
విద్యార్థి బహు భాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తున్న పరిశీలకులు (ఫైల్)
బహుభాషలు నేర్చుకోవడంపై ఆసక్తి
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు.
ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత
అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్‌కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్‌వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు.
ప్రధానోపాధ్యాయుని సంకల్పం
ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్‌ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్‌ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు!
6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు.
నా విశ్వాసం పెరిగింది
ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది.
– బీ.రామాచారి, 8వ తరగతి
ఎన్ని భాషలైనా నేర్వవచ్చు
నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది
– తీగల వెంకటయ్య, హెచ్‌ఎం
5 భాషలు నేర్చుకొంటున్నా
కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను.
– కె.ధరణి, 9వ తరగతి
విస్తరిస్తే బాగుంటుంది
వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు.
– నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్
Comments
Please login to add a commentAdd a comment