
కనిపించని అనుబంధాలు, ఆత్మీయతలు
మచ్చుకైనా కనిపించని మానవత్వం
ఎవరి బతుకు వారిదేనన్న స్వార్థ మనస్తత్వాలు
ఒకప్పడు ఎటు చూసినా బంధాలు..అను బంధాలు..ఆత్మీయతలు.. అనురాగాలు.. విలసిల్లేవి.. ప్రపంచీకరణ పుణ్యమాని.. మనిషిలో స్వార్థం పెరిగి మాన సంబంధాలు కనుమరుగవుతున్నాయి. తన జీవితం తనదే, పొరుగువారితో పనేముందన్న రీతి లో మానవుడు సాగుతున్నాడు. యాంత్రిక జీవనం గడుపుతున్నాడు.. మచ్చుకైనా మానవత్వం కనిపించకపోవడంతో మామూలు మనిషి మాయమైపోయాడనక తప్పదు. నేటి మానవ సంబంధాలపై ప్రత్యేక కథనం.
పలమనేరు: మానవ సంబంధాలను మంటగలిపి కేవలం తమ స్వార్థం చూసుకుంటున్న మనుషులు సమాజంలో ఎక్కువైపోయారు. గమ్యం తెలియని జీవన పయనమెటో తెలియని గందరగోళం నెలకొంది. సమాజంలో మంట కలుస్తున్న మానవత్వాన్ని మేలు కొల్పాల్సిన అవరసం ఎంతైనా ఉంది. గత ఏడాదిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ ఉండి అనాథల్లా మారి కనీసం అంత్యక్రియలకు నోచుకోని పదిమందికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దహనసంస్కారాలు చేశారంటే సమాజంలో ఎలాంటి మావనీయ సంబంధాలున్నాయే అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు మానవ సంబంధాలెలా ఉన్నాయంటే?
పలమనేరు మండలంలోని మొరం పంచాయతీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబంతో బెంగళూరులో కాపురముంటున్నారు. అనారోగ్యంతో అతని తల్లి మృతి చెందింది. దీంతో ఆ ఇంటి యజమాని మానవత్వం లేకుండా తన ఇంట్లో శవాన్ని పెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో విధిలేక వారు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బయట చనిపోయినవారు గ్రామంలోకి రాకూదనే సంప్రదాయంతో శవాన్ని ఊరిబయటే పెట్టి ఆపై అంత్యక్రియలను నిర్వహించారు.
పలమనేరు సమీపంలోని సాయినగర్‌లో ఓ ఉద్యోగి సొంత ఇంటిని నిర్మించుకుని పదేళ్లుగా కాపురముంటున్నాడు. ఆయన ఇప్పటివరకు ఇరుగుపొరుగు వారితో మాట్లాడలేదు. ఎరింటికీ వెళ్లలేదు. ఆ వీధిలో ఎవరికైనా కష్టమొచ్చినా సాయం చేయలేదు. పొద్దున ఆఫీసుకెళ్లడం పొద్దుపోయాక ఇంటికి రావడం తప్ప అతనికి ఎవరితోనూ సంబంధం లేని జీవితం గడుపుతున్నారు.
మారిన బతుకులు
ఒకటో తరగతి నుంచి కార్పొరేట్ స్కూల్ ఆపై కాలేజీ, మళ్లీ కుటుంబానికి దూరంగా పిల్లల చదువులు. ఆపై ఉద్యోగం రాగానే వారి జీవితం వారిది. ఇక ఇళ్లల్లోని పెద్దలను పిల్లలే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో కుటుంబ విలువలు తెలియని పిల్లలు ఎవరికివారేఅన్న భావనతో తమ బతుకులకు అంకితమైపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గతంలో ఓ గ్రామంలో వంద కుటుంబాలుంటే కనీసం 20 కుటుంబాలన్నా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఊరికి రెండు, మూడు కుటుంబాలు సైతం కలిసి ఉండడం లేదు.
సచ్చినా బాధపడే వారెవరు?
సొంత కుటుంబసభ్యులు ఎవరైనా మృతి చెందితే కనీసం కొన్నేళ్లపాటు బాధపడే రోజులు గతంలో కనిపించేవి. కానీ ఇప్పుడు సొంత కుటుంబసభ్యులు చనిపోయినా కేవలం రెండు మూడు రోజులే బాధ, ఆపై అసలు పట్టించుకోరు.
మాయమవుతున్న మానవసంబంధాలు
ఎవరు ఏమైతే నాకేంటి నా కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం ఎక్కువైంది. ఆఖరికి తన సొంత అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నదమ్ములను సైతం పట్టించుకోవడం లేదు. గతంలో గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా శుభ, అశుభకార్యాలు జరిగితే పనులు చేసేందుకు ఇంటికోమనిషి వెళ్లేవారు. ఇప్పుడు పెళ్లికి సైతం రావడంలేదు. దీంతో శుభ, అశుభ కార్యక్రమాలకు ఈవెంట్ మేనేజర్లే దిక్కుగా మారారు.
నాటి పలకరింపులు కరువు
గతంలో ఇంటికి ఎవరైనా బంధువులొస్తే గంటల తరబడి పలకరింలుండేవి. ఆపై బంధువులకు విందుభోజనం చేసిపెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికోస్తే నిమిషం పలకరింపు, బిజీగా ఉన్నాం ఇంకోసారి వస్తాంలేనంటూ పదినిమిషాల్లో వెళ్లడం కనిపిస్తోంది. మన ఇంట్లోని వారు సైతం బంధువులతో మాట్లాడకుండా స్మార్ట్‌ఫోన్లకు అతక్కుపోయి ఉంటున్నారు . – లక్ష్మీపతినాయుడు, బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం
కష్టమొస్తే పలకరించేవాళ్లుండాలయ్యా!
గతంలో ఎవరికైనా కష్టం వస్తే ఇంటిపక్కనున్నవారో స్నేహితులో మంచి సలహా చెప్పి సమస్యకు పరిష్కారం చూపేవారు. ఇప్పుడు ఆత్మీయ పలకరింపులు లేవు. ఎవరు చూసినా వారి పనుల్లో బిజీబీజీ. రోడ్డుపై ప్రమాదం జరిగినా మనకెందుకులే, కేసవుతుందని వెళ్లిపోయే సమాజమిది. అమ్మా,నాన్న, బిడ్డలకంటే ఎక్కువగా సోషల్‌మీడియాతో గడుపుతున్నారు. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు