ఈమె పేరు ప్రభావతి. చిత్తూరు పక్కనున్న యాదమరి మండలం. పెద్ద పండుగను పెద్దగా జరుపుకునే సంపన్నురాలు కాదు. ఇంట్లో కాసిన నిమ్మకాయలు, ఇరవై కొబ్బరికాయలను సోమవారం చిత్తూరుకు తీసుకొచ్చింది. అమ్మిన డబ్బుతో పిల్లలకు పిండి వంటలు తీసుకెళదామనే ఆశతో గంపను కిందకు దించింది. ఒక్కసారిగా వచ్చిన కలెక్షన్‌బ్యాచ్ రూ.50 గేటు కట్టమన్నారు. 20 నిమ్మకాయలు అమ్మితే రూ.30, సాయంత్రం వరకు కొబ్బరికాయలు అమ్మితే రూ.200 వస్తుందని ఇప్పటికిప్పుడు రూ.50 తన వద్దలేవని చెప్పినా ఒప్పుకోలేదు. కంటతడిపెట్టుకున్న ప్రభావతి తన పక్కనున్న ఓ రైతు నుంచి రూ.50 అప్పుచేసి గేటు కట్టింది.
చిత్తూరు అర్బన్: దాదారిగికి పరాకాష్ట చూడాలంటే చిత్తూరు నగర నడిబొ డ్డున జరుగుతున్న మార్కెట్ గేటుకు రావాల్సిందే. తమిళంలో బూతు అర్థం ధ్వనించే పదంతో దూషిస్తూ.. మేం చెప్పిందే గేటు.. నోరుమూసుకుని కట్టు..’ అంటూ ఇక్కడి రోడ్లపై కొందరు రౌడీయిజం చెలాయిస్తున్నా రు. వీరి ఆగడాలను చూస్తున్నా ఏ ఒక్కరూ అడిగే ధైర్యం చేయరు. మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నా ఎలాంటి న్యాయం జరగదు. రౌడీయిజం చేస్తున్న వారివెనుక అధికారపార్టీకి చెందిన బలమైన నేతలున్నారు. వారు ఎంతబలమైన వా రంటే గేటు పేరిట జరగుతున్న దందా ను అడ్డుకోవాలని స్వయానా టీడీపీ కార్పొరేటర్లే కౌన్సిల్‌లో ప్రస్తావించినా అధికారపార్టీకి చెందిన మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నా ఏమీచేయలేని పరిస్థితి. దీనిపై సామాన్యులు, రైతులు నోరుతెరవకపోయినా నేతల తీరును అసహ్యించుకుంటున్నారు.
దొందూ దొందే..
ఈ నాలుగేళ్లలో చిత్తూరు కూరగాయల మార్కెట్‌కు సంబంధించి గేటు వసూలు చేసుకోవడంలో టీడీపీ నేతలు పోటీపడ్డారు. నాలుగేళ్ల క్రితం రూ.18 లక్షలు పలికిన మార్కెట్ గేటులో భారీగా లాభాలు రావడంతో టీడీపీ నేతలు పోటీపడ్డారు. క్రమంగా రూ.84 లక్షలు, రూ.40 లక్షలు, రూ.41 లక్షలు, ఇప్పుడు ఏకంగా రూ.90 లక్షలకు గేటు వసూళ్లుదక్కించుకున్నారు. వారు మంచోళ్లు.. వీళ్లు చెడ్డవారు అనే మాట లు మార్కెట్ గేటు వసూలులో ఏ ఒక్కరికీ వర్తించదు. ఇప్పటి వరకు గేటు దక్కించుకున్న వాళ్లంతా దొరికినకాడికి దోచుకున్నవాళ్లే. కాకపోతే కొందరు టీడీపీ నేతలకు వాటాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడున్న వాళ్లు వచ్చేదాంట్లో కొద్దిమొత్తాన్ని పార్టీ కోసం ఖర్చుపెడుతున్నారు. చిత్తూరుతో పాటు యాదమరి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, గుడిపాల, ఐరాల, తమిళనాడులోని పరదరామి, కాట్పాడి, వేలూరు నుంచి నగరానికి వచ్చి కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లు, జామ, సీతాఫలం తదితరాలు అమ్ముకుంటున్న వారి నుంచి నిత్యం గేటు పేరిట దోచుకుంటూనే ఉన్నారు.
‘అమ్మ’ ఆశీస్సులు..
ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్లు చెబుతున్న ఏకైక పేరు ‘అమ్మ’. గేటు కట్టలేదని దెబ్బలు తిన్న రైతు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే తీసుకోరు. మున్సిపల్ కౌన్సిల్‌లో సభ్యులు పట్టుబట్టినా మార్కెట్ టెండరు రద్దు చేయరు. సొంత పార్టీకి చెందిన వ్యాపారులు గేటు కట్టమంటే ఒప్పుకోరు. వీటన్నింటికీ చెబుతున్న కారణం ‘మేం అమ్మ మనుషులం’ అనే పదం. దీంతో మున్సిపల్ అధికారులు, పోలీసులు మరోమాట మాట్లాడలేకపోతున్నారు. టీడీపీ కార్యక్రమాలు జరిగితే ఫ్లెక్సీలు కట్టడం, ర్యాలీలు పెడితే వంద బైకులు పెట్టడం, శిలాఫలకాల్లో పైన ‘అమ్మ’పేరు లేకుంటే లొల్లిచేస్తుండటంతో అమ్మ కూడా వీరి ఆగడాలను చూíసీచూడనట్లు వెళుతున్నారు.
గెజిట్ రేట్లు చెల్లదంతే..
నిమ్మకాయలు, జామకాయలు, సీతాఫలం లాంటి వాటికి రూ.3 గేటు చెల్లించాలని గెజిట్ చెబుతున్నా దీన్ని పాటించడంలేదు. పానీపూరీ, పిల్లలు ఆడుకునే వస్తువులు, మొక్కజొన్న తదితర వాటికి అసలు గేటు వసూలే చేయకూడదు. అయినాసరే రాజపత్రం (గెజిట్)లో ముద్రించిన ఏ ఒక్క చట్టం తమకు వర్తించదన్నట్లు కాంట్రాక్టర్ వ్యవహారశైలి ఉండటం పలు ఆరోపణలకు ఆజ్యం పోసినట్లవుతోంది. కలెక్టర్ ప్రద్యుమ్న స్వయానా కల్పించుకుంటే తప్ప రైతుల కన్నీళ్లు ఆగే పరిస్థితి కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment