
ఒకే వ్యక్తిని 103 సార్లు కాటేసిన నాగుపాములు
నాలుగు రోజుల క్రితం మరోసారి కాటేయడంతో ఆస్పత్రి పాలు
పదేళ్ల వయసు నుంచి ఇప్పటికీ వదలని వైనం
ఇదో మిరాకిల్ అంటున్న వైద్యులు
చిత్తూరు జిల్లా కుమ్మరకుంటలో విచిత్ర ఘటన
పలమనేరు/బైరెడ్డిపల్లె: పిచ్చుగుంట్ల సుబ్రహ్మణ్యం.. ఊరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరకుంట. పదేళ్ల వయసులో ఐదో తరగతి చదువుతున్న అతడిని పశువులు కాస్తున్న సందర్బంలో ఓ నాగుపాము కాటేసింది. ప్రస్తుతం అతడి వయసు 48. ఇప్పటివరకు నాగుపాములు అయన్ని 103సార్లు కాటేశాయి. అయినా.. ఎప్పటికప్పుడు చికిత్స పొందుతూ మృత్యుంజయుడిగా మారాడు.
తాజాగా నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ‘ఇదో మిరాకిల్’ అంటూ వైద్యులే షాకవుతున్న ఈ విచిత్రమైన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే..
సుబ్రహ్మణ్యేశ్వరుడి కృపతో పుట్టారట
బైరెడ్డిపల్లె మండలం కుమ్మరకుంటకు చెందిన పిచ్చుగుంట్ల కుప్పయ్య దంపతులకు పెళ్లయిన చాలాకాలం వరకు సంతానం లేదు. దీంతో ఆ దంపతులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి సంతానం కోసం మొక్కుకున్నారట. మొక్కు సాకారమై కొడుకు పుట్టడంతో అతడికి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. సుబ్రహ్మణ్యం ఐదో తరగతి చదువుతూ పొలంలో పశువులను కాస్తుండగా మొదటిసారి నాగుపాము అతన్ని కాటేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడికెళ్లినా పాములు అతడిని వదలడం లేదు.

తొలినాళ్లలో పెద్దగా ఆస్పత్రులు లేకపోవడంతో సుబ్రహ్మణ్యం పాము కాటేసినప్పుడల్లా బైరెడ్డిపల్లిలోనే నాటువైద్యుడు దైవకటాక్షం వద్ద చికిత్సలు పొందేవాడు. ఆ తరువాత బైరెడ్డిపల్లి పీహెచ్‌సీ, కోలార్ మెడికల్ కాలేజీ, పీఈఎస్ కుప్పం, పెద్దపంజాణిలోని క్రిస్టియన్ ఆస్పత్రి, జేఎంజే గుట్టూరులో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడుతున్నాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం ఇంటిముందు మంచంపై కూర్చుని ఉండగా.. వెనుకనుంచి వచి్చన పాము కాలిపై కాటేసింది. గుట్టూరులో చికిత్స పొంది మంగళవారం అతడు డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు.
చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చు
103సార్లు పాముకాట్లకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు పెట్టాడు. తనకున్న మూడెకరాల పొలం కాస్తా ఇప్పుడు రెండెకరాలకు చేరింది. ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి ఇలా పాముకాట్ల నుంచి బయటపడుతున్నాడు. సుబ్రహ్మణ్యంను రైతులెవరూ కూలి పనులకు సైతం పిలవడం లేదు.

కూలి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తే తాము బాధ్యులమవుతామనే భయమే దీనికి కారణం. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందోననే ఆందోళనతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. దీనిపై వైద్యులు సైతం ఇదో మిరాకిల్ అంటున్నారు. ఇలా ఎవరికీ జరగదని.. ఇతడినే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు.
తిరగని గుడుల్లేవు
చిన్నప్పటి నుంచి పాము కలలో కనిపించేది. పాముకాట్లు మొదలయ్యాక నాగదోషం ఉందని కాళహస్తి వెళ్లా. తరువాత తిరుత్తణికి జీవిత కావడి మోస్తున్నా. వీరనాగమ్మ మా ఇలవేల్పు కాబట్టి.. ఇంటివద్ద నాగులు రాళ్లకు పూజలు చేస్తున్నా. కొక్కే సుబ్రహ్మణ్యస్వామి, తిరువణ్ణామలై, కురుడమళై కులదేవీ తదితర ఆలయాలకు తిరిగినా పాము కసి వదలిపెట్టలేదు. – సుబ్రహ్మణ్యం, నాగుపాము కాటు బాధితుడు
నాగుపాములు పగబట్టవు
నాగుపాములు పగబడతాయనేది నిజం కాదు. పాములకు ఉండేది చిన్నపాటి మెదడు. దీనివల్ల వాటికి జ్ఞాపకశక్తి తక్కువ. ఏవేవో పాములు అతన్ని యాధృచ్చికంగా కాటేస్తుండవచ్చు. పగబట్టి మాత్రం కాదు. ఇలాంటి మూఢనమ్మకాలతో తనకు నాగదోషం ఉందని, పాము పగబట్టిందని భావించడం వట్టి ట్రాష్ మాత్రమే. మేం అతడింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాం. – యుగంధర్, జన విజ్ఞాన వేదిక నాయకుడు, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment