమ్ముడయ్యాయి. మొత్తంమీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగినట్టు సమాచారం. గత శనివారం సైతం ఇదే స్థాయిలో రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
బైరెడ్డిపల్లె సంతకు బడా వ్యాపారులు బయటి రాష్ట్రాల నుంచి రావడంతో ఇక్కడి పొట్టేళ్లుఅత్యధిక ధరలు పలుకుతున్నాయి. అంతేకాదు, ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగ సంత కావడంతో దళారుల హవా కొనసాగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే కీâలకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్‌లు దక్కుతాయి. మొత్తం మీద బక్రీద్ పండుగకు ముందే దళారులు జేబులు నింపుకొన్నారు.
మే నుంచి ఏడాది పాటు పొట్టేళ్ల పెంపకం
బక్రీద్ పండుగ కోసం పొట్టేళ్లను పెంచి అమ్ముకోవడం రైతులకు లాభసాటిగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం(అవిభక్త) జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతోంది.
కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. ప చ్చిగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాదిపాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ము లు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి.
జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు విక్రయించా..
బక్రీద్ కోసం పొట్టేళ్లను మేపడమే వృత్తిగా పెట్టుకున్నాం. ఏడాదంతా పొట్టేళ్లను మేపి.. బక్రీద్ పండక్కి ముందు సంతకు తోలుకెళతాం. వ్యాపారులు ఎక్కువగా వస్తారు కాబట్టి బాగా మేపిన పొట్టేళ్ల ధర ఎక్కువ పలుకుతుంది. ఈ దఫా జత పొట్టేళ్లను రూ.2.70 లక్షలకు అమ్మడం ఆనందంగా ఉంది.
– జగదీష్ , పొట్టేళ్ల పెంపకందారు, తాయిళూరు, కర్ణాటక
వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది..
నేను బైరెడ్డిపల్లి సంతలో 23 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. ఎందుకంటే ఈ ప్రాంతంలోని కొండ, గుట్టల్లో మేత మేస్తుంటాయి. దీంతో వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొట్టేళ్లు రుచీపచీ ఉండవు.
– అబ్దుల్‌బాషా, గుడియాత్తం, తమిళనాడు
Comments
Please login to add a commentAdd a comment